ఆశలు అడియాసలే?

29 Aug, 2018 01:41 IST|Sakshi

‘ఏకీకృత రూల్స్‌’పై ఫలించని పంచాయతీరాజ్‌ టీచర్ల ప్రయత్నం

రాష్ట్రపతి ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు

26 ఏళ్ల పోరాటం.. అయినా లభించని ప్రయోజనం

టీచర్ల సంఘాలు, ప్రభుత్వాలు ఏకమైనా వైఫల్యమే

ఏం చేయాలన్న సందిగ్ధంలో ప్రభుత్వం, సంఘాలు

అభ్యంతరాలు లేవన్నాకే రాష్ట్రపతి ఉత్తర్వులు: ప్రభుత్వ టీచర్ల సంఘం

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ టీచర్లు 26 ఏళ్లుగా ఏకీకృత సర్వీసు రూల్స్‌ కోసం చేస్తున్న పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. టీచర్ల సంఘాలు, ప్రభుత్వాలు ఏకమైనా తమ వాదనను నెగ్గించుకోలేకపోయాయి. పంచాయతీరాజ్‌ టీచర్లను లోకల్‌ కేడర్‌గా ఆర్గనైజ్‌ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోర్టు కొట్టేయడంతో సుమారు 1.20 లక్షల మంది టీచర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వం, టీచర్ల సంఘాలు సందిగ్ధంలో పడిపోయాయి. ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ టీచర్లకు కలిపి ఏకీకృత సర్వీసు రూల్స్‌ కోసం అనేకమార్లు ప్రభుత్వాలు జీవోలు జారీ చేసినా కోర్టుల్లో నిలువలేకపోయాయి. 1992 నుంచి అనేకసార్లు ప్రభుత్వాలు చర్యలు చేపట్టినా న్యాయ వివాదాలుగా మారిపోయాయి.

అసలేం జరిగిందంటే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను 1971లో రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిగా విభజించారు. ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులకు సంబంధించి రాష్ట్రపతి ఆమోద ముద్రతో ప్రభుత్వం జీవో నంబర్‌ 529ని జారీ చేసింది. విద్యా శాఖకు వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలల టీచర్లనే చేర్చింది. అప్పటికి పంచాయతీరాజ్‌ టీచర్ల వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. తర్వాత కాలంలో పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని జిల్లా పరిషత్‌లు ఎక్కడికక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసి టీచర్లను నియమించుకున్నాయి.

దీంతో 1990 నాటికి ఆ స్కూళ్లు, టీచర్ల సంఖ్య భారీగా పెరిగింది. తమను కూడా ప్రభుత్వ టీచర్లతో సమానంగా పరిగణించాలని.. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్, డిప్యూటీ డీఈవో, డైట్‌ లెక్చరర్‌ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయ సంఘాలు పోరాటం చేశాయి. దీంతో ప్రభుత్వం 1992లో జీవో నంబర్‌ 40ను జారీ చేసింది. న్యాయపరమైన ఆటంకాలతో ఆ జీవోను ప్రభుత్వమే విరమించుకుంది. దీంతో అది అమలుకు నోచుకోలేదు.  

1998లో ఒకసారి, 2005లో మరోసారి..
ప్రభుత్వం 1998లో ఉమ్మడి సర్వీసు రూల్సు రూపొందించి జీవో 505ను, 538లను జారీ చేసింది. పంచాయతీరాజ్‌ టీచర్లు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని లోక ల్‌ కేడర్‌ పరిధిలో లేనందున ఉమ్మడి సర్వీసు నిబంధనలకు వీల్లేదని ప్రభుత్వ టీచర్లు ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను ట్రిబ్యునల్‌ సమర్థించగా ప్రభుత్వ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాకే ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ టీచర్లను కలపాలని హైకోర్టు ఉమ్మడి సర్వీసు నిబంధనలను 2003లో కొట్టేసింది.

అప్పటి నుంచి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్, డిప్యూటీ డీఈవో, డైట్‌ లెక్చరర్‌ వంటి పోస్టుల్లో పదోన్నతులు నిలిచిపోయాయి. తరువాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం 2005 మేలో మళ్లీ ఏకీకృత సర్వీసు కోసం జీవో 95, 96లను జారీ చేసి పదోన్నతులు కల్పించింది. వాటి పై మళ్లీ ప్రభుత్వ టీచర్లు ట్రిబ్యునల్‌లో సవాల్‌ చేసి గెలిచారు. ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా 2007లో ‘రూల్స్‌’కు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం 2007లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనేక వాదనలు, వాయిదాల తరు వాత 2015 సెప్టెంబర్‌ 30న తీర్పు ఇచ్చింది.

సుప్రీం ఏం చెప్పిందంటే..
రాష్ట్రపతి ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్గనైజ్‌ అయి ఉన్న ప్రభుత్వ టీచర్లకు, ఆర్గనైజ్‌ కాని పంచాయతీరాజ్‌ టీచర్లకు కలిపి ఏకీకృత సర్వీసు రూల్స్‌ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ‘ఉమ్మడి సర్వీసు రూల్స్‌ తీసుకురావాలంటే రాష్ట్ర పతి ఉత్తర్వులకు కేంద్రం ద్వారా సవరణ చేయించాలి. ఆ సవరణ ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పంచాయతీరాజ్‌ టీచర్లను లోకల్‌ కేడర్‌గా పొందుపరచడం ద్వారానే ఒకే సర్వీసు రూల్స్‌ తీసుకురావడం సా«ధ్యం అవుతుంది. అప్పటి వరకు ఉమ్మడి రూల్స్‌ కుదరదు’అని పేర్కొంది.

2017లో రాష్ట్రపతి ఉత్తర్వులు
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధిక సంఖ్యలో ఉన్న పంచాయతీరాజ్‌ టీచర్లను లోకల్‌ కేడర్‌గా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఆర్గనైజ్‌ చేసేలా చర్యలు చేపట్టాలని కోరు తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫైలుపై 2016 ఏప్రిల్‌ 5న సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. ఆ తరు వాత దాన్ని కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ సమస్య ఏపీతోనూ ముడిపడి ఉన్నందున ఆ రాష్ట్రం కూడా ప్రతిపాదనలు పంపింది. తరువాత పలుమా ర్లు సంప్రదింపులు, చర్చల అనంతరం 2017 జూన్‌ 23న రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వ టీచర్లు 2017 జూలై 12న హైకోర్టులో కేసు వేశారు. తాజాగా మంగళవా రం రాష్ట్రపతి ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

అందువల్లే ఈ పరిస్థితి!
రాష్ట్రపతి ఉత్తర్వుల జారీకి ముందే.. రాష్ట్రంలో ఏకీకృత సర్వీసు రూల్స్‌ కోసం అభ్యంతరాలు ఉన్నాయా? అని రాష్ట్రపతి అడిగినపుడు అభ్యంతరాలు లేవని చెప్పడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మామిడోజు వీరాచారి అన్నారు. ఏ దశలోనూ తమ వాదనను, అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వ అధికారులు పొరపాటు చేశారని చెప్పారు. న్యాయం తమవైపే ఉందని కోర్టు తీర్పుతో వెల్లడైందన్నారు.

>
మరిన్ని వార్తలు