కూర వండలేదని హత్య

17 Oct, 2014 01:44 IST|Sakshi
కూర వండలేదని హత్య

 జీడిమెట్ల: భర్త చేతిలో ఓ నవవధువు హత్యకు గురైంది. తప్పతాగి వచ్చిన ఆ దుర్మార్గుడు కూర వండలేదని గొంతు నులిమి భార్య ఉసురుతీశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.  ఈ దారుణ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై భూపాల్ గౌడ్, మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం... మెదక్‌జిల్లా ఆందోల్ మండలం తాడ్మనూర్ గ్రామానికి చెందిన మహ్మద్ హుస్సేన్, మహబూబ్ బీలకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుతురు మోసిన్(19)ను గాజులరామారం డివిజన్ శ్రీరాం నగర్‌లో ఉండే దూరపు బంధువు మహ్మద్ ఫరీద్ 3వ కుమారుడు ఎండీ ఎజాస్(22)కు ఇచ్చి ఐదు నెలల క్రితం పెళ్లి చేశారు.   కట్నం కింద అతనికి రూ.40 వేల నగదు, తులం బంగారంతో పాటు వంటసామగ్రి, బైక్ ఇచ్చారు. ఎజాస్ కూలి పనులు చేస్తుంటాడు.

భార్య మోసిన్ అంటే మొదటి నుంచీ అతనికి ఇష్టం లేదు.  బుధవారం రాత్రి 10 గంటలకు తప్ప తాగి ఇంటికి వచ్చిన ఎజాస్ అన్నం పెట్టమని భార్యను అడిగాడు. అన్నం వడ్డించిన ఆమె కూర వండలేదని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన ఎజాస్ భార్యతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం సమీపంలో ఉండే బంధువులకు విషయాన్ని చెప్పి తెల్లవారుజామున 3 గంటలకు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వెంటనే సీఐ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.  మోసిన్ హత్య విషయం తెలిసి నగరానికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.  అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని రాక్షసుడికి ఇచ్చి చంపుకున్నామని వారు రోదించిన తీరు అందరి హృదయాలను కలచి వేసింది. 

మరిన్ని వార్తలు