బెంగళూరు బస్సు.. బహుబాగు బాసూ!

18 Aug, 2017 01:33 IST|Sakshi
బెంగళూరు బస్సు.. బహుబాగు బాసూ!

ప్రజా రవాణా వ్యవస్థలో అత్యుత్తమ సేవలందిస్తున్న బెంగళూరు..
400 కోట్ల నష్టంతో, తీవ్ర కష్టాల్లో కునారిల్లుతున్న హైదరాబాద్‌ సిటీ ఆర్టీసీ
బెంగళూరు వ్యాప్తంగా బీఎంటీసీ బస్సులు 6,350
మరో 1,600 బస్సుల కొనుగోలుకు ప్రణాళిక
మరోవైపు ఏటా బస్సులను తగ్గిస్తున్న హైదరాబాద్‌
♦  3,700 బస్సులు నడుపుతూ.. భారీ నష్టాల్లో సంస్థ


సాక్షి, హైదరాబాద్‌: రెండు మహా నగరాలు.. కోటి చొప్పున జనాభా! సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో దేశానికే రెండు కళ్లు!! కానీ ప్రజా రవాణా వ్యవస్థ నిర్వహణలో మాత్రం భూమ్యాకాశాలకు ఉన్నంత తేడా! ఈ రెండు మహా నగరాల్లో ఒకటి... అత్యుత్తమ ప్రజా రవాణా సంస్థగా గుర్తింపు పొందిన బెంగళూరు.

మరోటి... ముక్కుతూ మూలుగుతూ పుట్టెడు నష్టాలతో ఆపసోపాలు పడుతున్న హైదరాబాద్‌ ఆర్టీసీ వ్యవస్థ! ఓవైపు మెట్రో రైలు, మరోవైపు కొత్త పుంతలు తొక్కుతున్న ప్రైవేటు క్యాబ్‌ సర్వీసులు, ఆటోలు, సొంత వాహనాలు.. ఇలా పోటీ ఎంతున్నా బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ (బీఎంటీసీ) సగర్వంగా ముందుకు సాగుతోంది. కానీ క్రమంగా బస్సుల సంఖ్య తగ్గించుకుంటూ సాయం కోసం హైదరాబాద్‌ సిటీ బస్సు వ్యవస్థ నిస్తేజంగా మారుతోంది. గతేడాదితో పోలిస్తే నగరంలో వంద బస్సులు తగ్గగా.. అటు బెంగళూరులో కొత్తగా 1,600 బస్సులు కొనేందుకు రంగం సిద్ధం చేస్తోంది..

బెంగళూరు విజయ రహస్యమిదే
ఢిల్లీలోని సాలీనా ఆర్టీసీ కార్పొరేషన్‌ సగటున రూ.వెయ్యి కోట్లు, ముంబై రూ.855 కోట్లు నష్టపోతుంటే, ఇప్పుడు భాగ్యనగరం వాటితో పోటీకి సై అంటూ 2016–17లో రూ.400 కోట్లు నష్టాల మూటగట్టుకుంది. బీఎంటీసీ మాత్రం నాలుగేళ్ల క్రితం వరకు లాభాల్లోనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు నష్టపోయింది. అర్బన్‌ ప్రాంతాల్లోనే ఈ నష్టాలు నమోదు కావడం గమనార్హం. ప్రపంచంలో ఎక్కడైనా అర్బన్‌ ప్రాంతాల్లో నష్టాలు పరిపాటి. అలా చూస్తే అతి తక్కువ నష్టాలున్నది బీఎంటీసీకే.

1. ట్రాఫిక్‌ చిక్కుల్లో బెంగళూరు కూడా ఇతర నగరాలకు తీసిపోదు. కానీ అనుసంధాన మార్గాలు, వంతెనలు, వన్‌వే నిబంధనలు, రోడ్ల విస్తరణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట తదితరాలతో అడ్డంకులను అధిగమిస్తోంది.
2. మెయిన్‌ రోడ్‌కు ఇరువైపులా కాలనీల్లోకి బస్సులు వెళ్లేలా రోడ్లను తీర్చిదిద్దారు. మొదటి కాలనీ అప్రోచ్‌ రోడ్డు 40 అడుగులుంటే, తదుపరి కాలనీ రోడ్డూ అంతే ఉంటుంది.
3. ప్రతి నెలా 4వ తేదీన బస్‌ డే ఉంటుంది. ఆ రోజు జనం బస్సుల్లోనే ప్రయాణిస్తారు.
4. ఏకంగా 655 ఏసీ బస్సులున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వాటికి అలవాటు పడేలా చేశారు.
5. ఆర్టీసీ అధికారులు నిత్యం పర్యటిస్తుంటారు. కొత్త మార్గాల అన్వేషణ బృందాలూ ఉన్నాయి.
6. ప్రభుత్వం ఏటా బడ్జెట్‌ నిధులు కేటాయిస్తోంది.
7. ప్రత్యేకంగా బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌ పోర్టు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని కమిషనర్‌గా నియమించారు.

హైదరాబాద్‌ సమస్యలివే..
ఆర్టీసీ బస్సులు ప్రధాన రోడ్లకే పరిమితమవుతున్నాయి. కాలనీల్లోకి తక్కువ సంఖ్యలో తిరుగుతుండటంతో అవి ప్రయాణానికి అనుకూలం కాదని జనం భావిస్తున్నారు. రోడ్ల ఆక్రమణలు, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనా మందిరాలు, సరైన ప్రణాళిక లేకుండా రోడ్ల నిర్మాణం కారణంగా బస్సులు కాలనీల్లోకి, బస్తీల్లోకి వెళ్లలేకపోతున్నాయి.
తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునే విషయంలో ప్రభుత్వపరంగా బడ్జెట్‌ కేటాయింపుల భరోసా లేదు. బకాయిల చెల్లింపూ లేదు.
బస్సులెక్కేలా నగర ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు శూన్యం. సొంత వాహనాలను నియంత్రించే చర్యలు లేవు. పార్కింగ్‌ వసతి ఉంటేనే వాహనం కొనాలనే బెంగళూరు నిబంధనా ఇక్కడ లేదు.

కాలనీల్లోనూ పరుగుపెట్టాలి..
కేవలం హైవేల మీదుగానే బస్సులు నడుస్తున్నంత కాలం హైదరాబాద్‌లో ప్రజా రవాణా మెరుగవడం కష్టమే. కాలనీలకూ వెళ్లాలి. బెంగళూరులో మెజిస్టిక్‌ నుంచి బన్నేర్‌గట్ట హైవేకు దూరంగా (దాదాపు 25 కి.మీ.) ఉండే అరికెరా వంటి ప్రాంతానికీ నిత్యం సిటీ బస్సులుంటాయి. అవి కాలనీల మీదుగా వెళ్తాయి గనుక కార్లున్న వారూ వాటిలోనే వెళ్తుంటారు. – ఈమని శివనాగిరెడ్డి, రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగి

మెరుగ్గానే నిర్వహిస్తున్నాం
సిటీ బస్సుల నిర్వహణ మెరుగ్గానే ఉందని చెప్పాలి. భారీగా కొత్త బస్సులు కొనాలని ప్లాన్‌ చేశాం, ఇటీవల 80 ఏసీ బస్సులు అందుబాటులోకి తెచ్చాం. మినీ బస్సులూ ప్రారంభించాం. సొంత వాహనాల వాడకాన్ని తగ్గిస్తే సిటీ బస్సులు మంచి సేవలందిస్తాయి  – పురుషోత్తం నాయక్, ఈడీ, హైదరాబాద్‌ సిటీ జోన్‌

ప్రభుత్వ దృక్పథం మారాలి
‘నగరంలో ఏటా ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గటం మంచి పరిణామం కాదు. ప్రజలు సిటీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించేలా ప్రభుత్వం కార్యాచరణ ఏర్పాటు చేయాలి. బెంగళూరును అధ్యయనం చేసి ఇక్కడా అలాంటి చర్యలు తీసుకోవాలి’    – నాగేశ్వరరావు ఆర్టీసీ కార్మిక సంఘం నేత

మరిన్ని వార్తలు