బస్తీ కుర్రోడు.. బెస్ట్‌ ఫుడ్‌ బ్లాగర్‌..!

14 Nov, 2019 11:55 IST|Sakshi

స్మార్ట్‌ ఫోన్‌తో విభిన్న ప్రయోగాలు

ఏకంగా 76 వేల మంది ఫాలోవర్స్‌

తెలంగాణ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ గుర్తింపు

అవార్డు అందుకున్న మహ్మద్‌ జుబేర్‌ అలీ 

బంజారాహిల్స్‌: ఒక్కో హోటల్‌ ఒక్కో రుచికి ప్రత్యేకత. కానీ ఆ హోటల్‌లో ఎలాంటి రుచులు లభిస్తాయన్నది అక్కడికి వెళితే గానీ తెలియదు. ఈ నేపథ్యంలోనే పాతబస్తీకి చెందిన ఓ యువకుడికి సరికొత్త ఆలోచన వచ్చింది. వివిధ హోటళ్లలో లభిస్తున్న ఆహార పదార్థాలను పరిచయం చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌చేయడం, హోటళ్లకు ప్రమోషన్‌ కల్పిస్తూ చక్కటి ఉపాధికి బాటలు వేసుకున్నారు. బెస్ట్‌ ఫుడ్‌ బ్లాగర్‌గా, బెస్ట్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌ అవార్డును అందుకుని శెభాష్‌ అనిపించుకున్నారు.  

చార్మినార్‌కు చెందిన మహ్మద్‌ జుబేర్‌ అలీకి 30 ఏళ్లు. బంజారాహిల్స్‌లోని రీజెన్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేశారు. శిక్షణ సమయంలో పలు హోటళ్లను సందర్శించినప్పుడు అక్కడ రుచులను పరిచయం చేసే దిశగా ఆలోచన చేశారు. 9 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ ఫుడ్‌ డైరీస్‌ పేరుతో ఓ సంస్థను ఓ చిన్న గదిలోనే స్మార్ట్‌ ఫోన్‌తో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి ఆయన ఉపాధి యాత్ర ప్రారంభమైంది. ప్రారంభంలో చిన్నచిన్న హోటళ్లలో ఫుడ్‌ను పరిచయం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసేవారు. మెలమెల్లగా ఫాలోవర్స్‌ పెరిగారు. ఇంకేముంది స్టార్‌ హోటళ్ల నుంచి పిలుపు వచ్చింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 76 వేలమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఒక హోటల్‌లో లభిస్తున్న ఫుడ్‌ గురించి పరిచయం చేస్తూ ఫొటోలతో సహా అప్‌లోడ్‌ చేస్తుండటంతో ఆ హోటళ్లకు కూడా కస్టమర్ల ఆదరణ పెరిగింది. దీంతో  మహ్మద్‌ జుబేర్‌ అలీకి తెలంగాణ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ బెస్ట్‌ ఫుడ్‌ బ్లాగర్, బెస్ట్‌ సోషల్‌ మీడియా ప్రభావంతుడి అవార్డును అందజేసింది. నగరంలో ఈ అవార్డు అందుకున్న వారిలో జుబేర్‌ మొట్టమొదటి వ్యక్తి కావడం విశేషం.  

తక్కువ ఖర్చుతో..
హైదరాబాద్‌ ఫుడ్‌ డైరీస్‌ పేరుతో పేజీని ఏర్పాటు చేసుకున్న జుబేర్‌ ఇందుకోసం వేలు, లక్షలు పెట్టుబడి పెట్టలేదు. కేవలం తన చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ద్వారానే ఉపాధి కల్పించుకుంటున్నారు. ఏదైనా హోటల్‌ లేదా స్ట్రీట్‌ ఫుడ్‌పై వ్యాసం రాయాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్లి స్మార్ట్‌ ఫోన్‌తోనే ఆ రుచుల ఫొటోలు తీసి వాటికి సంబంధించి వ్యాసం రాసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేస్తే 76 వేల మందికి అది చేరుతుంది. ఒకరి నుంచి మరొకరికి ఆ రుచుల సమాచారం అందుతుంది. ఇలా ఒక్క స్మార్ట్‌ ఫోన్‌తోనే ఆయన ఈ ఉపాధి పొందుతూ ముందుకు సాగుతున్నారు.నెలనెలా రూ.40వేల నుంచి రూ.70వేల దాకా ఆర్జిస్తున్నానని,  తానొక్కణ్నే ఈ బ్లాగ్‌ నిర్వహిస్తున్నట్లు జుబేర్‌పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా