చినుకు పడితే ట్రిప్పు రద్దు

27 Sep, 2019 11:39 IST|Sakshi

గ్రేటర్‌ ఆర్టీసీలో వారం రోజులుగా ఇదే పరిస్థితి  

రూట్‌ మధ్యలోనే వెనుదిరుగుతున్న బస్సులు

తీవ్ర అవస్థలు పడుతున్న ప్రయాణికులు

దూర ప్రాంత రూట్లలోనే ప్రధాన సమస్య

సాక్షి,సిటీబ్యూరో: సిటీ బస్సులో ప్రయాణిస్తున్నారా..! తస్మాత్‌ జాగ్రత్త. మీరు చేరుకోవాల్సిన గమ్యం వరకు వెళ్లకుండానే ఆ బస్సు రూట్‌ మధ్యలోనే వెనుదిరగవచ్చు. తర్వాత మీరు ఏ ఆటోనో, మరో వాహనమో ఆశ్రయిచాల్సిందే. ప్రయాణికులకు నాణ్యమైన, నమ్మకమైన రవాణా సదుపాయాన్ని అందిస్తున్నట్టు చెబుతున్న గ్రేటర్‌ ఆర్టీసీలో ప్రతిరోజు వేలకొద్దీ ట్రిప్పులు రద్దవుతున్నాయి. చినుకు పడితే చాలు ఠకీమని ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలోని అన్ని రూట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి తదితర ప్రాంతాల నుంచి లింగంపల్లి, బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు వరకు వెళ్లాల్సిన బస్సులను మాసాబ్‌ట్యాంక్, జూబ్లీ చెక్‌పోస్టు తదితర ప్రాంతాల నుంచి వెనక్కి మళ్లిస్తున్నారు. ట్రాఫిక్‌ రద్దీ, వర్షం కారణంగా సకాలంలో బస్సులు నడుపలేకపోతున్నట్లు ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. దీంతో చివరి షెడ్యూల్‌లో వెళ్లవలసిన ట్రిప్పులు పెద్ద ఎత్తున రద్దవుతున్నాయి.

బస్సుల నిర్వహణలో ఉన్నతాధికారులకు, డిపో స్థాయి  అధికారులు, సిబ్బందికి మధ్య కొరవడిన సమన్వయం కూడా ప్రయాణికుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ప్రతి ట్రిప్పులోనూ గమ్యం వరకు వెళ్లి రావాలని నిబంధన ఉన్నప్పటికీ  వివిధ కారణాలతో అర్ధాంతరంగా రద్దు చేసి డిపోలకు చేరుకుంటున్నారు. ఉప్పల్‌ నుంచి కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, వేవ్‌రాక్, మెహదీపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లవలసిన బస్సులు వీఎస్‌టీ, ఇందిరాపార్కు, లిబర్టీ, లక్డీకాపూల్‌ నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి. ఇందుకనుగుణంగా డ్రైవర్లు, కండక్టర్లు బోర్డులు తిప్పేస్తున్నారు. సిటీ బస్సు ఎక్కితే నేరుగా చివరి వరకు వెళ్లవచ్చు.. సకాలంలో ఇంటికి చేరుకోవచ్చునని భావించే వారు ట్రిప్పుల రద్దుతో ఉస్సూరముంటూ బస్టాపుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్‌– లింగంపల్లి, పటాన్‌చెరు, ఉప్పల్‌–మెహదీపట్నం వంటి రూట్లలోనే కాకుండా నగరంలోని అన్ని లాంగ్‌ రూట్లలో చివరి ట్రిప్పులు రద్దవుతున్నాయి. గత వారం రోజులుగా సుమారు 10 వేలకు పైగా ట్రిప్పులు రద్దయినట్లు అంచనా. దీంతో  మహిళలు, పిల్లలు, సీనియర్‌ సిటిజన్స్‌ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

సాయంత్రమైతే ఎదురు చూపులే..
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సాయంత్రం వేళల్లోనే ట్రిప్పుల రద్దీ పెద్ద సమస్యగా మారుతోంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సిటీ బస్సులు అందుబాటులో ఉండడం లేదు. రోజుకు 3500కు పైగా బస్సులు తిప్పుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 32 లక్షల మంది ఈ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. కానీ కొద్దిపాటి వర్షం పడినా, ఏ మాత్రం ట్రాఫిక్‌ రద్దీ కనిపించినా బస్సులను వెంటనే వెనక్కి మళ్లిస్తున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, అల్వాల్, మేడ్చల్‌ తదితర రూట్లలో అన్ని వేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రయాణికులు ఎదురు చూసే సమయానికి బస్సులు అందుబాటులో ఉండవు. నిర్థారించిన సమయానికి గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా వస్తాయి. ఇలా వచ్చిన బస్సులను ఆలస్యం కారణంగా సగం రూట్‌ వరకే నడుపుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

‘బీహెచ్‌ఈఎల్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తాం. కానీ ఆ బస్సు  జూబ్లీ చెక్‌పోస్టు డెస్టినేషన్‌ బోర్డుతో బస్సు వస్తుంది. అందులో వెళ్లడమెందుకనుకొంటే చివరి వరకు వెళ్లే బస్సు మరెప్పటికి వస్తుందో తెలియదు. అసలు వస్తుందో, రాదో కూడా తెలియదు’ అని బీహెచ్‌ఈఎల్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు.

రన్నింగ్‌ టైమ్‌ కొరత కూడా..
మరోవైపు పలు రూట్లలో రన్నింగ్‌ టైమ్‌ కొరత కూడా ఉంది. ఆర్టీసీ నిర్థారించిన సమయానికి చేరుకోలేకపోతున్నారు. ట్రాఫిక్‌ రద్దీ కారణంగా బస్సులు రోడ్లపై నిలిచిపోతున్నాయి. 50 నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యం గంటన్నర దాటినా చేరుకోలేకపోతున్నారు. 8 గంటల షెడ్యూల్‌ సమయంలో 4 ట్రిప్పులు తిరగాల్సి ఉంటే మూడింటికే పరిమితమవుతున్నారు. అన్ని రూట్లలో ఇలాంటి పరిస్థితే ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,050కి పైగా రూట్లలో సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు 42 వేల ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. 10 కిలోమీటర్ల కనిష్ట దూరం నుంచి 45 కిలోమీటర్లకు పైగా ఉన్న రూట్లు ఉన్నాయి. దూరం ఎక్కువగా ఉన్న మార్గాల్లోనే రన్నింగ్‌ టైమ్‌ కొరత తీవ్రంగా ఉన్నట్లు కార్మిక వర్గాలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు