కుండపోతగా కురిస్తే..

22 Aug, 2018 02:16 IST|Sakshi

ఒక రోజులో 40 సెం.మీ.ల వాన పడితే నగరం మునకే

జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధ్యయనంలో వెల్లడి

దేశంలోని ప్రధాన నగరాలకు పొంచి ఉన్న ముప్పుపై విశ్లేషణ

ముందస్తు ప్రణాళికకు శ్రీకారం.. అక్టోబర్‌లో జాతీయ సదస్సు ఏర్పాటుకు యోచన

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: నాలుగు చినుకులు పడితేనే చెరువుల్లా మారే వీధులు, రోడ్లతో విలవిల్లాడే భాగ్యనగరంలో ఒకవేళ కుంభవృష్టి కురిస్తే? కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పదుల సెంటీమీటర్ల మేర జడివాన పడితే? 2000 సంవత్సరం తరహాలో హైదరాబాద్‌ నిండా మునిగే పరిస్థితి పునరావృతమైతే? 2005లో ముంబై, 2015లో చెన్నైని ముంచెత్తిన అతి భారీ వర్షాల నుంచి మన రాజధాని ఏం పాఠాలు నేర్చుకుంది? హైదరాబాద్‌ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలాంటి పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) అధ్యయనం చేసింది. ఏయే ప్రాంతాలకు ఏ మేర ముప్పు పొంచి ఉందో విశ్లేషించింది. ఈ పరిస్థితులను నివారించేందుకు అనుసరించాల్సిన మార్గాలను సూచించింది. భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమైన నేపథ్యంలో ఇలాంటి ఆపద పొంచి ఉన్న రాష్ట్రాలు, నగరాలను అప్రమత్తం చేసే పనిలో పడింది. దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు, వాటి రాజధానులు, ఇతర ముఖ్య పట్టణాల్లో భౌగోళిక పరిస్థితులను శాటిలైట్‌ మ్యాప్‌ల ద్వారా అధ్యయనం చేస్తోంది. రాష్ట్రాల రాజధానులు, నగరాలు, ముఖ్య పట్టణాలను వర్గీకరణ చేసుకుని భారీ వర్షాలు సంభవిస్తే ఏర్పడే ముప్పును అంచనా వేస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలాంటి విపత్తులు సంభవిస్తే దేశంలో ఏయే రాష్ట్రాలు, నగరాలు ప్రమాదపుటంచున ఉంటాయో అన్న దానిపై ఒక అంచనాకు వచ్చింది.

హైదరాబాద్‌కు పెను ముప్పే... 
ఇరవై నాలుగు గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో ఉంటుందని ఎన్‌డీఎంఏ అంచనా వేసింది. మొదటి రెండు స్థానాల్లో ముంబై, చెన్నై నగరాలున్నాయి. అయితే ఆ రెండు నగరాల్లో కురిసే వర్షంలో సగం కురిసినా హైదరాబాద్‌ వాటికి మించి నష్టాన్ని చవిచూస్తుందన్నది ఎన్‌డీఎంఏ విశ్లేషణ. వాతావరణంలో తరచూ మార్పులు సంభవించవచ్చని, భవిష్యత్తులో ఏదో ఒక ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ నిపుణుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌డీఎంఏ ముందస్తు ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. తీవ్రమైన విపత్తులు సంభవించిన సమయంలో వీలైనంతగా ప్రాణనష్టం తగ్గించడమే ఈ ప్రణాళిక అసలు లక్ష్యం.
 
ఎంత కురిస్తే ఏ మేర నష్టం... 
హైదరాబాద్‌ పరిసరాల్లో వందలాది చెరువులు, కుంటలను కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మించడం, ఉన్న కొద్దిపాటి చెరువులు, కుంటల శిఖం భూములు ఆక్రమణకు గురికావడమే దీనికి కారణమని నిర్దారించింది. ‘ముంబైలో గతంలో 24 గంటల పాటు 90 సెం.మీ. వర్షం కురిసినప్పుడు దాదాపు ఐదు రోజులపాటు జనజీవనం పూర్తిగా స్తంభించింది. చెన్నైలో అంతే సమయంలో 60 సెం.మీ వర్షం కురిసినప్పుడు అక్కడ ప్రజానీకం వారంపాటు నానా ఇబ్బందులు పడింది. అదే హైదరాబాద్‌లో 24 గంటల్లో 40 సెంటీమీటర్ల వర్షం కురిస్తే సగం నగరం వరదలోనే ఉంటుంది. రోజున్నర పాటు అంటే 36 గంటల పాటు తెలంగాణ రాజధానిలో 60 సెం.మీ వర్షం కురిస్తే ముప్పావువంతు హైదరాబాద్‌ నీటిలో విలవిలలాడుతుంది. మూడు నుంచి నాలుగు గంటల్లో ఏకధాటిగా 10 నుంచి 12 సెం.మీ వర్షం కురిస్తే అనేక కాలనీలు నదులను తలపించేవిలా మారుతాయి. 

  • 3-4 గంటలు(10-12సెం.మీ.లు) ; అనేక కాలనీలు నదులను తలపిస్తాయి 
  • 24 గంటలు(40 సెం.మీ.లు) ; సగం నగరం వరదలోనే చిక్కుకుంటుంది
  • 36 గంటలు(60 సెం.మీ.లు) ; ముప్పావు వంతు నగరం నీటిలోనే  


చర్యలు మొదలుపెట్టిన సర్కారు... 
ఇలాంటి విపత్తులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం గడచిన రెండేళ్లుగా చర్యలు మొదలుపెట్టింది. చెరువులు, కుంటల శిఖం భూములకు సరిహద్దులు నిర్ణయించే పనికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఎన్‌డీఎంఏ నిపుణుల కమిటీ నివేదిక వ్యాఖ్యానించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీలో జాతీయ సదస్సు ఏర్పాటు చేసి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించాలని యోచిస్తోంది. అప్పటికల్లా భారీ వర్షాల వల్ల వివిధ నగరాలకు పొంచి ఉన్న ముప్పునకు సంబంధించి పూర్తి నివేదికసు సిద్ధం చేయాలని భావిస్తోంది. 

ఏపీకి రెట్టింపు నష్టం! 
మహారాష్ట్రలోని గోదావరి నది జన్మస్థలంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కురిస్తే తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు వరద ముప్పు తీవ్రంగా ఉంటుందని ఎన్‌డీఎంఏ అంచనా వేసింది. అంతకంటే రెట్టింపు ముప్పు ఆంధ్రప్రదేశ్‌లోని (ఏపీ) ఉభయ గోదావరి జిల్లాలకు ఉంటుంది. గోదావరి వరదలతో నిమిత్తం లేకుండా ఒక రోజు ఏపీలో 30 సెం.మీ వర్ష కురిస్తే ఏపీలోని 10 జిల్లాలు వరద ముప్పునకు గురవుతాయి. కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప పట్టణాలు వరద ప్రళయంలో చిక్కుకుంటాయని ఎన్‌డీఎంఏ పేర్కొంది. ఏపీ రాజధాని అమరావతికి ఇంకా తుది రూపు రాకపోవడంతో ఎన్‌డీఎంఏ దానిని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే భారీ వర్షాలు నమోదైతే దక్షిణాదిలో కేరళ అంతటి ఉపద్రవం ఏపీకి పొంచి ఉందని, ఆ తరువాత స్థానంలో తెలంగాణ ఉంటుందని ఎన్‌డీఎంఏ తన నివేదికలో పేర్కొంది. దక్షిణాదిలో భారీ వర్షపాతం నమోదైతే వరదలు సంభవించి తీవ్రంగా దెబ్బతినే నగరాలు, పట్టణాలు ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. 


ఫైల్‌ ఫొటో

రాష్ట్రం వర్షపాతం తీవ్రంగా దెబ్బతినే పట్టణాలు 
తెలంగాణ     (48 గంటలకన్నా ఎక్కువసేపు) ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం  
ఆంధ్రప్రదేశ్‌ 24 గంటల్లో 30 సెం.మీ. కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, 
విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప 

మరిన్ని వార్తలు