ప్రపంచానికే జనతా కర్ఫ్యూ స్పూర్తి

22 Mar, 2020 13:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నివారణలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో జనతా కర్ఫ్యూ ఆదివారం మొదలైందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. ఉదయం 6 గంటల నుండి జనతా కర్ఫ్యూ ప్రారంభమయిందని.. ప్రజలందరూ స్వచ్ఛందంగా  పాల్గొంటున్నారని అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల మద్దతు ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇలాంటి కర్ఫ్యూ చూస్తున్నామని తెలిపారు. ఎమర్జెన్సీ, మెడికల్ వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, కరోనాకు వ్యతిరేకంగా దేశంలో యుద్ధం జరుగుతోందని.. 24గంటల జనతా కర్ఫ్యూ ప్రజల రక్షణ కోసమేనని తెలిపారు.

దేశ రక్షణ కోసం 99శాతం ప్రజలు ఇంట్లోనే ఉన్నారని.. ఇది ప్రపంచానికే గొప్ప స్పూర్తి అని కొనియాడారు. ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలలో ఇలాంటి ప్రయోగాలు విఫలమయ్యాయని.. కానీ దేశంలో అత్యవసర విభాగాలు తప్ప అన్ని బంద్ అయ్యాయని అన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. పాలు, హాస్పిటల్ లాంటి వాటికి తప్ప మిగతా 24 గంటలు బయటకి రావొద్దని కోరారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ లో పాల్గొంటున్నారని అంజనీ కుమార్‌ పేర్కొన్నారు.

​కాగా కరోనా కట్టడికి ప్రజల సహకారం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలని జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని.. ఎవరైనా కరోనా అనుమానితులుంటే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. వైరస్ విస్తరించకుండా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ లోకేష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు