కొంతే ‘స్వచ్ఛం’

29 May, 2015 01:19 IST|Sakshi
కొంతే ‘స్వచ్ఛం’

- స్వచ్ఛ హైదరాబాద్‌తో మిశ్రమ ఫలితాలు
- కొన్ని ప్రాంతాల్లో కనిపించిన మార్పు
- మరికొన్ని చోట్ల పాత పరిస్థితే
- అందుబాటులో లేని చెత్త డబ్బాలు...వాహనాలు
- అమలుకు నోచని అమాత్యుల ఆదేశాలు
 - స్వచ్ఛ హైదరాబాద్‌తో మిశ్రమ ఫలితాలు
 - కొన్ని ప్రాంతాల్లో కనిపించిన మార్పు
 - మరికొన్ని చోట్ల పాత పరిస్థితే
 - అందుబాటులో లేని చెత్త డబ్బాలు...వాహనాలు
 - అమలుకు నోచని అమాత్యుల ఆదేశాలు
సాక్షి’బృందం:
స్వచ్ఛ హైదరాబాద్... రాష్ర్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, యంత్రాంగమంతా భాగస్వాములైన కార్యక్రమం. ఈ నెల 16 నుంచి 20 వరకు నగరంలో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా నగరం పరిశుభ్రం కావాలని ప్రభుత్వం భావించింది. మరి ‘స్వచ్ఛ హైదరాబాద్’ స్ఫూర్తితో పారిశుద్ధ్య పరిస్థితుల్లో మార్పు వచ్చిందా? పౌరస్పృహ పెరిగిందా..? అనే అంశాలను ‘సాక్షి’ బృందం గురువారం గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించింది. ఈ పరిశీలనలో మిశ్రమ పరిస్థితులు కనిపించాయి.

కొన్ని ప్రాంతాల్లో గతంలో కంటే పారిశుద్ధ్యం మెరుగైంది.ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం లేదు. డంపర్‌బిన్లలోనే వేస్తున్నారు. చెత్తను క్రమం తప్పకుండా తరలిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల డబ్బాలు లేకపోవడంతో రోడ్లపైనే చెత్త వేస్తున్నట్లు ప్రజలు చెప్పారు. ఇళ్ల నుంచి చెత్తను తీసుకువెళ్లే రిక్షాలు అందుబాటులో లేవు. మరి కొన్నిచోట్ల స్వచ్ఛ హైదరాబాద్‌ను ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించారనే భావిస్తున్నారు. దీన్నిబట్టి ప్రజల్లో అవగాహన కల్పించలేకపోయినట్టు అర్థమైంది.
 
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ పర్యటించిన బౌద్ధనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. గోషా మహల్, సనత్ నగర్, ఎల్‌బీనగర్, తదితర నియోజకవర్గాల్లో ఏమాత్రం మార్పులేదు. ఎటొచ్చీ తేలిందేమంటే.. ప్రజలకు ఇంకా అవగాహన కల్పించాల్సి ఉంది. చె త్త వేయడానికి డబ్బాలు, తరలించే వాహనాలు సమకూర్చాల్సి ఉంది. దీనికి రెండువేల ఆటోట్రాలీలు, తడి,పొడి చెత్తను వేరుగా వేసేందుకు రెండురంగుల డబ్బాలను అందించనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అవి అందుబాటులోకి వచ్చేంతవరకైనా అవసరమైనన్ని చెత్తడబ్బాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.  ప్రస్తుతానికి దాదాపు పదివేల డబ్బాలను జీహెచ్‌ఎంసీ సమకూర్చుకుంది. వీటిని ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో అందజేయనున్నారు. ట్రాలీల కొనుగోళ్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 తగ్గని చెత్త... ఇళ్ల నుంచి వెలువడే చెత్త ఏమాత్రం తగ్గడం లేదు. గతంలో రోజుకు సగటున 3,300 మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు తరలేది. గడచిన వారం రోజుల్లో రోజుకు 3,250 నుంచి 3,650 మెట్రిక్ టన్నుల వరకు తరలించారు.

ఇదీ ప్రస్తుత పరిస్థితి
పాతబస్తీలోని చార్మినార్, గోషామహల్, ధూల్‌పేట్ తదితర ప్రాంతాల్లోచెత్త యధావిధిగా రోడ్లపైనే పడేసిన దృశ్యాలు కనిపించాయి. డస్ట్‌బిన్‌ల పక్కన, రోడ్లపై చెత్తకుప్పలు దర్శనమిచ్చాయి. బేగంబజార్ ఫిష్ మార్కెట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించినప్పటికీ...అమలుకు నోచుకున్న దాఖలాలు కనిపించలేదు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రపరిస్థితుల్లో మార్పు లేదు. సర్కిల్-4, 5 ప్రాంతాల్లో కుండీల వద్ద చెత్త కుప్పలుగా పేరుకుపోయి దర్శనమిస్తోంది. గౌలిపురా, బాలాగంజ్, యాకుత్‌పురా ఇమ్లిబన్, ఆమన్‌నగర్-బి, లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, యాకుత్‌పురా, ఎస్సార్టీ కాలనీ, చావునీ నాదే అలీ బేగ్, రెయిన్‌బజార్ చమాన్‌లో కుండీల వద్ద చెత్త కుప్పలుగా పేరుకుపోయింది.

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో మార్పు కనిపించింది. సీఎం ఇన్‌చార్జిగా ఉన్న బౌద్ధ నగర్ డివిజన్ పార్శిగుట్ట ప్రాంతంలో చెత్త తొలగింపు కార్యక్రమం సజావుగా సాగుతోంది. రాఘవ గార్డెన్, పార్శీగుట్ట, అంబర్ నగర్, మధురానగర్, న్యూ అశోక్‌నగర్, బౌద్ధనగర్ కమ్యూనీటి హాల్ ప్రాంతాల్లో ఏ రోజు  చెత్తను ఆరోజే తొలగిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటించడంతో తమ ప్రాంతాలు పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

సనత్‌నగర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రజల్లో మార్పు కనిపించకపోగా... అధికార యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించిన తీరు స్పష్టమైంది. ప్రధానంగా మంజు థియేటర్ ప్రాంతంలో చెత్త కుండీలు నిండిపోయి కనిపిస్తున్నాయి. మినర్వా కాంప్లెక్స్, దీన్‌దయాల్ రోడ్, మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లో చెత్త కుండీలు నిండిపోయి ఉన్నాయి. సిబ్బంది చెత్తను తొలగించక పోవడంతో రోడ్లపై కుప్పలుగా   పడి ఉంది.

సనత్ నగర్ నియోజకవర్గంలోని నటరాజ్ నగర్, సారథి నగర్, కళ్యాణి నగర్ వెంచర్-3లోని ఇళ్ల సమీపంలో చెత్త కుప్పలను తొలగించకపోవడంతో పరిస్థితికి మొదటికి వచ్చింది.

గాజులరామారం డివిజన్ నెహ్రూ నగర్‌లో రోడ్డు మధ్యలో బోరు వేసి వదిలేశారు. ఈ విషయాన్ని అక్కడ పర్యటించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించాలని అప్పట్లో అధికారులను మంత్రి ఆదేశించారు. అయినా నేటికీ పరిస్థితిలో మార్పులేదు.

మంజు థియేటర్ ప్రాంతంలో చెత్త కుండీలు నిండిపోయాయి. మినర్వా కాంప్లెక్స్, దీన్‌దయాల్ రోడ్, మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లో కుండీలు చెత్తతో నిండిపోయి...ఆ ప్రాంతమంతా అధ్వానంగా మారింది.

వనస్థలిపురం సుష్మ బస్‌స్టాప్ వద్ద జాతీయ రహదారిపై చెత్త డంపింగ్ యార్డును తలపిస్తోంది.

రాజేంద్రనగర్ సర్కిల్‌లో మార్పు కనిపిస్తోంది. గతంలో ఖాళీ ప్రదేశాలతో పాటు తమ ఇళ్ల పక్కనే చెత్తాచెదారాలు వేసేవారు. ప్రస్తుతం డస్ట్‌బిన్‌లు, ఇళ వద్దకు వచ్చే రిక్షాలలో వేస్తున్నారు.  

ఉప్పల్ సర్కిల్‌లో పరిస్థితులు మెరుగయ్యాయి. ప్రధాన రహదారుల్లో ఎక్కడికక్కడే పేరుకు పోయిన చెత్త శుభ్రం చేశారు. ఉప్పల్ పారిశ్రామిక వాడ , చిలుకానగర్ చౌరస్తాలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. 

మరిన్ని వార్తలు