‘గాంధీ’ మార్చురీ నుంచి భరించలేనంత దుర్వాసన

25 May, 2020 09:26 IST|Sakshi

పది రోజులుగా భరించలేనంతగా దుర్గంధం

అధికారులకు విన్నవించినాఫలితం శూన్యం

అభినవనగర్‌ కాలనీవాసుల ఆగ్రహం

పద్మారావునగర్‌: సికింద్రాబాద్‌ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ నుంచి వెలువడుతున్న తీవ్ర దుర్వాసనను తాము భరించలేకపోతున్నామని అభినవనగర్‌ కాలనీవాసులు వాపోతున్నారు. ఈ మేరకు కాలనీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.రాజేష్‌ గౌడ్‌ ఆదివారం పద్మారావునగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 10 రోజుల నుంచి గాంధీ ఆస్పత్రి మార్చురీ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. మార్చురీలోని ఏసీ పని చేయకపోవడంతో అక్కడ నిల్వ ఉంచిన మృత దేహాల నుంచి పక్కనే ఉన్న కాలనీలకు భరించలేని విధంగా దుర్వాసన వెదజల్లుతున్నదన్నారు.

ఈ విషయమై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఇతర అధికారులకు విన్నవించినా ఫలితంగా లేదన్నారు. దుర్వాసన వల్ల పద్మారావునగర్‌ పరిసర ప్రాంతాల్లోని వందలాది కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని తాము రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమస్యను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పద్మారావునగర్‌ కాలనీవాసులతో కలిసి గాంధీ ఆస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వెంటనే రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేష్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి జోక్యం చేసుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాలనీ అధ్యక్షుడు రాజేష్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు