పాతబస్తీలో సీపీ పర్యటన

11 Apr, 2019 07:24 IST|Sakshi

సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్‌ కేంద్రాల సందర్శన  

పాతబస్తీలో పర్యటించిన నగర సీపీ అంజనీ కుమార్‌

సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

చార్మినార్‌: హైదరాబాద్‌ వ్యాప్తంగా ప్రశాంత పోలింగ్‌ కోసం తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన సంబంధిత పోలీసు అధికారులతో కలిసి పాతబస్తీలోని సున్నిత, అత్యంత సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. చార్మినార్‌ నుంచి బయలుదేరిన ఆయన మూసాబౌలి, పేట్లబురుజు, పురానాపూల్‌లోని పోలింగ్‌ స్టేషన్లను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్‌ పరిధిలోని 4 లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికలకు బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

518 చెక్‌ పోస్టులు, 20 షాడో టీంలు, 282 లాఅండ్‌ఆర్డర్‌ పికెట్లు, 12 ఇంటర్‌ బార్డర్‌ చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఇప్పటికే అదనపు బలగాలను రంగంలోకి దించామన్నారు. నగరంలోని అన్ని పోలింగ్‌ స్టేషన్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యంత సున్నితమైన పోలింగ్‌ స్టేషన్ల వద్ద పారా మిలటరీ దళాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. అవసరమైన మేరకు అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాటిక్‌ ఫోర్స్, రూట్‌ మొబైల్స్‌ ఎప్పటికప్పుడు విధి నిర్వహణలో ఉంటారన్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా.. వెంటనే స్పందించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతామన్నారు. సమావేశంలో నగర పోలీసు అదనపు కమిషనర్‌ దేవేంద్రసింగ్‌ చౌహాన్, దక్షిణ మండలం డీసీపీ అంబర్‌ కిశోర్‌ ఝా, మీర్‌చౌక్‌ ఏసీపీ ఆనంద్‌ పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు