సైబర్‌ దర్యాప్తునకు బ్రేక్‌..!

13 May, 2020 11:00 IST|Sakshi

నిందితుల్లో అత్యధికులు ఉత్తరాదివారే

లాక్‌డౌన్‌లోనూ ఆ స్థాయిలో తగ్గని కేసులు

‘వేటకు’ వెళ్లేందుకు ఏమాత్రం లేని ఆస్కారం

గణనీయంగా పెరిగిపోతున్న పెండింగ్‌ కేసులు

సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్‌ ప్రభావం సైబర్‌ నేరాల దర్యాప్తు మీదా పడింది. అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయినా... ఈ నేరగాళ్ళ ‘కార్యక్రమాలు’ మాత్రం ఆగలేదు. సాధారణ రోజుల మాదిరి కాకపోయినా... పెద్ద సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో 95 శాతం ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారిని పట్టుకోవడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళే ఆస్కారం లేకపోవడంతో దర్యాప్తులు ఆగిపోయాయి. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నగర సైబర్‌క్రైమ్‌ ఠాణాలో కేసు పెండెన్సీ పెరిగిపోతోంది.

నమోదయ్యే వాటిలో అత్యధికం ‘ఓ’ కేసులే...
రాజధానిలో నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో మూడు రకాలైనవే ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్మీ ఉద్యోగులుగా పేర్కొంటూ తక్కువ ధరకు వాహనాలు, వస్తువుల పేరుతో యాడ్స్‌ యాప్‌ల్లో, ఫేస్‌బుక్‌లోని మార్కెట్‌ ప్లేస్‌లో పోస్టులు పెట్టి మోసం చేసే ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్స్, బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్లు చేసిన వ్యక్తిగత సమాచారంతో పాటు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్స్‌ (ఓటీపీ) కూడా తీసుకోవడం లేదంటే టీమ్‌ వ్యూవర్‌ సహా వివిధ రకాలైన యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేయించి ఖాతాలు ఖాళీ చేసే ఓటీపీ మోసాలు మొదటి రెండు స్థానాల్లో ఉంటున్నాయి. ఉద్యోగాలు, విదేశీ వీసా, ఇన్సూరెన్స్‌ పాలసీలపై బోనస్, గిఫ్టులు, లాటరీల పేరుతో చేసే కాల్‌ సెంటర్‌ ఫ్రాడ్స్‌ కేసులది మూడో స్థానం. లాక్‌డౌన్‌ ఫలితంగా కాల్‌ సెంటర్లు సైతం మూతపడటంతో ఈ మూడో తరహా కేసులు తగ్గాయి. అయితే మిగిలిన నేరాలకు మాత్రం బ్రేక్‌ పడలేదు. ఫలితంగా సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు బాధితులు క్యూ కడుతూనే ఉన్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే ఈ ఠాణాలో కేసు నమోదు కాలేదు. 

ఆ ప్రాంతాలకు చెందిన వారే వాంటెడ్‌...
నగరంలో నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో బయటి రాష్ట్రాలకు చెందిన వారే 95 శాతం వరకు నిందితులుగా ఉంటున్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య, అశ్లీల సందేశాలు, ఫొటోలు పంపడం, కంపెనీల డేటా దుర్వినియోగం వంటి వాటిలో మాత్రమే స్థానికులు నిందితులుగా ఉంటున్నారు. మిగిలిన నేరాలకు బయటి వారే బాధ్యులని అధికారులు చెప్తున్నారు. మార్కెట్‌ ప్లేస్, ఓఎల్‌ఎక్స్‌ నేరగాళ్ళకు రాజస్థాన్‌లోని మేవాట్‌ రీజియన్‌లో ఉన్న ఆల్వార్, భరత్‌పూర్‌... ఓటీపీ ఫ్రాడ్‌స్టర్స్‌కు జార్ఖండ్‌లోని జామ్‌తార, దేవ్‌ఘర్, గిరిధ్‌... కాల్‌ సెంటర్ల కేంద్రంగా నడిచే ఇతర నేరాలు చేసే వారికి ఢిల్లీ, కోల్‌కతా అడ్డాలుగా మారాయని ఇప్పటికే గుర్తించారు. ఈ సైబర్‌ నేరాల్లో నిందితులు బాధితులకు కనిపించరు. కేవలం ఫోన్‌కాల్స్‌ ఆధారంగానే వీళ్ళు తమ పని పూర్తి చేసుకుంటారు. ఒక్కోసారి ‘వినిపించకుండా’నూ అందినకాడికి దండుకుంటారు. ఈ తరహా సైబర్‌ నేరాలు చేసే వాళ్ళు పశ్చిమ బెంగాల్‌లో ఉన్న చిత్తరంజన్, అసన్‌సోల్‌లకు చెందిన వారి బ్యాంకు ఖాతాలు వాడుకుంటున్నారు. 

అక్కడ అంతా ‘జెంటిల్మెన్లే’...
‘ఈ–నేరగాళ్ళ’ను పట్టుకోవడానికి అనునిత్యం నగర పోలీసులు ఉత్తరాదికి వెళ్తూనే ఉంటారు. ప్రతి నెలా కనీసం పది రోజుల పాటు ఓ బృందం ఆయా ప్రాంతాల్లోనే మకాం పెట్టి, దొరికిన వారిని పట్టుకువస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్, కొరోన విజృంభణ నేపథ్యంలో దర్యాప్తు నిమిత్తం ఆయా రాష్ట్రాలకు వెళ్ళడానికి ఆస్కారం లేదని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. ఈ క్రిమినల్స్‌పై హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నా... వారి స్వస్థలాల్లో మాత్రం ఎలాంటి నేరాలు చేయరు. దీంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టుకునేలా చేయడం సాధ్యం కాదు. ఫలితంగా కేసుల దర్యాప్తు ఆగిపోతోంది. మార్చి 22 తర్వాత ఒక్క పోలీసు బృందమూ నగరం దాటి బయటకు వెళ్ళేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో పెరిగిపోతున్న పెండెన్సీ ప్రభావం రానున్న రోజుల్లోనూ కనిపిస్తుందని  అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారం సిబ్బందిపై తీవ్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. 

నేరుగా ‘మూసేయడమూ’ సాధ్యం కాదు...
ఈ సైబర్‌ నేరగాళ్ళు నూటికి నూరు శాతం నకిలీ ‘ఆధారాలతోనే’ నేరాలు చేస్తుంటారు. బాధితుల్ని సంప్రదించడానికి వినియోగించే ఫోన్‌ నెంబర్లు, వీరి నుంచి డబ్బు కాజేయడానికి వాడే బ్యాంకు ఖాతాలు, వాలెట్స్‌ సహా ఏ ఒక్కటీ వీరి పేరుతో ఉండదు. నకిలీ వివరాలతో లేదా కమీషన్లకు ఆశపడి తమకు సహకరించే మనీమ్యూల్స్‌గా పిలిచే మధ్యవర్తుల సాయంతో తమ ‘పని’ పూర్తి చేసుకుంటారు.  ఈ కారణంగానే ఏటా నమోదవుతున్న కేసుల్లో అనేకం ఎలాంటి ఆధారాలు దొరక్క క్లోజ్‌ అవుతూ ఉంటాయి. ఫిర్యాదులోని అంశాలు, కేసు తీరుతెన్నుల ఆధారంగా ఇలా క్లోజ్‌ అయ్యే వాటిని సైబర్‌ క్రైమ్‌ అధికారులు తేలిగ్గానే గుర్తిస్తారు. అలాగని పెండెన్సీ తగ్గించుకోవడానికి ఇలాంటి కేసుల్ని తక్షణం క్లోజ్‌ చేయడానికీ ఆస్కారం లేదు. కచ్చితంగా దర్యాప్తు నిమిత్తం ఒకటిరెండుసార్లు ఆయా రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి, పక్కాగా ఆధారాలు దొరలేదని నిరూపించన తర్వాతే ఈ క్లోజర్‌కు ఆస్కారం ఉంటుంది. ఫలితంగా ప్రస్తుతం సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసుల పెండెన్సీ పెరిగిపోతోంది. 

కేసుల నమోదు ఇలా...
2017– 325, 2018–428, 2019– 1393.
ఈ ఏడాది జనవరి–211, ఫిబ్రవరి–260, మార్చి–169, ఏప్రిల్‌–140, మేలో ఇప్పటి వరకు– 45.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా