హైదరాబాద్‌–బీజాపూర్‌.. ఓ రోడ్డు కథ

3 Sep, 2017 01:29 IST|Sakshi
హైదరాబాద్‌–బీజాపూర్‌.. ఓ రోడ్డు కథ

► ప్రమాద రహిత రహదారిగా అభివృద్ధికి 2011లో నిర్ణయం
► ఉచితంగా రూ.59 కోట్లు ఇచ్చిన ప్రపంచ బ్యాంకు
► ఆరేళ్లుగా పడకేసిన పనులు
► ఇప్పుడదే రోడ్డుకు జాతీయ హోదా.. 450 కోట్లతో అంచనా
► మరి ఈ పనులు ఎప్పటికి చేస్తారనే సందేహాలు


సాక్షి, హైదరాబాద్‌: ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక సౌకర్యాలు తప్పనిసరి. అందులోనూ మంచి రోడ్లు ఉండాల్సిందే. మరి మంచి రోడ్డు అంటే ఏంటి..? కేవలం రోడ్డు నిర్మించడం మాత్రమేగాకుండా దానిని పూర్తిగా ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలి. ప్రమాదాలు జరిగినా వెంటనే పూర్తిస్థాయిలో అత్యవసర వైద్యం అందజేసే ఏర్పాట్లు ఉండాలి. ఇలాంటి నమూనా రహదారిని చూపుదామంటూ ప్రపంచబ్యాంకు ముందుకొచ్చింది. 2011లో ‘హైదరాబాద్‌–బీజాపూర్‌’ రహదారిని ఎంపిక చేసి.. ఉచితంగా నిధులు కూడా ఇచ్చింది. కానీ ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో ఆరేళ్లయినా పనులు పూర్తికాలేదు.

2011 నుంచి సాగుతూనే..
తన వద్ద రుణాలు తీసుకున్న దేశాలు/రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు అప్పుడప్పుడు నజరానాలు ఇస్తుంటుంది. ఆ క్రమంలోనే 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రమాదరహిత రహదారుల అభివృద్ధి కోసం ఉచితంగా నిధులిచ్చింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులతో ఆంధ్రా ప్రాంతంలో రెండు రోడ్లను, తెలంగాణలో ఒక రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇలా హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని బీజాపూర్‌ వరకు ఉన్న రహదారిని ఎంపిక చేయగా.. ప్రపంచబ్యాంకు రూ.59 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో హైదరాబాద్‌ శివార్లలోని పోలీస్‌ అకాడమీ దగ్గరి నుంచి మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, కొడంగల్‌ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు 126 కిలోమీటర్ల రహదారిని మెరుగుపర్చాలి. సరిహద్దు నుంచి బీజాపూర్‌ వరకు పనులను కర్ణాటక నిర్వహిస్తుంది.

ఏం చేయాలి..?
ఈ ప్రమాద రహిత రహదారుల్లో అకస్మాత్తు మలుపులు ఉండొద్దు, కూడళ్లు విశాలంగా ఉండాలి, అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించేందుకు లేజర్‌ గన్స్‌ ఏర్పాటు చేయాలి, హైవే పెట్రోలింగ్‌ వాహనాల పహారా ఉండాలి, ప్రమాదాలు జరిగితే వెంటనే అత్యవసర చికిత్స అందేలా ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలి.. ఈ మేరకు హంగులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రహదారుల శాఖ, పోలీసు, వైద్య ఆరోగ్యం, రవాణా తదితర విభాగాల ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. మూడు పెద్ద కూడళ్లు, 21 మలుపులను గుర్తించినా.. కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. ఇక అవసరమైన ఎనిమిది హైవే పెట్రోలింగ్‌ వాహనాలు ఎలా సమకూర్చాలా అన్న తర్జనభర్జనలోనే పోలీసు శాఖ ఉండిపోయింది. రెండు అంబులెన్సులు, ట్రామాకేర్‌ యూనిట్‌ ఏర్పాటుకు సంబంధించి వైద్యారోగ్య శాఖ ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. ఇంతలో ఆరేళ్లు గడిచి.. గడువు పూర్తికావడంతో.. విజ్ఞప్తి చేసి మరింత సమయం పొందారు. అయినా పనులేవీ సరిగా జరగడం లేదు. అంబులెన్సులు కొంటే నిర్వహణ బాధ్యత ఎలాగో తేలక చివరకు 108కే అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఆగిపోయారు. కొత్త ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి.. ఈ రోడ్డుతో సంబంధంలేని తాండూరు ఆసుపత్రిని వాడుకోవాలని నిర్ణయించారు. ఇక పోలీసుశాఖ రెండు చోట్ల ఔట్‌పోస్టు భవనాలు నిర్మించినా.. వాటిల్లో సిబ్బందిని, పరికరాలను ఏర్పాటు చేయలేదు. మొత్తంగా ‘ప్రమాద రహిత’ పనులు ప్రమాదంలో పడిపోయాయి.

జాతీయ రహదారి సంగతేం చేస్తారో..?
ఇటు ‘ప్రమాద రహిత రహదారి’ పనులు పూర్తికానే లేదు. ఈ ఏడాది మార్చిలో ఈ రోడ్డుకు జాతీయ రహదారి హోదా వచ్చింది. ఇది రూ.450 కోట్ల ప్రాజెక్టు. ఆ ప్రక్రియ అయితే ఇప్పటికీ మొదలుకాలేదు. దీనిని రెండు భాగాలుగా విభజించగా.. తొలి భాగానికి సంబంధించి కావాల్సిన భూమి ఎంతో కూడా తేల్చకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు