మటన్‌ వ్యాపారి ఇంట్లో 14 కరోనా కేసులు

27 May, 2020 12:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కొంత మంది చేస్తున్న నిర్వాకాల వల్ల కరోనా కట్టడి కాకపోగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా నగరంలోని పహాడీషరీఫ్‌లో మటన్‌ వ్యాపారి ఏర్పాటు చేసిన గెట్‌ టు గెదర్‌ పార్టీ కొంపముంచింది. ఆ పార్టీకి హాజరైన వారిలో 22 మందికి కరోనా వైరస్‌ సోకింది. అందులో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ మటన్ వ్యాపారికి జియాగూడలోని బంధువుల ద్వారా సోకినట్టుగా తెలుస్తోంది. పార్టీకి ఆ కుటుంబానికి చెందిన గౌలీపుర, బోరబండ, సంతోష్ నగర్, హర్ష గూడ ప్రాంతాల నుంచి పలువురు హాజరయ్యారు. కాగా.. ఇప్పటికే పహడీషరీఫ్‌లో వారి కుటుంబంలో 14 మందికి బోరబండలో 3, సంతోష్ నగర్‌లో 2, హర్షగూడలో 4 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. మరిన్ని శాంపిల్స్ రిజల్ట్ రావాల్సి ఉంది. చదవండి: జియాగూడలో కొనసాగుతున్న ఇంటింటి సర్వే

దీంతో రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు మటన్ వ్యాపారి దగ్గర కొనుగోళ్లు చేసిన వారి గురించి ఆరా తీస్తున్నారు. జియాగూడ, గౌలిపుర, సంతోష్‌ నగర్‌, మహేశ్వరం, బోరబండ, హర్షగూడ ప్రాంతాలను కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా గుర్తించారు. ఇంటింట సర్వేకు గానూ 40 వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకూ మొత్తం 125 కుటుంబాలను పోలీసులు గుర్తించారు. మొదటి కాంటాక్టులో 21 మంది, సెకండ్ కాంటాక్టులో 47 మందిని గుర్తించడం జరిగింది. ఇప్పటివరకు గ్రీన్ జోన్లుగా ఉన్నవి రెడ్‌ జోన్లుగా మారటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: ధూంధాంగా నిశ్చితార్థం: 15 మందికి కరోనా

>
మరిన్ని వార్తలు