హుస్సేనీఆలం ఎస్‌బీఐ బ్యాంకు మూసివేత

7 Jun, 2020 08:59 IST|Sakshi

సాక్షి, చార్మినార్‌ : మూసాబౌలీలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. హుస్సేనీఆలంలోని తన బ్రాంచ్‌ను మూసివేసింది. ఈ నెల 14వ తేదీ వరకు బ్యాంక్‌ సిబ్బంది అందుబాటులో ఉండని కారణంగా బ్యాంక్‌ను మూసివేసినట్లు సంబంధిత అధికారులు బ్యాంక్‌ వద్ద నోటీసు బోర్డు ఏర్పాటు చేసారు. బ్యాంక్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా  పాజిటివ్‌ రావడంతో బ్యాంక్‌లోని సిబ్బందిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా పంజేషా యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రానా తబస్సుం ఆదేశించారు. బ్యాంక్‌లోని మేనేజర్‌తో పాటు మొత్తం సిబ్బందిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచించడంతో బ్యాంక్‌ లావాదేవీలు స్తంభించిపోయాయి. బ్యాంక్‌ మూత పడినప్పటికీ..ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, యునోతో పాటు ఏటీఎంలు పని చేస్తాయని.. అవసరమైన ఖాతాదారులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని నోటీసు బోర్డులో సూచించారు. అత్యవరమైన సేవల కోసం దగ్గర్లోని కోట్ల అలీజా, మీరాలంమండిలలోని బ్రాంచ్‌లను సంప్రదించవచ్చన్నారు. (ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా.. హైకోర్టుకు తాళం)

భయాందోళనలో బ్యాంక్‌ సిబ్బంది, ఖాతాదారులు 
బ్యాంక్‌ ఉద్యోగి కరోనా వైరస్‌ బారిన పడడంతో ఇప్పటి వరకు ఈ బ్యాంక్‌లో లావాదేవీలు కొనసాగించిన ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్‌ సిబ్బందితో దగ్గరగా మెలిగిన వారందరూ తమ పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు. వాస్తవానికి బ్యాంక్‌ ప్రాంగణంలోనికి ఎవరిని అనుమతించకుండా ప్ర«ధాన ద్వారం వద్ద నుంచే లావాదేవీలకు అనుమతించినప్పటికీ..ఖాతాదారుల్లో ఆందోళన తగ్గడం లేదు. బ్యాంక్‌ ఉద్యోగికి నిర్వహించిన రక్త పరీక్షల్లో ఈ నెల 3న కరోనా పాజిటివ్‌ అని రిపోర్టులు రావడంతో అటు తోటి ఉద్యోగులతో పాటు ఖాతాదారులు నివ్వెర పోయారు.

బ్యాంక్‌లోని సిబ్బందిని పూర్తిగా హోమ్‌ క్వారంటైన్‌ చేసినప్పటికీ..కరోనా పాజిటివ్‌ లక్షణాలుంటే వెంటనే రక్త పరీక్షలు నిర్వహించుకోవాలని  వైద్యులు సూచిస్తున్నారు. సిబ్బంది తమలో ఎంత మందికి ఈ వైరస్‌ సోకిందోనని ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది ఖాతాదారులు భౌతిక దూరం పాటించకుండా మాస్క్‌లు ధరించడం లేదని బ్యాంక్‌ సిబ్బంది ఆరోపిస్తున్నారు. తాము మాస్క్‌లు, శానిటైజర్స్‌ వినియోగించినప్పటికీ.. తమలో ఒకరికి కరోనా వైరస్‌ సోకిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు