ఎస్తోనియా.. ఎంతో 'నయా'

5 Oct, 2018 10:46 IST|Sakshi

ఈ–గవర్నెన్స్‌లో ప్రపంచానికి ఆదర్శం

స్కూల్‌ ఐడీ నుంచి ఓటు హక్కు దాకా ఆన్‌లైనే..

డేటా పూర్తి స్థాయిలో గోప్యం

ఆ దేశంలో పర్యటించిన హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌  

 ‘సాక్షి’తో విశేషాలు పంచుకున్న రఘునందన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎస్తోనియా.. ఉత్తర ఐరోపాలోని ఓ బాల్డిక్‌ దేశం. 45 వేల చదరపు కిలోమీటర్ల విసీర్ణం.. 13 లక్షల జనాభాతో 1991లో రష్యా నుంచి స్వతంత్ర దేశంగా అవతరించింది. కాగిత రహిత పాలనకు 1995లోనే గుడ్‌బై చెప్పి ‘ఆన్‌లైన్‌’ పాలనకు శ్రీకారం చుట్టింది ఇక్కడి ప్రభుత్వం. పూర్తి స్థాయిలో ఈ–గవర్నెన్స్‌ అమలు చేస్తున్న ప్రపంచంలో ఏకైక దేశం ఎస్తోనియా. స్కూల్‌ ప్రోగ్రెస్‌ కార్డు నుంచి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వరకు అంతా ఆన్‌లైన్‌ విధానం అమలు చేస్తుండడం ఇక్కడి ప్రత్యేకత. ‘డిజిటల్‌ ఇండియా’లో భాగంగా ఈ–గవర్నెన్స్‌ లీడర్‌షిప్‌పై అధ్యయనానికి గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఓ బృందాన్ని ఆ దేశ పర్యటనకు పంపించింది. పలు రాష్ట్రాలకు చెందిన 25 మంది సీనియర్‌ అధికారులున్న ఈ బృందంలో హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాఘునందన్‌ రావు కూడా ఒకరు. ఈ బృందం ఎస్తోనియాలో పర్యటించి అక్కడి ఈ–గవర్నెన్స్‌పై అధ్యయనం చేసింది. ఆ దేశంలో పర్యటించి వచ్చిన ఆయన గురువారం అక్కడి వివరాలను ‘సాక్షి‘కి వివరించారు. ఆ వివరాలు కలెక్టర్‌ మాటల్లోనే..  

అక్కడ పారదర్శంగా సేవలు
ఎస్తోనియా చాలా చిన్న దేశం. అక్కడి ప్రజలు చదువుకున్న వారు కావడంతో ఈ–గవర్నెన్స్‌ అమలు సాధ్యపడింది. ఆర్థిక లావాదేవీలు, పన్నుల చెల్లింపు, ఆరోగ్య రిపోర్డులతో పాటు అన్ని అనుమతులు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలందుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఎస్తోనియాను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఆ దేశంలో వలే ఇక్కడా ఈ–గవర్నెన్స్‌తో పౌరులకు సత్వర సేవలతో సుపరిపాలను అందించవచ్చు.  

డిజిటల్‌ ఐడెంటిటీ కార్డులు
ఆ దేశంలో పౌరులకు ప్రత్యేకంగా డిజిటల్‌ ఐడెండిటీ కార్డులును జారీ చేశారు. డెబిట్‌ కార్డు తరహాలో అందులో ఒక చిప్‌ ఉంటుంది. వ్యక్తికి సంబంధించిన సమాచారమంతా ఈ చిప్‌లో రికార్డవుతుంది. ఈ కార్డును అన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు. ఒక వ్యక్తి దేశంలో ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకునేందుకు ఈ–రెసిడెన్సీని అమలుచేస్తున్నారు. ఇక వైద్య రంగంలోనూ ఈ– గవర్నెన్స్‌ ఉంది. ఈ–హెల్త్‌ రికార్డులు, ఈ– ప్రిస్క్రిప్షన్‌ విధానాన్ని అక్కడ అనుసరిస్తున్నారు. సదరు వ్యక్తి అనుమతి లేకుండా స్టెతస్కోపు పెట్టడానికి కూడా వీల్లేదు. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ సైతం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.

ఎంతో గోప్యంగా సమాచారం  
ఈ–గవర్నెన్స్‌లో భాగంగా ఆన్‌లైన్‌లో పొందుపరిచే సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంటుంది. ఒకరి అనుమతి లేకుండా మరోకరు సమాచారం చూడ్డానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర వ్యక్తులకు తెలియకుండా సిస్టం హార్డ్‌ డిస్క్‌ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకవేళ చూస్తే వెంటనే సదరు వ్యక్తికి తెలిసిపోతుంది. అనుమతి లేకుండా సమాచారం చూడడం అక్కడ చట్టరిత్యా నేరం. క్రిమినల్‌ కేసు పెట్టవచ్చు. ఉదాహరణకు భార్య బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు భర్తకు, భర్త ఆస్తుల వివరాలు భార్యకు తెలియనంత రహస్యంగా ఈ–పరిపాలన సాగుతోంది. కనీసం పన్నుల విధింపు, చెల్లింపు వివరాలు సైతం అధికారులు సైతం చూడ్డానికి లేదు. ఒకసారి అనుమతితో చూసినా కంప్యూటర్‌లో భద్రపర్చుకునేందుకు సాఫ్ట్‌వేర్‌ ఆమోదించదు.

ఆన్‌లైన్‌లోనే ఓటింగ్‌..
ఆ దేశంలో పార్లమెంట్‌ వ్యవస్థ ఉంది. ప్రజలు ఓటు హక్కు ద్వారా ఎంపీలను ఎన్నుకుంటారు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఓటు వేయవచ్చు. పోలింగ్‌ రోజు గడువులోగా ఎన్నిసార్లు అయినా ఓటు వేయవచ్చు. కానీ చివరి ఓటు ఎవరికి వేస్తామో అది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.  అక్కడి ప్రజలు 35 శాతం, 65 శాతం బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేబినెట్‌లో మంత్రులను ఎంపీయేతరులను ఎన్నుకుంటారు. మంత్రిగా ఎన్నుకుంటే ఎంపీగా వారి స్థానంలో ఇతరులు వ్యవహరిస్తారు. మంత్రిగా రాజీనామా చేసి తిరిగి ఎంపీగా చేరవచ్చు.  

డేటా ప్రైవసీ చట్టం అవసరం
ఈ–గవర్నెన్స్‌ అమలుకు డేటా ప్రైవసీ చట్టం అవసరం. ఇటీవల న్యాయమూర్తి శ్రీకృష్ణ సారధ్యంలోని కమిటీ ఈ–గవర్నెన్స్‌ అమలుపై పలు సూచనలు చేసింది. సిటిజన్‌ డేటా గోపత్య, అనుమతి లేకుండా చూడడం నేరంగా పరిగణించాలని ప్రతిపాదించింది. పటిష్ట చట్టం రూపొందిస్తే కానీ ఈ–గవర్నెన్స్‌ పూర్తిగా అమలు అసాధ్యం. పన్నుల చెల్లింపునకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. 

మరిన్ని వార్తలు