12 దేశాలు.. 200 ప్రతినిధులు

28 Jan, 2019 02:11 IST|Sakshi

వేడుకగా ముగిసిన హైదరాబాద్‌ సాహితీ ఉత్సవం

వివిధ అంశాలపై విస్తృత చర్చలు, అవగాహనా సదస్సులు... 

చివరి రోజు ఆకట్టుకున్న గురుచరణ్‌దాస్, షబానాఆజ్మీ,మల్లికాసారాభాయ్‌ల ప్రసంగాలు.. 

సాక్షి, హైదరాబాద్‌: విభిన్న సామాజిక అంశాలు, కళలు, భాషలు,సంస్కృతుల సమ్మేళనంగా రాష్ట్ర రాజధాని నగరం బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌లో 3 రోజులు నిర్వహించిన హైదరాబాద్‌ సాహితీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. దేశ,విదేశాలకు చెందిన సాహితీప్రియులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు, వివిధ రంగాల నిపుణులు 12 దేశాల నుంచి 200 మంది విదేశీ ప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. చైనా అతిథిదేశంగా హాజరవడం విశేషం. సాహితీ ఉత్సవంలో సుమారు 30 అంశాలపై సదస్సులు జరిగాయి. చివరిరోజు ప్రముఖ నటి షబానా ఆజ్మీ తన తండ్రి కైఫి ఆజ్మీ శతాబ్ది జన్మదినం సందర్భంగా ఆయన రాసిన కవితలు,ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆమె సంతోషం వ్యక్తంచేశారు.  

సులభతర పన్నులతో చేయూత: గురుచరణ్‌
సులభతర పన్నులవ్యవస్థ ఆర్థికరంగానికి చేయూత నిస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త గురుచరణ్‌దాస్‌ అన్నారు. ఆదివారం ‘మనీమ్యాటర్స్‌’అన్న అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ ఆర్థికవ్యవస్థ ప్రస్థానం, యురోపియన్‌ దేశాల్లో పన్ను ల వ్యవస్థ పరిణామ క్రమం తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థిక నిపుణులు విక్రమ్,వివేక్‌కౌల్‌ తదితరులు పాల్గొన్నారు. 

హౌ సేఫ్‌ ఈజ్‌ అవర్‌ మనీ: వివేక్‌ కౌల్‌ 
డబ్బు, ఆర్థిక వ్యవస్థ మీద పుస్తకాలు వెలువరిస్తూ, ప్రసంగాలు చేసే వివేక్‌ కౌల్‌ పాల్గొన్నారు. నగదు రద్దు క్రమంలో డబ్బు దాచుకోవటం ఎంత ప్రమాదకరమో వివరించారు. బిట్‌ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ ఏమాత్రం సురక్షితం కావని అన్నారు. 

మేధావుల మౌనం నష్టమే : మల్లికాసారాభాయ్‌ 
దేశంలో మేధావులు,విద్యావంతులు వివిధ సామాజిక సమస్యలు,అంశాలపై మౌనంగా మారడం సమాజానికి తీరని నష్టం కలిగిస్తోందని ప్రముఖ సామాజికవేత్త మల్లికాసారాభాయ్‌ అన్నారు. మంచికోసం,సమాజంలో మార్పుకోసం ప్రతీఒక్కరూ పోరాడాలని,చుట్టూ జరుగుతున్న అన్యాయాలపై రాజకీయనేతలు,అధికారులను ప్రశ్నించే తత్వం అలవరచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణా ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

దళిత మహిళా రచయితలపై వివక్ష కొనసాగుతోంది: మెర్సీ మార్గరెట్‌
దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవ మహిళా రచయితలపై వివక్ష కొనసాగుతోందని ప్రముఖ రచయిత్రి,సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మెర్సీ మార్గరెట్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ‘తెలంగాణ సాహితీసంస్కృతి’అన్న అంశంపై ఆమె మాట్లాడారు. జాతీయ ఉర్దూవర్సిటీ ప్రొఫెసర్‌ బేజ్‌ ఎజాజ్‌ మాట్లాడుతూ..హైదరాబాద్‌ విశిష్ట సంస్కృతీ,సంప్రదాయాలను వివరించారు. ప్రముఖ జర్నలిస్ట్‌ టంకశాల అశోక్‌ మాట్లా డుతూ..సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని అనువాద రచనల్లో తాను అందిస్తోన్న విధానాన్ని వెల్లడించారు. 

కామ– ది రిడిల్‌ ఆఫ్‌ డిజైర్‌
తాను ఇటీవల వెలువరించిన పుస్తకం ‘కామ– ది రిడిల్‌ ఆఫ్‌ డిజైర్‌ ’గురించి దాని రచయిత గురుచరణ్‌దాస్‌ ప్రసంగించారు. ఆధునిక జీవితంలో ధార్మిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, స్వీయ జీవితం పట్ల దృష్టి తగ్గిస్తున్నామన్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని, కామదేవ దివస్‌గా నిర్వహించుకోవాలని తాను, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ ఒక ఉద్యమం ప్రారంభించాలనే యోచనలో ఉన్నామని, ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం నుంచే దీన్ని ప్రారంభిస్తామన్నారు.హిందూత్వ భావజాలానికి ఇక కాలం చెల్లుతుందన్నారు.   

మరిన్ని వార్తలు