కరోనా ఓడాలి.. మనం గెలవాలి..

18 Apr, 2020 07:55 IST|Sakshi

మన నగరాన్ని మనమే కాపాడుకుందాం..

ఇంట్లోనే ఉందాం.. కరోనా చైన్‌ తెగ్గొడదాం..

ఎమర్జెన్సీ పాసులను దుర్వినియోగం చేస్తే కేసులు  

సోషల్‌ డిస్టెన్స్‌ పాటించని సూపర్‌ మార్కెట్లకు తాళం

నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌  

సాక్షి, సిటీబ్యూరో: ‘చారిత్రక, వారసత్వ సంపదతోపాటు ఐటీ నగరిగానూ ఎంతో విశిష్టతలు కలిగిన ఈ భాగ్యనగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచమంతా అల్లాడుతున్న ప్రస్తుత తరుణంలో వ్యాధి కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. ప్రభుత్వాలు ఎంత చేసినా మనం స్వీయ నియంత్రణ పాటించకపోతే ప్రయోజనం ఉండదు. ఇన్ని రోజులుగా పాటిస్తున్న లాక్‌డౌన్‌ వృథా అవుతుంది. మే నెలాఖరు వరకు వ్యాధి పెరగకుండా అనుకూల వాతావరణమని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ముందే చైన్‌ను పూర్తిగా తెగ్గొట్టాలి. ఆ కార్యం నిర్వహించేందుకు లాక్‌డౌన్‌ నిబంధనలతోపాటు కంటైన్మెంట్‌ జోన్లలోని ప్రజలంతా కచ్చితంగా నిబంధనలు పాటించాలి. మన హైదరాబాద్‌ నగరాన్ని మనమే కాపాడుకోవాలి.’ అంటూ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా శుక్రవారంవిలేకరులతో చిట్‌చాట్‌లోపలు అంశాలను వివరించారు..
కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తితో ఎక్కడైనా కాంటాక్ట్‌ అయి ఉంటే  స్వచ్ఛందంగా తెలియజేయండి చాలు. ప్రభుత్వమే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులున్న వారి ఇళ్ల పరిసరాల్లో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ జోన్లలోని వారు బయటకు వెళ్లకుండా అన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. వైరస్‌ వ్యాప్తిని ఎక్కడికక్కడ తెగ్గొట్టకపోతే ఎంతో మందికి వ్యాపించే ప్రమాదం ఉందన్నారు.

వైరస్‌ ఎలా విస్తరిస్తుందో అంతుబట్టడం లేదంటూ, పాజిటివ్‌ వ్యక్తులను కలిసినట్లు అనుమానాలున్న వారు వివరాలను అందించాలని కోరారు. తాను పర్యటించిన కంటైన్మెంట్‌ జోన్లలోని కొన్ని సంఘటనల్ని ప్రస్తావిస్తూ చాలామంది జోన్‌ దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఓ బ్యాంక్‌ ఉన్నతాధికారి ఒకరు తాను కచ్చితంగా కార్యాలయానికి వెళ్లాలని, పనులు స్తంభిస్తాయని తెలపగా ఆయన పైఅధికారులను తాము సంప్రదించగా, అన్ని విధాలా ప్రభుత్వ చర్యలకు సహకరిస్తామని చెప్పారన్నారు. వ్యాధి ఎలా పొంచి ఉందో తెలియదు కనుక.. అందరూ నిబంధనలు పాటించినప్పుడే మన నగరాన్ని కాపాడుకోగలమన్నారు. ఈనెల 20 తర్వాత నిబంధనలు సడలిస్తారనగానే ఇప్పటికే రోడ్లపై వాహనాల సంఖ్య భారీగా పెరిగిందంటూ ఈ ధోరణి సరికాదన్నారు. హైదరాబాద్‌ వంటి మహానగరానికి                కొన్ని మినహాయింపులు ఇచ్చినా కష్టమని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయన్నారు. క్లోజ్‌ కాంటాక్ట్‌ అనుమానాలతో క్వారంటైన్‌లోని 14 రోజులే కాకుండా ఆ తర్వాత మరో 14 రోజులు కూడా బఫర్‌ పీరియడ్‌గా పాటిచాలన్నారు.  

నకిలీ పాసులుంటే క్రిమినల్‌ కేసులు..
ఎమర్జెన్సీ సేవల పాసులను కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు, నకిలీ పాసులు సృష్టిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, పోలీసు అధికారులతో మాట్లాడి అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూపర్‌మార్కెట్లు, కిరాణా దుకాణాల వారు సామాజిక దూరం పాటించే చర్యలు తీసుకోకుంటే సీజ్‌ చేస్తామన్నారు. ఈ మేరకు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి వాటిపై ప్రజలు కూడా ఫొటో, వీడియో షేర్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ధరలు పెరిగాయంటూ హాస్టళ్ల యజమానులు హాస్టళ్లలోని వారిని ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నట్లు దృష్టికొచ్చిందన్నారు. ప్రభుత్వ శాఖల ద్వారా చౌక ధరలకు అవసరమైన సరుకులందే ఏర్పాట్లు చేస్తామని, ఫీజుల కోసం ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఇళ్ల యజమానులు అద్దెలకు ఉంటున్నవారి        పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని సూచించారు. సహాయం అందని వలస కార్మికులకు అందించే చర్యలు ప్రారంభంఅయ్యాయన్నారు. 

మరిన్ని వార్తలు