కట్టుకున్నోడే కడతేర్చాడు

11 Apr, 2019 16:47 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న అడిషనల్‌ డీసీపీ

గొంతు నులిమి.. 

ఆత్మహత్యగా చిత్రీకరణ

చిన్నకోడూరు మండలంలో ఘటన

చిన్నకోడూరు(సిద్దిపేట): జీవితాంతం కలిసి ఉంటాడనుకున్న భర్తే కాలయముడయ్యాడు. కట్నం కోసం కట్టుకున్న భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండల పరిధిలోని విఠలాపూర్‌లో బుధవారం కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగసాని శ్రీనివాస్‌రెడ్డికి మంగమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కాగా శ్రీనివాస్‌రెడ్డి ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు.  

ఈ నేపథ్యంలో మంగమ్మను కట్నం కోసం అత్తింటి వారు వేధింపులకు గురి చేయడంతో మనస్థాపం చెందిన మంగమ్మ  10 ఏళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.  ఆ తర్వాత శ్రీనివాస్‌రెడ్డి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో రాయచూర్‌కు చెందిన ఇందిర అనే మహిళతో పరిచయం ఏర్పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తిరిగి శ్రీనివాస్‌ రెడ్డి స్వగ్రామమైన విఠలాపూర్‌కు వచ్చి ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నాడు. వీరికి లోకేష్‌(06) కుమారుడు ఉన్నాడు. కొద్ది నెలలుగా మరిది, అత్త, ఆడపడుచులు ఇందిరను కట్నం కోసం వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని ఇందిర తన సోదరుడికి సమాచారం అందించింది.

అయినప్పటికీ వారి వేధింపులు అలాగే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. బుధవారం తెల్లవారు జామున శ్రీనివాస్‌రెడ్డి భార్య ఇందిరను గొంతు నులిమి హత్య చేశాడు. కాగా తానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు చిత్రీకరించాడు. విషయం తెలుసుకున్న సిద్దిపేట అడిషనల్‌ డీసీపీ నర్సింహారెడ్డి, రూరల్‌ సీఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐ అశోక్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు.  

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతురాలి బంధువులు  శ్రీనివాస్‌రెడ్డి, అత్త భూదవ్వ,  ఆడపడుచు రేణుక,  మరది కనకారెడ్డిలే హత్య చేశారని ఆరోపించారు. వారిని శిక్షించే వరకు ఇక్కడ నుంచి మృతదేహాన్ని తరలించొద్దని బీష్మించారు. దీంతో మృతురాలి భర్త శ్రీనివాస్‌రెడ్డి, అత్త భూదవ్వలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతురాలి సోదరుడు గట్టు వీరేశ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు. ముందస్తుగా గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు.
 

మరిన్ని వార్తలు