ఐకియా స్టోర్‌ : నిన్న వెజ్‌ బిర్యానీ.. నేడు కేక్‌

21 Sep, 2018 09:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వెజ్‌ బిర్యానీలో గొంగళి పురుగు రేపిన కలకలం సద్దుమణగకముందే ఐకియాలో మరో పురుగు బయటకొచ్చింది. ఈ సారి చాక్లెట్‌ కేక్‌లో, అది కూడా బతికున్న పురుగు. కిషోర్‌ అనే కస్టమర్‌ ఈ విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా తెలియజేశాడు. వివరాలు.. కిషోర్‌ అనే కస్టమర్‌ ఈ నెల 12న తన కూతురితో కలిసి ఐకియా రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఆ సమయంలో కిషోర్‌ కూతురు చాక్లెట్‌ కేక్‌ని ఆర్డర్‌ చేసింది. తీరా కేక్‌ని తీసుకొచ్చాక చూస్తే దాని మీద ఓ పురుగు పాకుతుంది. ఇది గమనించిన కిషోర్‌ తన ఆర్డర్‌ కాపీ, బిల్‌ పే చేసిన కాపీతో పాటు చాక్లెట్‌ మీద ఉన్న పురుగును కూడా వీడియో తీసి మున్సిపల్‌ అధికారులకు, హైదరాబాద్‌ పోలీస్‌లకు ట్యాగ్‌ చేశాడు.

కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రెండు రోజుల క్రితం మరో వీడియోని పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో జీహెచ్‌ఎంసీ అధికారులు తన ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని తెలియజేశాడు. దాంతో స్పందించిన మున్సిపల్‌ అధికారులు ఈ స్వీడిష్‌ ఫర్నీచర్‌ కంపెనీకి 5 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం గురించి ఐకియా అధికారి ఒకరి మాట్లాడుతూ ‘మా రెస్టారెంట్‌లో ఓ కస్టమర్‌ ఆర్డర్‌ చేసిన చాక్లెట్‌ కేక్‌లో పురుగు వచ్చిందని తెలిసింది. దీని గురించి మేం ఎంతో చింతిస్తున్నాం. అందుకు క్షమించమని కోరుకుంటున్నాం. ఇది అనుకోకుండా జరిగింది. ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని తెలిపారు.

గతంలో వెజ్‌ బిర్యానీలో గొంగళి పురుగు వచ్చినప్పుడు జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సెఫ్టీ అధికారులు ఐకియాకు 11, 500 రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసింది. అయితే ఈ సంఘటన తర్వాత ఐకియా ఇక మీదట తన స్లోర్‌లో వెజిటేబుల్‌ బిర్యానీని అమ్మడం మానేసినట్లు ప్రకటించింది. ఈ ‍క్రమంలో ‘ఇక మీదట ఐకియా కేక్‌లను కూడా అమ్మడం మానేస్తుందా..?’  అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు