నిమజ్జనం..భక్తిపారవశ్యం

24 Sep, 2018 08:48 IST|Sakshi
ఎంజే మార్కెట్‌ వద్ద నిమజ్జన శోభాయాత్రనుద్దేశించి ప్రసంగిస్తున్న స్వామి పరిపూర్ణానంద

గ్రేటర్‌లో శోభాయమానంగా నిమజ్జన వేడుక

గంగ ఒడికి చేరిన వేలాది గణపతి విగ్రహాలు

ప్రశాంతంగా ముగిసిన కీలక ఘట్టం

సాక్షి, సిటీబ్యూరో: బ్యాండు మేళాలు..డీజే హోరు..తీరైన నృత్యాలు..కోలాటాలు..చిత్ర, విచిత్ర వేషధారణలు..భక్తుల జయజయధ్వానాలు..డప్పు కళాకారుల ఆటా..పాట, గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య భాగ్యనగరంలో ఆదివారం గణేష్‌ నిమజ్జన వేడుకలు అంబరాన్నితాకాయి. బాలాపూర్‌ నుంచి ఉదయం 11 గంటలకు మొదలైన శోభాయాత్ర చాంద్రాయణగుట్ట..ఫలక్‌నుమా..అలియాబాద్, శాలిబండ..చార్మినార్‌..అఫ్జల్‌గంజ్, మోజంజాహీ మార్కెట్‌ మీదుగా హుస్సేన్‌సాగర్‌కు చేరుకుంది. బాలాపూర్‌ గ్రామంలో లడ్డూ వేలంపాట ముగిసిన అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో శోభాయాత్ర సాగింది. మార్గమధ్యంలో గణేష్‌ ఉత్సవ కమిటీలు ఏర్పాటుచేసిన స్వాగత మండపాలు, అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. నిమజ్జనంలో పాల్గొన్న భక్తజనం ఆకలి తీర్చేందుకు బాలాపూర్‌ మొదలుకొని హుస్సేన్‌సాగర్‌ వరకు వివిధ రకాల అల్పాహారం, ఆహారపదార్థాలతోపాటు, మంచినీరు, మజ్జిగను పలు భక్తసమాజాలు ఉచితంగా పంపిణీ చేశాయి. జలమండలి శోభాయాత్ర జరిగే మార్గంలో 101 వాటర్‌క్యాంపులు ఏర్పాటుచేసి 30 లక్షల మంచినీటిప్యాకెట్లను పంపిణీ చేసింది.

ఆలస్యంగా ప్రారంభమైన శోభాయాత్ర...
గతానికి భిన్నంగా పాతనగరంలో ఈసారి మూడు, ఐదు, ఏడు రోజులపాటు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం చేయడంతో భారీ గణనాథులను మాత్రమే ఆదివారం నిమజ్జనం చేసేలా పోలీసుశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం 1 గంట తర్వాతే పాతనగరంలో శోభాయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ఊపందుకుంది. 

జనసంద్రమైన ట్యాంక్‌బండ్‌..  
వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలు జనసంద్రమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న గణనాథులతో భక్తులు ట్యాంక్‌బండ్‌ పరిసరాలకు చేరుకున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. లక్షల సంఖ్యలో మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. సంచార మరుగుదొడ్లను ఏర్పాటుచేశారు. వైద్య శిబిరాలు, సహాయ శిబిరాలు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం తాత్కాలిక ట్రాఫిక్‌ శిబిరాలను నెలకొల్పారు. గణేశ్‌ నిమజ్జనం వీక్షించేందుకు నగరానికి వచ్చిన భక్తుల కోసం ఎంఎంటీఎస్‌ అదనపు సర్వీసులను నడిపింది. ఆర్టీసీ సైతం సుమారు 500 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపింది. 

చార్మినార్‌ వద్ద తగ్గిన సందడి
సామూహిక నిమజ్జనం నేపథ్యంలో పాతబస్తీ మీదుగా సాగే శోభాయాత్రలు అత్యంత కీలకమైనవి. నగర పోలీసులు సైతం వీటిపైనే ప్రధానంగా దృష్టిపెట్టి బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రతి ఏడాది ఉదయం నుంచి చార్మినార్‌ మీదుగా ఊరేగింపులు సాగుతూ ఉంటాయి. అయితే ఈసారి ఇంకా తొందరగా పూర్తి చేయించాలని పోలీసులు భావించినా అది సాధ్యం కాలేదు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు అప్పుడప్పుడు వచ్చిన విగ్రహాల ఆటోలు, ర్యాలీల మినహా సందడి లేదు. చార్మినార్‌ చుట్టపక్కల రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగానే ఉన్నాయి. ప్రతిసారీ నిమజ్జనం రోజు మధ్యాహ్నం మక్కా మసీదులో జరిగే ప్రార్థనల ముగింపు కోసం పోలీసులు ఊరేగింపులకు ఆపేవారు. అయితే ఈసారి మాత్రం ఆ సమయానికి ఊరేగింపులు ఆ సమీపంలోకి కూడా చేరుకోలేదు. గణేష్‌ ఉత్సవాలకు మూలవిరాట్‌గా భావించే బాలాపూర్‌ గణేష్‌ విగ్రహం సాయంత్రానికి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమైంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చార్మినార్‌కు మూడుపక్కలా ఉన్న శాలిబండ, సర్దార్‌మహల్, లాడ్‌ బజార్‌ రోడ్ల నుంచి ఒక్కసారిగా విగ్రహాలతో కూడిన లారీలు అంగరంగ వైభవంగా వచ్చాయి. గతంలో విగ్రహాలతో వచ్చిన లారీల్లో దాదాపు ప్రతీది చార్మినార్‌ చుట్టూ తిరిగి ముందుకు సాగేది. ఈ సారి శాలిబండ వైపు నుం చి వచ్చిన లారీల్లో అత్యధికం చుట్టూ తిరగకుండా నేరుగా ముందుకు సాగేలా ఏర్పాటు చేశారు. 

మూడు లక్షల మంది భక్తులు...
భారీగా తరలిచ్చిన భక్తులతో హుస్సేన్‌సాగర్‌ తీరమంతా పరవశించిపోయింది. సుమారు మూడు లక్షలకు పైగా భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్, జీహెచ్‌ఎంసీ ఇతర విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. సాయంత్రం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, దాన కిషోర్, అంజనీకుమార్‌లు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఏరియల్‌ వ్యూ చేసి పరిస్థితిని సమీక్షించారు.

పర్సులు, సెల్‌ఫోన్లు మాయం..
సాయంత్రం తర్వాత భక్తుల రద్దీ భారీగా పెరగడంతో చిన్నారులతో పాటు వృద్ధులు తప్పిపోయారు. మహిళాశిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులు తప్పిపోయిన చిన్నారులను గుర్తించి, వారి వివరాలను మైకుల్లో ప్రకటించి బంధువులకు అప్పగించారు. ట్యాంక్‌బండ్‌ సహా ప్రధాన రహదారుల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ దొంగలు తమ చేతులకు పని చెప్పారు. పర్సులు, సెల్‌ఫోన్లు తస్కరించారు. సెల్‌ఫోనులు పోయిన ఘటనపై ఖైరతాబాద్‌ పోలీసులకు వందకుపైగా ఫిర్యాదులు అందడం గమనార్హం.   

రెట్టింపు ధరలతో బెంబేలు
నిమజ్జనాన్ని స్వయంగా వీక్షించేందుకు ట్యాంక్‌బండ్‌కు వచ్చిన భక్తులను వ్యాపారులు ఇష్టం వచ్చినట్లు దోచేశారు. సాధారణ రోజుల్లో రూ.10 ఉన్న మొక్క జొన్న తాజాగా రూ.20కి విక్రయించారు. ప్రూట్‌ సలాడ్, ఇడ్లి, దోశ, మిర్చి, శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్స్‌ సహా అన్ని తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు. ఇక చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, బెలూన్స్, బూరలు,
మాస్క్‌ల ధరలు చుక్కలంటాయి. 

ఉన్నతాధికారుల పర్యవేక్షణ
సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆదివారం కూకట్‌పల్లిలోని ఐడీఎల్‌ చెరువులో నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ సరూర్‌నగర్, కపిలాంగూడ, ఎదులాబాద్, ఇనామ్‌గూడ, కాప్రా చెరువులను సందర్శించి నిమజ్జన తీరును పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.

30కి పైగా ప్రాంతాల్లో నిమజ్జనం...
ప్రధాన కేంద్రమైన హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరం నలుదిక్కులా ఉన్న చెరువులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులతో కలిసి 30కి పైగా ప్రాంతాల్లో నిమజ్జనాల సందడి నెలకొంది. ఖైరతాబాద్‌ గణనాథుడిని గత ఏడాది కంటే దాదాపు గంటన్నర ముందు నిమజ్జనం చేశారు. ఊరేగింపు జరిగే మార్గం పొడవునా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అయితే వరుస నిమజ్జనాల నేపథ్యంలో గతంలో పోలిస్తే ఈ ఏడాది కోలాహలం కాస్త తగ్గింది. సోమవారం ఉదయం వరకు హుస్సేన్‌సాగర్‌ వద్ద నిమజ్జనం సాగే అవకాశం ఉందని చెప్తున్న అధికారులు దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏటా వస్తాను
వివిధ ప్రసార మాధ్యమాల్లో లైవ్‌ కవరేజీ ఉన్నప్పటికీ..స్వయంగా వీక్షించేందుకు ట్యాంక్‌బండ్‌కు వచ్చాం. కుటుంబ సభ్యులతో ఏటా వస్తుంటాం. చాలా సంతోషంగా ఉంది.– స్వప్న, బంజారాహిల్స్‌

ఈసారి వ్యాపారం బాగుంది  మాస్కులు, ఇతర ఆట వస్తువులనువిక్రయిస్తున్నా. ఏటా నిమజ్జనానికి ఐదు రోజుల ముందు వస్తాం. ఆశించిన దానికంటే ఎక్కువ మాస్క్‌లు అమ్మాను. ఈసారి వ్యాపారంబాగుంది.     – కుమార్, గుల్బర్గా

34 వేలకు పైగా....
నగరంలోని హుసేన్‌ సాగర్‌ లో ఆదివారం సాయంత్రం ఆరుగంటల వరకు  3420 గణేష్‌ విగ్రహాల నిమజ్జనం జరిగింది ట్యాంక్‌ బండ్‌ పై 3161, ఎన్‌. టీ.ఆర్‌ మార్గ్‌ లో 259 విగ్రహాల నిమజ్జనం జరిగింది. గత మూడు రోజుల నంచి ఇప్పటి వరకు హుసేన్‌ సాగర్‌ లో 19,420  విగ్రహాల నిమజ్జనం జరిగింది.  నగరం మొత్తం మీద  ఆదివారం సాయంత్రం వరకు 54, 358 విగ్రహాల నిమజ్జనం. ప్రశాంతం గా జరిగినట్లు అధికారులు వెల్లడించారు.  

ప్రజల సహకారంతోనే...
వినాయక సామూహిక నిమజ్జనం పూర్తి ప్రశాంతంగా సాగడానికి ప్రధాన కారణం ప్రజలు, ఉత్సవ కమిటీల సహకారం. ఆపై పోలీసు విభాగానికి చెందిన ప్రతి అధికారి, సిబ్బంది సమష్టిగా కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్యాహ్నం ఒంటి గంటలోపే ఖైరతాబాద్‌ బడా గణేషుడి విగ్రహం నిమజ్జనం జరిగింది. క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులు, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటల్‌లోని అధికారులు, ఇతర విభాగాలకు చెందిన అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం నుంచి ఊరేగింపుల ప్రక్రియ జోరందుకుంది. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని బేరీజు వేస్తూ, అందుకు తగ్గట్టు బందోబస్తు, భద్రత ఏర్పాట్లలో మార్పు చేర్పులు చేస్తున్నాం. సోమవారం సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.     – అంజనీ కుమార్, నగర కొత్వాల్‌  

శోభాయాత్ర హైలైట్స్‌
బన్సీలాల్‌పేట్‌: ఆదివారం సెలవుదినం కావడంతో లక్షలాది మంది జనం ట్యాంక్‌బండ్‌ వద్దకు తరలివచ్చారు. దీంతో ప్రాంతమంతా కిక్కిరిసి పోయింది.  
గణేష్‌ విగ్రహాల నిమజ్జం కోసం ట్యాంక్‌బండ్‌పై మొత్తం 29 క్రేన్లు ఏర్పాటు చేశారు.  
పోలీసు, జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, ఆర్‌అండ్‌బీ విభాగాలకు చెందిన అధికారులు ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించారు.  
నిమజ్జనం క్రేన్ల వద్ద ఆధునిక సాంకేతిక పద్ధతిని ప్రవేశ పెట్టారు. దీంతో గంటలో సుమారు 20 నుంచి 25 వరకు విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేశారు.  
హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో సుమారు 900 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నిమజ్జనోత్సవ పరిస్ధితిని సమీక్షించారు.  
షీ టీమ్‌లు మఫ్టీ డ్రెస్‌లో ట్యాంక్‌బండ్‌పై సంచరించడం కనిపించింది. మహిళలు...యువతులను ఇబ్బందులు పెట్టే పోకరీల ఆటకట్టించడానికి గట్టి చర్యలు తీసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకొని హెచ్చరించారు.  
ఇళ్లల్లో గణేష్‌ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న అనేక మంది కార్లు...చిన్న చిన్న వాహనాలను అందంగా అలంకరించి ఆటపాటలతో గణేశులను నిమజ్జనానికి తీసుకువచ్చారు.

మండపంలోనే మట్టి గణపతి నిమజ్జనం
నేరేడ్‌మెట్‌: వినాయకనగర్‌ డివిజన్‌ దీనదయాళ్‌నగర్‌లో గణా ఫ్రెండ్స్‌ ఆధ్వర్యంలో 11 రోజులపాటు పూజలందుకున్న 30 అడుగుల భారీ మట్టి గణపతి నిమజ్జనం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మండపంలోనే మట్టిగణపతిని నిమజ్జనం చేసి, ఆ మట్టిని భక్తులకు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో నిర్వాహకులు శ్రావణ్‌ పాల్గొన్నారు.

అధికారుల సమన్వయం భేష్‌
ఎల్‌బీనగర్‌: గణేష్‌ నిమజ్జనం సందర్భంగా అధికారులందరు సమన్యయంతో అద్బతంగా పనిచేస్తున్నారని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ అన్నారు. నిమజ్జనం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఆయన సరూర్‌నగర్‌ మినీ ట్యాంక్‌ బండ్‌ను సందర్శించి నిమజ్జనంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల నిఘాలో నిమజ్జనం జరుగుతోందని ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు రాత్రి వరకు సుమారు 3 వేల విగ్రహాలను నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. గ్రేటర్, విద్యుత్, ఇరిగేషన్, పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని  నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగిందన్నారు.

మరిన్ని వార్తలు