-

భార్యను హత్యచేయించిన భర్త అరెస్ట్

5 Jun, 2015 19:17 IST|Sakshi

అబిడ్స్ (హైదరాబాద్) : కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యను చంపించిన భర్తతో పాటు ఇద్దరు నిందితులను టప్పాచబుత్ర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ రాంభూపాల్‌రావు.. ఇన్‌స్పెక్టర్ బి.రవీందర్‌తో కలసి శుక్రవారం టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుడిమల్కాపూర్ విశ్వేశ్వర్‌నగర్‌లో నివసించే బి.మంజుల(24), రాజేంద్రనగర్ బండ్లగూడకు చెందిన యశ్వంత్‌కుమార్(30) ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాలు తలెత్తటంతో ఏడాది నుంచి మంజుల కుమారుడు అభిషేక్‌తో కలిసి విశ్వేశ్వర్‌నగర్‌లోని తల్లి కళావతి వద్ద ఉంటోంది. కాగా కుమారుడిని తనకు అప్పగించాలని యశ్వంత్‌కుమార్ ఆమెను డిమాండ్ చేస్తున్నాడు. గత డిసెంబర్‌లో ఇదే విషయమై కోర్టులో కేసు కూడా వేశాడు. కాగా ఈ నెల 6వ తేదీన కోర్టులో కేసు విచారణకు రానుంది.

అయితే 20 రోజుల క్రితం అభిషేక్‌ను తనకు అప్పగించాలని, తనతోపాటు ఉండాలని మంజులను యశ్వంత్‌కుమార్ డిమాండ్ చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకుని, అంతం చేయాలనుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితుడు అరవింద్‌యాదవ్(36)ను ఆశ్రయించాడు. రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అరవింద్‌ యాదవ్ అతడి మరో స్నేహితుడు హరీష్‌కుమార్(28)తో కలసి మంజుల హత్యకు కుట్ర పన్నారు. ఈనెల 1వ తేదీన సాయంత్రం విశ్వేశ్వరనగర్‌లోని మంజుల ఇంటికి అరవింద్‌యాదవ్, హరీష్‌కుమార్ వెళ్లారు. ఇద్దరూ కలసి మంజులను, అడ్డువచ్చిన ఆమె తల్లిని కత్తితో గొంతు కోసి చంపారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు యశ్వంత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో కుట్ర వెలుగులోకి వచ్చింది. అరవింద్‌ యాదవ్, అతడి స్నేహితుడు హరీష్‌కుమార్‌లతో కలసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో శుక్రవారం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు