లాక్‌డౌన్‌ విధిస్తే​ ఏం చేయాలి?

30 Jun, 2020 08:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో మరీ ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ దాని పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ విధించడానికి సిద్ధమైనట్టు సంకేతాలిచ్చింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా పేర్కొంది. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి మార్చి 22న చేపట్టిన జనతా కర్ఫ్యూ, ఆ మరుసటి రోజు నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వివిధ దశల్లో లాక్‌డౌన్‌ కాలాన్ని పొడగించడం, కొన్ని సడలింపులివ్వడం వంటి ప్రక్రియలతో మంగళవారం నాటికి సరిగ్గా వంద రోజులు పూర్తయ్యాయి. (గ్రేటర్‌లో కరోనా.. హైరానా)

సడలింపులు ఇచ్చిన అనంతరం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆందోళనకు గురిచేస్తున్న ఈ పరిణామాలను అధ్యయనం చేసిన తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉన్న హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్‌ విధించడం ఉత్తమమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో మరో పక్షం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడానికి ఆస్కారం ఉంది. లాక్‌డౌన్‌ ఈసారి 15 రోజుల పాన్‌ విధిస్తారా? లేక జూలై నెలాఖరు వరకు విధించాలా అన్న మీమాంసలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. (2న రాష్ట్ర మంత్రివర్గ భేటీ)

దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన త్వరలో జరగబోయే మంత్రిమండలి సమావేశం పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ఇకపోతే, ఈసారి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలన్న ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మరింత కఠినంగా అమలు చేస్తారనడానికి సంకేతంగానే లాక్‌డౌన్‌ విధించబోతున్నట్టు ముందస్తు సమాచారం బహిర్గతం చేసినట్టు తెలుస్తోంది. తద్వారా ప్రజలు అప్రమత్తమైన అవసరమైన నిత్యవసర సరుకులు సమకూర్చుకుంటారన్న ఆలోచనతో ఆ విధమైన ముందస్తు సంకేతాలిచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ లాక్‌డౌన్‌ విధించి కఠిన నిబంధనలు అమలు చేయాలనుకున్న పక్షంలో పగటిపూట రెండు లేదా మూడు గంటలు మాత్రమే నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అనుమతించి రోజంతా కర్ఫ్యూ అమలు చేస్తారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ​ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తే, లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బందులు పడే అవకాశం తక్కువగా ఉంటుంది.  కరోనా కట్టడి కోసం మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన ప్రకటన ఉన్నట్టుండి అనూహ్యంగా అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆరోజు ఆకస్మాత్తుగా వెలువడిన నిర్ణయం కావడం, లాక్‌డౌన్‌కు సంబంధించి సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది పలు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రజలు సరైన ప్రణాళిక రూపొందించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. తద్వారా ఈ సమయంలో వీలైనంత వరకు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉండవచ్చు.

లాక్‌డౌన్‌ విధిస్తే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు

 • 15 రోజులకు సరిపడా కిరాణా, ఇతర నిత్యావసరాలను ముందే కొనిపెట్టుకోవాలి.
 • రిఫ్రిజిరేటర్లు ఉన్నవారు తరచూ బయటికి వెళ్లకుండా ఒకేసారి పది రోజులకు సరిపడ కూరగాయలు తెచ్చుకోవడం మేలు.
 • గ్యాస్‌ సిలిండర్‌ ఎన్ని రోజులు వస్తుందో సరిచూసుకుని.. ముందుగానే నిల్వ ఉంచుకోవాలి.
 • తాజా పండ్లు, డ్రై ప్రూట్స్‌ వంటివి ముందే తెచ్చిపెట్టుకోవడం ఉత్తమం.
 • లాక్‌డౌన్‌ సడలింపు ఇచ్చిన సమయాన్ని కేవలం పాలు, బ్రెడ్డు.. వంటి వాటి కొనుగోలుకు మాత్రమే కేటాయించాలి.
 • ముఖ్యంగా పాలు, పెరుగు ప్యాకెట్లను ముందుగా సబ్బు నీటిలో కొద్దిసేపు ఉంచిన తర్వాత మాత్రమే ఇంటిలోనికి తీసుకెళ్లాలి.
 • చిన్నపిల్లలకు అవసరమైన ఆహారం, ఇతర సామాగ్రిని ముందే తెచ్చిపెట్టుకోవాలి.
 • ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో మెడిసిన్‌ వాడుతున్న వారుంటే, వారికి సరిపడా మందులు తెచ్చిపెట్టుకోవాలి.
 • అవసరమైన మేర శానిటైజర్‌, మాస్క్‌లు అందుబాటులో ఉంచుకోవాలి.
 • నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం మరిచిపోవద్దు.
 • వీలైనంత మేర ఇంట్లోనే ఉండి కరోనా బారినపడకుండా క్షేమంగా ఉండండి

Poll
Loading...
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు