మర్యాద రామన్నలే!

31 Aug, 2018 07:42 IST|Sakshi

తొమ్మిది నెలల్లో ఉల్లంఘన కేసులు 12 మాత్రమే

సీసీ కెమెరాలతో పకడ్బందీగా నిఘా ఏర్పాటు

సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా మారిన మెట్రో  

గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైళ్లలో జర్నీ చేసే వారిలో అధిక శాతం మర్యాద రామన్నలే. తొమ్మిది నెలల మెట్రో జర్నీలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నమోదైన కేసులు కేవలం 12కు మించకపోవడంతో ఈ విషయం విస్పష్టమవుతోంది. పకడ్బందీ చర్యలు చేపట్టడంతో మెట్రో ప్రయాణం సురక్షితంగా మారిందని అవగతమవుతోంది.     

సాక్షి, సిటీబ్యూరో :మహానగరవాసుల ట్రాఫిక్‌ అవస్థలను దూరం చేసేందుకు మెట్రో రైళ్లను గత ఏడాది నవంబరు 29 నుంచి గ్రేటర్‌వాసులకు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. అత్యాధునిక భద్రతా ఏర్పాట్ల మధ్యన మెట్రో స్టేషన్లు, రైళ్లను ఏర్పాటు చేశారు. సుమారు రూ.100 కోట్ల ఖర్చుతో ఒక్కో మెట్రో స్టేషన్‌ను.. రూ.30 కోట్ల ఖర్చుతో ఒక మెట్రో రైలు (మూడు బోగీలను)ను తీర్చిదిద్దారు. వీటిలో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా పకడ్బందీగా సీసీ టీవీల నిఘా ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయడంతో మెట్రో జర్నీ సురక్షితమైన ప్రయాణాన్ని సిటీజన్లకు సాకారం చేస్తోంది.కాగా నగరంలో ప్రస్తునికి నాగోల్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌(30 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లలో ఇటీవలికాలంలో నిత్యం సుమారు లక్షమంది రాకపోకలు సాగిస్తుండడం విశేషం. కాగా రైళ్లలో ప్రయాణించేందుకు వచ్చేవారు సిగరెట్‌లు వెలిగించుకునేందుకు లైటర్లు, అగ్గిపెట్టెలను కూడా వెంట తీసుకొస్తే మెట్రోస్టేషన్‌ సిబ్బంది అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.    

సెక్యూరిటీ చెక్‌ ఇలా.. 
ప్రతీ స్టేషన్‌లో ఎక్స్‌రే బ్యాగేజ్‌ స్కానర్‌లున్నాయి
డీఎఫ్‌ఎండీడోర్‌ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌లున్నాయి
పదికేజీల లగేజినిమాత్రమే మెట్రో జర్నీకి అనుమతిస్తున్నారు
బ్యాగు నిడివి 60 సెం.మీ పొడవు, 45 సెం.మీ వెడల్పు, 25 సెం.మీ
ఎత్తున్న బ్యాగులనే జర్నీకి వినియోగించాలని నిబంధనలున్నాయి  

ఉల్లంఘన కేసులు ఇవీ..
ఓ గుర్తుతెలియని వ్యక్తి లైసెన్సు లేని గన్‌తో మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించడంతో బ్యాగేజీ తనిఖీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు
మెట్రో రైలులో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఘటనపై ఓ కేసు నమోదైంది
మెట్రో స్టేషన్లలో భద్రతా సిబ్బంది, టిక్కెట్‌ జారీచేసే సిబ్బంది, స్మార్ట్‌కార్డు రీచార్జి చేసే సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినందుకు మరో మూడు కేసులు నమోదయ్యాయి
అత్యవసరం కాకపోయినా అత్యవసరంగా మెట్రో రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బటన్‌ నొక్కిన వైనంపై మరో కేసు నమోదైంది
అవగాహన రాహిత్యంతో మెట్రో స్టేషన్లలోకి ప్రవేశించి ట్రాక్‌పై అనుమతి లేకుండా ప్రవేశించిన ఆరుగురిని భద్రతాసిబ్బంది అదుపులోకి తీసుకున్నారు

నిషేధాలివీ..
స్టేషన్‌లు, బోగీలు, పరిసరాల్లో ఉమ్మి వేయడం, చూయింగ్‌గమ్‌ ఊయడం, సిగరెట్లు తాగడం, పాన్‌ నమలడం
మెట్రో రైలు పరిసరాల్లో ఆల్కహాల్‌ తాగవద్దు  
రైలులోకి ప్రవేశించిన తర్వాత ఫొటోలు తీయొద్దు  
వస్తువులను స్టేషన్లు, బోగీల్లో మరచిపోకుండా జాగ్రత్తగా ఉండాలి
ప్లాట్‌ఫాం, స్టేషన్‌ పరిసరాల్లో నిషేధిత ప్రాంతాల్లో కూర్చోవద్దు
రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు తినుబండారాలు, ఆహారం తీసుకోరాదు
పెంపుడు జంతువులను మెట్రో రైళ్లలో తీసుకెళ్లడం నిషేధం
ప్రమాదకర వస్తువులు,అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్న వస్తువులను స్టేషన్‌ పరిసరాలు, బోగీల్లోకి తీసుకురావద్దు
ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాటిపై వాలడం, ఎస్కలేటర్ల పనితీరును అడ్డుకోవద్దు  
ప్లాట్‌ఫాంపై రైలుకోసం వేచిఉండే సమయంలో పసుపురంగు లైన్‌ను దాటి ముందుకు రావద్దు
మెట్రో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు బలవంతంగా రైలు డోర్లు తెరవరాదు. డోర్లకు ఆనుకొని నిల్చోరాదు
చిన్నారులను నిర్లక్ష్యంగా ప్లాట్‌ఫాం, స్టేషన్‌ పరిసరాల్లో విడిచిపెట్టవద్దు  
స్టేషన్, బోగీ పరిసరాలను పాడుచేసిన వారు శిక్షార్హులు.. ఇలా తదితర నిషేధాజ్ఞలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు