ఉద్యమాలకు పురిటిగడ్డ హుస్నాబాద్‌

26 Nov, 2018 12:04 IST|Sakshi
హుస్నాబాద్‌ నియోజకవర్గం

రజాకార్లపై రణభేరి

మూడు జిల్లాలతో ముడిపడి ఉన్న హుస్నాబాద్‌

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు స్వగ్రామం ఈ నియోజకవర్గం

సాక్షి, భీమదేవరపల్లి (హుస్నాబాద్‌): ఉద్యమాలకు ఊపిరిగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకారులను ఎదిరించి రణభేరి మోగించిన ధీరత్వం ఆ ప్రాంతానిది. ఒకప్పుడు మావోయిస్ట్‌ కార్యకలపాలకు అడ్డగా ఉన్న హుస్నాబాద్‌కు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇదే నియోజకవర్గంలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందినవారే. ఆసియాలోనే అతిపెద్ద స్థూపం సైతం హుస్నాబాద్‌లోనే ఉంది. ముల్కనూర్‌ సహకార గ్రామీణ బ్యాంక్, ముల్కనూర్‌ సహకార డెయిరీ, ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం సైతం ఈ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలోనే ఉన్నాయి. ప్రస్తుతం మూడు జిల్లాలతో హుస్నాబాద్‌ ముడిపడి ఉంది. 


విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా హుస్నాబాద్‌ నిలుస్తుంది. ఎర్రజెండా నీడలో ఒదిగినా,  తెలుగుదేశం ప్రభంజనంలో తన ప్రత్యేకతను చాటుకున్నా.. కాంగ్రెస్‌ను ఆదరించినా,  తెలంగాణ ఉద్యమంలో శీఖరాగ్రానికి చేరుకొని టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచినా హుస్నాబాద్‌ ఓటర్ల తీర్పు విలక్షణం.  హుస్నాబాద్‌ 1952 సంవత్సరంలో నుస్తులాపూర్‌ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. 1957లో ఇందుర్తి నియోజకవర్గంలో కలిసింది. ఇందుర్తి నియోజకవర్గంలో హుస్నాబాద్, చిగురుమామిడి, కోహెడ, బెజ్జంకి మండలాలు ఉండేవి.  2009 నియోజకవర్గాల పునర్విభజనలో హుస్నాబాద్‌గా మారి ఆరు మండలాలతో నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడింది. ప్రస్తుతం ఒక కొత్త మండలం అయింది. ఇందుర్తి నియోజకవర్గంలో ఉన్న బెజ్జంకి మండలం మానకొండూరు నియోజకవర్గంలోకి  వెళ్లిపోగా హుజురాబాద్‌ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్‌ మండలాలు  హుస్నాబాద్‌ నియోజకవర్గంలోకి వచ్చి చేరాయి. కోహెడ, చిగురుమామిడి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హుస్నాబాద్, సైదాపూర్‌ మండలాలతో కలిపి హుస్నాబాద్‌ నియోజకవర్గంగా అవతరించింది. 

మొదటి నుంచి విలక్షణమే...
నుస్తులాపూర్‌ నుంచి హుస్నాబాద్‌ నియోజకవర్గం వరకు ఈ నియోజకవర్గం విలక్షణ పంథానే ఎంచుకుంటూ వస్తుంది. స్వాతంత్య్రం అనంతరం కమ్యూనిస్టుల ప్రభావం ఈ ప్రాంతంలో తగ్గలేదు. నాడు కమ్యూనిస్టులకు పెట్టనికోటగా నిలిచినప్పటికీ బొప్పరాజు లక్ష్మికాంతారావు కాంగ్రెస్‌ పార్టీ పక్షాన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 తెలుగుదేశం ప్రభంజనంలో సైతం కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మికాంతారావు విజయం సాధించారు. హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులు ఒక్కసారి కూడా గెలుపొందలేదు. ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ రెండు సార్లు, సీపీఐ ఆరు సార్లు, కాంగ్రెస్‌ ఐదు సార్లు, టీఆర్‌ఎస్‌ ఒక్కసారి విజయం సాధించాయి.

అక్కడ అధికారం...ఇక్కడ ప్రతిపక్షం
నుస్తులాపూర్‌ నియోజకవర్గం నుంచి ఇప్పటి హుస్నాబాద్‌ నియోజకవర్గం వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాలుగుసార్లు మినహా ప్రతిసారి ప్రభుత్వేతర ఎమ్మెల్యేలను గెలిపించడం ఇక్కడి ప్రజలది ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. 1952లో నుస్తులాపూర్‌ నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థి సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి, 1957లో  ఇందుర్తి నియోజకవర్గం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థి చామనపల్లి చొక్కారావు విజయం సాధించగా అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. 1962, 67లో కాంగ్రెస్‌ అభ్యర్థి బొప్పరాజు లక్ష్మికాంతారావు గెలుపొందగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. 1972లో  సీపీఐ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి , 1978లో సీపీఐ అభ్యర్థి దేశిని మల్లయ్య గెలిచినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది.

1983లో కాంగ్రెస్‌ అభ్యర్థి బొప్పరాజు లక్ష్మికాంతారావు గెలుపొందగా, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1985, 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి దేశిని మల్లయ్య వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. అప్పుడు కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నాయి. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బొమ్మ వెంకటేశ్వర్లు గెలిపొందారు. 2004లో సీపీఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డి విజయం సాధించారు, 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి వొడితెల సతీష్‌కుమార్‌ గెలిపొందగా ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

మూడు జిల్లాలు...
కరీంనగర్, వరంగల్, సిద్ధిపేట జిల్లాలో ఉన్న హుస్నాబాద్‌ నియోజకవర్గం చారిత్రక నేపథ్యంతో పాటు భౌగోళికంగా చాలా పెద్దది. హుస్నాబాద్‌ శాసనసభ నియోజకవర్గంలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, చిగురుమామిడి, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు ఉన్నాయి. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం 3లక్షల 5వేల 333 జనాభా ఉంది. జిల్లాల విభజన అనంతరం కరీంనగర్‌తో అనుబంధాన్ని తెంచుకొని కొత్త బంధాల వైపుగా అడుగులు వేసి హుస్నాబాద్‌ నియోజకవర్గం మూడు జిల్లాలతో ముడిపెట్టుకుంది.

నియోజకవర్గం అంతా వ్యవసాయ ఆధారిత  ప్రాంతం. వర్షంపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. 80 శాతం మంది రైతులు, కూలీలు ఉన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో వెనుకబడి ఉన్నా రాజకీయ చైతన్యంలో ముందు వరుసలో ఉంటుంది.  ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని సంకల్పించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నియోజకవర్గంలో గౌరవెల్లి, గండిపెల్లి, తోటపల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తోటపల్లి ప్రాజెక్టును రద్దు చేసి, గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.

హుస్నాబాద్‌ నియోజకవర్గం

పురుషులు 1,08,827
స్త్రీలు    1,09,525
ఇతరులు   09
మున్సిపాలిలీ 01
మండలాలు  07
పోలింగ్‌ కేంద్రాలు    292
గ్రామాలు    162
మొత్తం ఓటర్లు

2,18,361

మరిన్ని హుస్నాబాద్‌ నియోజకవర్గం వివరాలు..
 

మరిన్ని వార్తలు