పైపై పూతలే?

18 Aug, 2018 10:54 IST|Sakshi
మరమ్మతులు చేస్తున్న కూలీలు

సాక్షి, సిటీబ్యూరో: ఏ వస్తువునైనా కొన్నాళ్లు వాడాక మరమ్మతులు చేయించాలి. లేకుంటే ఎప్పుడు మొరాయిస్తుందో చెప్పడం కష్టం. ఎంతటి పటిష్టమైన కట్టడమైనా వినియోగంలో మరింత మన్నాలంటే మరమ్మతులు చేయాలి. కానీ గ్రేటర్‌లో మాత్రం అందుకు భిన్నంగా పైపై అందాలు అద్ది అవే గొప్ప అంటున్నారు. వాస్తవానికి 20 ఏళ్లు దాటిన పై వంతెనలకు సామర్థ్య పరీక్షలు చేయాలి. జీహెచ్‌ఎంసీలో మాత్రం అందుకు విరుద్ధంగా పైపై మెరుగులు అద్దుతున్నారు. నగరంలోని పలు ఫ్లై ఓవర్లను నిర్మించి ఇరవయ్యేళ్లు దాటిపోయింది. ఇప్పుడు వాటికి పరీక్షలు నిర్వహించాలి. వాటి బలమెంతో అంచనా వేయాలి.

అప్పుడే వాటి సామర్థ్యం తెలుస్తుంది. లోపాలు బయటపడతాయి. ఇప్పుడు అధికారులు ఈ అంశాన్ని గాలికి వదిలేశారు. మరోవైపు కొన్ని ఫ్లై ఓవర్లకు కోట్ల రూపాయలతో సుందరీకరణ, లైటింగ్‌ పనులు చేపట్టారు. ఐదేళ్ల క్రితం ‘కాప్‌’ సందర్భంగా ఫ్లై ఓవర్లకు సుందరీకరణ అంటూ దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేశారు. వాటితో వాటి అందం పెరిగిందా అంటే లేదు.. కొన్ని ప్రాంతాల్లో సగం సగం డిజైన్లతో.. గందరగోళం చేశారు. కొన్ని ప్రాంతాల్లో రంగులు కుమ్మరించి చేతులు దులుపుకున్నారు. తాజాగా.. ‘వర్టికల్‌ గార్డెన్లు, హ్యాంగింగ్‌ గార్డెన్లు’ పేర్లతో మళ్లీ ఖర్చుకు తెర తీశారు. ‘థీమ్‌ లైటింగ్‌’ పేరిట ఒక్కో ఫ్లై ఓవర్‌కు దాదాపు రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. బాగున్నవాటికి అందాలు, అలంకరణలు ఓకే అయినా.. బలహీనమవుతున్న ఫ్లై ఓవర్ల మరమ్మతులను పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
 
వాటి పరిస్థితి ఏంటో..! 
నగరంలో 30కి పైగా ఫ్లై ఓవర్లలో కనీసం ఐదింటికి మరమ్మతులు అవసరమని ఐదేళ్ల క్రితమే జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులు గుర్తించారు. డబీర్‌పురా ఫ్లై ఓవర్‌కు మరమ్మతులు చేసి మిగతా వాటిని పట్టించుకోలేదు. లాలాపేట ఫ్లై ఓవర్‌కు ప్రస్తుతం పనులు నడుస్తున్నాయి. ఏటా వర్షాకాలానికి ముందు.. తర్వాత ఫ్లై ఓవర్ల స్థితిగతులను పరీక్షించాలి. వాటి వైబ్రేషన్‌ ఏస్థాయిలో ఉంది..? పిల్లర్లు, సర్ఫేస్‌ పటిష్టంగా ఉన్నాయా.. లేదా వంటి అశాలను పరిశీలించాలి. బేరింగ్‌లకు మరమ్మతులు చేయాలి. పదేళ్లు దాటిన ఫ్లై ఓవర్లకు కనీసం రెండేళ్లకోమారు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి. ఖైరతాబాద్, తెలుగుతల్లి, హఫీజ్‌పేట, మాసాబ్‌ట్యాంక్‌ తదితర ఫ్లై ఓవర్లు నిర్మించి చాలా ఏళ్లయింది. వాటిని మరమ్మతులు అవసరమని ఇంజినీర్లు చెబుతున్నారు. అయినా అధికారులు వాటికి రంగుల హంగులతోనే సరిపెడుతున్నారు. ఫ్లై ఓవర్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక విభాగం ఉండాలి. కానీ  జీహెచ్‌ఎంసీలో అది లేదు.
 
వంతెనలపై ‘మందం’ పెంచేశారు.. 
నగరంలోని ఫ్లై ఓవర్లపై పడే గుంతలను పూడ్చేందుకు పైపొరలుగా డాంబర్‌ కోటింగ్స్‌ వేస్తూ పోతుండటంతో కొన్ని ఫ్లై ఓవర్ల మందం ఎంతో ఎత్తు పెరిగిపోయింది. దీనివల్ల కూడా ఫ్లై ఓవర్లు బరువును మోసే సామర్థ్యం దాటిపోయి ప్రమాదకరంగా మారాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వాటికి మరమ్మతులు చేశాక, సుందరీకరణ చేస్తే ఎలాంటి ఆరోపణలు రావు. కానీ.. ఫ్లై ఓవర్ల దృఢత్వాన్ని పరీక్షించకుండా పైపై డాబుకు ఆరాటపడుతున్నారు. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకే ఈ సుందరీకరణ పనులు చేపట్టామని, మున్సిపల్‌ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు