ఆహా ఆన్‌లైన్‌ భోజనం..

21 Jan, 2020 05:25 IST|Sakshi

ఫుడ్‌ డెలివరీ సంస్థలకు వెల్లువెత్తుతోన్న ఆర్డర్లు

గ్రేటర్‌లో నిత్యం సరాసరిన 54 వేల ఆర్డర్లు

మెట్రోల్లో నాలుగో స్థానంలో హైదరాబాద్‌

తొలి స్థానంలో నిలిచిన బెంగళూరు

ట్రాక్సాన్‌ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో నగరవాసులు ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసేస్తున్నారు. దీంతో ఫుడ్‌ డెలివరీ సంస్థలకు రోజురోజుకూ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. మెట్రో నగరాల్లో ఆ సంస్థల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లలో దేశంలో బెంగళూరు తొలి స్థానంలో ఉంది. తర్వాతి 3 స్థానాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ ఉన్నాయి. ట్రాక్సాన్‌ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విష యాలు వెల్లడయ్యాయి. బెంగళూరులో నిత్యం సుమారు 95 వేల ఆన్‌లైన్‌ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని పేర్కొంది.

ఢిల్లీలో రోజుకు 87 వేలు.. ముంబైలో 62 వేల ఆర్డర్లు అందుతున్నాయని తెలిపింది. నాలుగో స్థానంలో నిలిచిన హైదరాబాద్‌లో నిత్యం 54 వేల ఆర్డర్లు ఫుడ్‌ డెలివరీ సంస్థలకు అందుతున్నాయని పేర్కొంది. దేశంలో సుమారు వెయ్యి వరకు ఫుడ్‌ డెలివరీ సంస్థలుండగా.. ఇందులో వంద వరకు హైద రాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తుండటం విశేషం. స్విగ్గీ, జొమాటో, ఫుడ్‌ పాండా వంటి సంస్థలు ఫుడ్‌ లవర్స్‌కు నచ్చిన ఆహార పదార్థాలను నిమిషాల్లో అందిస్తున్నాయి. ఈ సంస్థల డెలివరీ బాయ్స్‌ కోసమే ప్రత్యేకంగా పలు రెస్టా రెంట్లు, హోటళ్లు టేక్‌అవే కౌంటర్లను ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఇక ఈ ఫుడ్‌ సర్వీసు రంగంలో సేవలందిస్తోన్న పలు ఫుడ్‌ టెక్నాలజీ అంకుర సంస్థల సంఖ్య సైతం రోజురోజుకూ పెరుగుతూనే ఉండటం విశేషం.

ఫుడ్‌ డెలివరీతో లాభం ఇలా..
ఫుడ్‌ డెలివరీ సంస్థలు రూ.350 విలువ గల ఆహార పదార్థాలు మొదలు ఆపై విలువ చేసే ఆర్డర్లను వినియోగదారుల ఇంటి వద్దకే సరఫరా చేస్తున్నాయి. ఇందులో రెస్టారెంట్లు ఆర్డర్‌ చేసే ఆహారం విలువను బట్టి ఈ సంస్థలకు 10 నుంచి 20% కమీషన్‌ అందిస్తున్నట్లు సమాచారం. మరో 5% వినియోగదారుల నుంచి లభ్యమవుతోందట. దీంతో వీటి వ్యాపారం రోజురోజుకూ పెరుగుతూనే ఉందన్నది మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ అంకుర సంస్థల్లో వేలాది మంది యువతకు పార్ట్‌టైమ్‌తోపాటు ఫుల్‌టైమ్‌ కొలువులు దక్కుతుండటం విశేషం. బెంగళూరులో 2016లో రోజుకు సరాసరిన వచ్చే ఆర్డర్ల సంఖ్య 53 వేలుగా ఉండగా.. అది 2020 జనవరి నాటికి 95 వేలకు చేరుకుందని ట్రాక్సాన్‌ తన అధ్యయనంలో పేర్కొంది.

రోజుకు సరాసరిన వచ్చిన ఆర్డర్ల సంఖ్య..
ర్యాంకు   నగరం          2016లో    2020లో  
1          బెంగళూరు    53,000    95,000
2          ఢిల్లీ             36,000     87,000 
3          ముంబై        24,000     62,000 
4          హైదరాబాద్‌  20,000     54,000

మరిన్ని వార్తలు