పారాసిటమాల్‌ మింగి.. దర్జాగా ఇంటికి..!

18 Mar, 2020 19:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల నుంచి వస్తున్నవారు విమానం దిగాక థర్మల్‌ స్క్రీనింగ్‌కు దొరక్కుండా ఉండేందుకు జ్వరానికి ఉపయోగించే పారాసిటమాల్‌ మాత్రలు వేసుకుంటున్నారు. విమానం దిగేందుకు గంట ముందు ఈ మాత్రలు వేసుకుంటున్నారు. దీంతో శరీర ఉష్ణోగ్రతలు తగ్గి స్క్రీనింగ్‌లో దొరక్కుండా ఇదో ఉపాయాన్ని వెతుక్కుంటున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న వారిని ‘సీ’కేటగిరీ కింద భావించి నేరుగా ఇళ్లకు పంపుతారు. ఇంటి దగ్గరే ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. (తెలంగాణలో మరో కరోనా పాజిటివ్‌ కేసు)

జ్వరం ఉంటే ఎక్కడ గాంధీ ఆస్పత్రి లేదా క్వారంటైన్‌ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందోననే భయంతో మరోదారిలో బయటపడుతున్నారు. ఈ విషయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చింది. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసింది. ఇలాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రెండ్రోజుల కిందట ఇలాగే దుబాయి నుంచి వచ్చిన ఓ వ్యక్తి పారాసిటమాల్‌ వేసుకొని, థర్మల్‌ స్క్రీనింగ్‌కు దొరక్కుండా నేరుగా ఇంటికే వెళ్లాడు. దీనిపై ఒకరు వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. (కరోనా.. కోటి రూపాయల నజరానా)

యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తుండంతో విమానాశ్రయాలతో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, రద్దీ ప్రదేశాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు, పార్లమెంట్‌ సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. కోవిడ్‌-19 అనుమానితులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిం​చి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. (కరోనా: తెర వెనుక హీరోపై ప్రశంసలు)

మరిన్ని వార్తలు