కాళేశ్వరానికి నిధుల వేట

4 Jul, 2016 03:34 IST|Sakshi
కాళేశ్వరానికి నిధుల వేట

- ప్రాజెక్టు కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చుకునే పనిలో ప్రభుత్వం
- కార్పొరేషన్‌ను రిజిస్టర్ చేసే పనులు వేగిరం చేయాలని ముఖ్యమంత్రి సూచన
- రూ.100 కోట్ల మూలధనాన్ని సమకూర్చుతామని హామీ
- ఈనెల 15న ఒప్పందాల ప్రక్రియ జరిగిన వెంటనే నిధుల సేకరణ వేగిరం
 
 సాక్షి, హైదరాబాద్ :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులకు నిధుల వేట ప్రారంభమైంది. ఈ నెల 15న మహారాష్ట్రతో ఒప్పందాల ప్రక్రియ కొలిక్కి వస్తుండటం, ప్రాజెక్టు రీ డిజైన్ కసరత్తు చివరి దశలో ఉండటంతో నిధుల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్’ పేరుతో ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్(ఎస్‌పీవీ)ని రిజిస్టర్ చేయాలని ఇటీవల సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా సూచించడంతో ఈ పనులు చకచకా జరుగుతున్నాయి.

ఇప్పటికే కార్పొరేషన్‌లో సభ్యులుగా ఉండే వారి వివరాలతో కూడిన నివేదికలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు చేరాయి. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేపట్టిన ప్రభుత్వం.. చాలా చోట్ల ప్రతిపాదిత రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచగా, మరికొన్ని చోట్ల కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టింది. దీనికి అనుగుణంగా పంప్‌హౌస్‌లు, మోటార్లు, కాల్వల ప్రవాహ సామర్థ్యాలను మార్చింది. ఈ మార్పుల కారణంగా రూ.38,500 కోట్ల మేర ఉన్న ప్రాజెక్టు తొలి అంచనా ఏకంగా రూ.80 వేల కోట్లకు పెరుగుతోంది. ప్రభుత్వ లక్ష్యంమేరకు 2022 లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఏటా రూ.8 వేల నుంచి రూ.10 వేల కోట్ల మేర నిధుల కేటాయింపు జరపాల్సి ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టుకు రూ.6వేల కోట్ల కేటాయింపులు చేశారు. మున్ముందూ ఇంతకుమించి నిధులు కేటాయించాల్సి ఉంది. ఈ స్థాయిలో నిధుల కేటాయింపు ఆషామాషీ కానందున, ఇతరత్రా మార్గాల ద్వారా నిధుల సమీకరణ చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఇందుకు ప్రపంచబ్యాంకు, జపాన్‌బ్యాంకు, నాబార్డు, ఎల్‌ఐసీ సహా ఇతరత్రా ఆర్థిక సంస్థల ద్వారా నిధులు సమకూర్చుకోవాల్సిన దృష్ట్యా ప్రాజెక్టుకోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.

 నిధుల వ్యవహారాలన్నీ కార్పొరేషన్ చేతికే..
 కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక రూపకల్పన, పనుల మదింపు, నిధుల విడుదల, నిర్వహణ, పర్యవేక్షణ.. మొత్తం బాధ్యతలను ఈ కార్పొరేషన్‌కే ప్రభుత్వం అప్పగించింది. ఆర్థిక సంస్థలతో చర్చలు జరపడం, నిధుల వ్యయం వ్యవహారాలన్నీ ఈ కార్పొరేషనే చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టు సమగ్ర రూపం కొలిక్కి రావడం, మహారాష్ట్రతో ఒప్పందాల ప్రక్రియ ముగిసిన వెంటనే మేడిగడ్డ బ్యారేజీలు సహా ఇతర పనులను వేగిరం చేయాలని ఇటీవల ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

ఈ ప్రక్రియ పూర్తవగానే రూ.100 కోట్ల మూలధనాన్ని కార్పొరేషన్‌కు సమకూరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీంతో కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు వేగిరం చేశారు. బోర్డు చైర్మన్‌గా ఉండే నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సీఈఓ, మెంబర్ కన్వీనర్‌గా ఉండే ప్రాజెక్టు సీఈ, ఇతరసభ్యులుగా ఉన్న ఈఎన్‌సీ, ట్రాన్స్‌కో డెరైక్టర్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ, కరీంనగర్ సీఈ, నీటి పారుదల శాఖ డిప్యూటీ సెక్రెటరీ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ డెరైక్టర్‌ల పూర్తి వివరాలను ఇప్పటికే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు పంపారు. అక్కడ అన్ని వివరాల పరిశీలన అనంతరం కార్పొరేషన్ రిజిస్టర్ అయిన వెంటనే ప్రభుత్వం నిధులకోసం ఆర్థిక సంస్థలను సంప్రదించనుంది.

మరిన్ని వార్తలు