11 రోజుల్లోనే 13,233 కరోనా కేసులు

13 Jul, 2020 07:34 IST|Sakshi

50 శాతం పైగా పెరిగిన కరోనా కేసులు

130 రోజుల్లో 25,193 పాజిటివ్‌లు   

83 శాతం మంది అసింప్టమేటిక్‌ బాధితులే

ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 10,518 మంది

సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత నాలుగు నెలలతో పోలిస్తే.. ప్రస్తుతం వైరస్‌ రాకెట్‌ వేగంతో విస్తరిస్తోంది. మార్చి నుంచి జూన్‌ చివరి వరకు 12,696 పాజిటివ్‌ కేసులు నమోదైతే.. జూలైలో కేవలం ఈ 11 రోజుల వ్యవధిలోనే 50 శాతం పైగా (13,233) కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు పాజిటివ్‌ కేసుల శాతం రోజురోజుకూ మరింత పెరుగుతున్నప్పటికీ.. నియంత్రణ చర్యలపై హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిన్నారు. టెస్టు చేయించుకుంటేతమకు పాజిటివ్‌ వచ్చిందని బాధితులు స్వయంగా అధికారులకు ఫోన్‌ చేసి చెప్పినా ట్రేసింగ్‌కు వెళ్లడంలేదు. కుటుంబ సభ్యులు సహా సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్‌ చేయడం లేదు. పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఏ లక్షణాలు లేని బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారికి హోం ఐసోలేషన్‌ కిట్‌లను అందజేయాలి. రెండు మూడు రోజులైనా వైద్య సిబ్బంది ఎవరూ రాకపోవడంతో బాధితులే స్వయంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి హోం ఐసోలేషన్‌ కిట్‌లను తీసుకొవాల్సి వస్తోంది. ప్రస్తుతం నగరంలో హోం ఐసోలేషన్‌లో 10,518 మంది ఉన్నారు. వీరిలో చాలా మందికి ఐసోలేషన్‌ కిట్‌లే అందలేదు. వారే స్వయంగా మెడికల్‌ షాపులకు వెళ్లి పారాసెటమాల్, మల్టీ విటమిన్‌ మాత్రలు తెచ్చుకుంటున్నారు. 

వీరు 83 శాతం..  
బాధితుల్లో ఇప్పటికే 60 శాతం మంది వైరస్‌ బారినుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 39 శాతం మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. వీరిలో 83 శాతం మంది అసింప్టమేటిక్‌ బాధితులే. 13 శాతం మంది మోడరేట్‌ సింప్టమ్స్‌ (ఐసోలేషన్‌ చికిత్సలు అవసరమైన) బాధితులు ఉన్నారు. కేవలం 4 శాతం మందికి మాత్రమే ఐసీయూ చికిత్సలు అవసరమవుతున్నాయి. కేవలం ఒక్క శాతం మంది మాత్రమే మృత్యువాతపడుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. అనుమానంతో చాలా మంది టెస్టింగ్‌కు వెళ్లినప్పటికీ.. సకాలంలో ఫలితాలు రాకపోవడంతో అప్పటికే వైరస్‌ తీవ్రత పెరిగి శ్వాస ఆడక ఇంట్లోనే మృత్యువాతపడుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు