దుప్పులను వేటాడినోళ్లను వదలం: ఈటల

2 Apr, 2017 19:05 IST|Sakshi
సాక్షి, కరీంనగర్: మహదేవ్‌పూర్‌ అడవుల్లో జరిగిన దుప్పుల వేట కేసులో నిందితులను వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ కేసులో ఏ పార్టీ వారున్నా ఉపేక్షించేది లేదని, అధికారి పార్టీ వారైనా శిక్షార్హులేనన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తమ పార్టీ వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. 
 
ఆదివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంథనిలో దళిత యువకుడు మధుకర్‌ సంఘటనపైనా సమగ్ర విచారణకు ఆదేశించామని, వాస్తవాలు త్వరలోనే వెల్లడవుతాయని అన్నారు. ప్రేమించుకున్న ఇద్దరినీ పెద్దలు కాదనడంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో మధుకర్‌ మృతి చెందినట్లు అతని మేనమామ పాల్‌ చెబుతున్నారని, ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
 
 కులాలు 70 ఏళ్ల కిందటే పోయాయని, దళిత యువకుడిని ప్రేమ, పెళ్లికి దూరం చేయడాన్ని ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. మహదేవ్‌పూర్, మంథని సంఘటనలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా రబీ ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సారి అంచనాకు మించి ధాన్యం వచ్చే అవకాశం ఉందని భావించి రాష్ట్ర వ్యాప్తంగా అదనపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  ఆ ధాన్యం తడవకుండా, నిల్వ చేసేందుకు సరిపడా గన్నీసంచులు, టార్పాలిన్లు, గోదాములను సిద్దం చేశామని మంత్రి చెప్పారు. కాళేశ్వరం, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు తదితర పుణ్యక్షేత్రాలను భక్తుల దర్శనీయ కేంద్రాలుగా, పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని ఈటల రాజేందర్ అన్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు