వీఆర్వో, వీఏఓ వేధిస్తున్నారంటూ కేసీఆర్‌కు లేఖ రాసి...

6 Jun, 2019 19:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో వీఏఓ, వీఆర్వోల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలను వేధించుకుతింటున్నారు. దీనికి తాజాగా జరిగిన ఘటన ఉదాహరణగా నిలిచింది. వీఆర్వో, వీఏవో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని సీఎం కేసీఆర్‌కు లేఖ రాసి.. తన ముగ్గురు పిల్లలతో కలిసి అదృశ్యమయ్యారు హైదరాబాద్‌లోని తార్నాకలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి. పెద్దపల్లి జిల్లా పగిడిపల్లిలోని తన తండ్రి నారాయణ రెడ్డి మరణించిన తర్వాత వారసత్వంగా వచ్చే భూమిని తన పేరు మీదకు మార్చాలని అప్లికేషన్‌ పెట్టుకుంటే అక్కడి వీఏఓ, వీఆర్వోలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని లేఖలో పేర్కొన్నారు. తన చావుకు, పిల్లల చావుకు వీఏఓ, వీఆర్వోలే కారణమని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఒక సెల్ఫీ వీడియో రికార్డు చేసి, తన మరణానంతరం ఆస్తిని తన తల్లి పేరు మీద రాసివ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా మల్లా రెడ్డి అదృశ్యం పట్ల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. 

మల్లారెడ్డి ఆచూకి లభ్యం
తార్నాకలో తన ముగ్గురు పిల్లలలతో మిస్సింగ్ అయిన మల్లారెడ్డి ఆచూకీని ఓయూ పోలీసులు కనుగొన్నారు. భువనగిరిలో ఉన్న మల్లారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా మల్లారెడ్డి ఆచూకి కనుగొన్న పోలీసులు.. ఆయనతో పాటు ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

మరిన్ని వార్తలు