వేరు కాపురం పెట్టి.. భార్య హత్య

26 Nov, 2019 10:40 IST|Sakshi
రేణుక మృతదేహం

గద్వాల క్రైం: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త గొంతునులిమి హత్య చేసిన సంఘటన సోమవారం సాయంత్రం గద్వాలలో చోటు చేసుకుంది. స్థానికులు, పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. గద్వాలలోని తెలుగు రంగన్న, అంజనమ్మల దంపతుల కుమారుడు రామాంజనేయులుకు మల్దకల్‌ మండలం వామనపల్లికి చెందిన తెలుగు రేణుక(22)తో మూడేళ్ల క్రితం వివాహం చేశారు. అనోన్యంగా ఉంటున్న క్రమంలో రేణుక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని రామాంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను ఎలాగైనా అంతం చేయాలని పథకం వేశాడు. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న నేపథ్యంలో భార్యను ఏం చేయలేక గత 20 రోజుల క్రితం రామాంజనేయులు తల్లిదండ్రులతో ఘర్షణ పడి నాయిబ్రాహ్మణకాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఇంట్లో భార్యను గొంతునులిమి హత్య చేసి పారిపోయాడు. వీరికి ఒక సంవత్సరం బాబు ఉన్నాడు. సంఘటన జరిగిన విషయాన్ని అదే కాలనీలో గొర్రెలు కాస్తున్న వ్యక్తి ఇంట్లో నుంచి కేకలు రావడంతో అక్కడకి వెళ్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. రామాంజనేయులుకు ఇదివరకే ఓ మహిళతో వివాహం కాగా విడాకులు ఇచ్చాడు. రేణుక బంధువుల అమ్మాయి కావడంతో గత మూడేళ్ల క్రితం కుటుంబ సభ్యులు మళ్లీ వివాహం జరిపించారు. రామాంజనేయులు ఓ ప్రైవేట్‌ సెల్‌ఫోన్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.  

మరిన్ని వార్తలు