మరో ఆడియో విడుదల చేసిన కొత్వాల్‌ 

9 Jun, 2018 09:23 IST|Sakshi
సీపీ అంజనీ కుమార్‌

ర్యాలీల సంస్కృతిని విడనాడదాం 

సాక్షి, సిటీబ్యూరో : నగరవాసులతో పాటు రాకపోకలు సాగించే వారినీ ఇబ్బందులకు గురి చేస్తున్న బైక్‌ ర్యాలీల సంస్కృతిని విడనాడాలంటూ సీపీ అంజనీ కుమార్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఓ ఆడియో విడుదల చేశారు. అందులో కొత్వాల్‌ చెప్పిన వివరాలివీ.అందమైన హైదరాబాద్‌ దేశంలోనే నాలుగో అతిపెద్ద నగరం. దాదాపు 80 లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తున్న ఈ మహానగరం ఎప్పటికప్పుడు కొత్తగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఎందరో టూరిస్ట్‌లు, వ్యాపారులు బయటి ప్రాంతాల నుంచి నిత్యం వస్తున్నారు. కేవలం వీరే కాదు... స్థానికులు సైతం ఊరేగింపులు, ర్యాలీల వల్ల వారికి కలుగుతున్న ఇబ్బందులను నిత్యం నా దృష్టికి తీసుకువస్తున్నారు. వారంతా ప్రధానంగా మోటారు సైకిల్‌/బైక్‌ ర్యాలీల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మిత్రులారా మనం క్రమంగా నగరంలో ఉన్న కొన్నింటిని అధిగమించే దిశగా అడుగులు వేద్దామా! అలాంటి బైక్‌ ర్యాలీలు, ఊరేగింపుల వల్ల సాధారణ ప్రజలు ప్రభావితం కాకుండా చూడాలి.

ఎలాంటి బైక్‌ ర్యాలీలు చేయకుండా నిర్వాహకులను ఒప్పించడానికి, వారిలో అవగాహన పెంచడానికి కృషి చేయాల్సిందిగా సహచర అధికారులు, సిబ్బందిని కోరుతున్నా. సామాన్యులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ బైక్‌ ర్యాలీల కోసం దరఖాస్తు కూడా చేయని విధంగా వారిలో మార్పు తీసుకురావాలి. నగరంలో జీవన ప్రమాణాల పెంచడానికి ఇది మనందరి కలిసి నిర్వర్తించాల్సిన బాధ్యత. నగరంలో ఉండే వారికి, పర్యటనలకు వచ్చే వారికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూద్దాం. అంతా కలిసి మన నగరాన్ని బైక్‌ ర్యాలీలు లేని విధంగా మార్చుకుందాం. దీన్ని సాకారం చేసుకుంటే కాలేజీలు, పాఠశాలలకు వెళ్ళే మీ పిల్లలు, వారి స్నేహితులతో పాటు ఆస్పత్రులకు వెళ్ళే రోగులు, వారి సంబంధీకులు ఎంతో ఉపశమనం పొందుతారు. ఈ చిన్న మార్పును సాకారం చేయడం ద్వారా మన నగరాన్ని రానున్న తరాలకు ఓ స్వర్గాధామంగా మార్చుకోవచ్చు.  నగరాన్ని సుఖసంతోషాలతో నింపాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.  

మరిన్ని వార్తలు