ఉల్లి లొల్లి ఎందుకంటే..!

5 Dec, 2019 07:59 IST|Sakshi

కృత్రిమ కొరత సృష్టిస్తున్నవ్యాపారులు

మహారాష్ట్ర వ్యాపారులతో స్థానిక వ్యాపారుల కుమ్మక్కు

మార్కెట్‌కు కాకుండా గోదాములకు తరలుతున్న ఉల్లి

గతేడాదితో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిన ధరలు

సాక్షి సిటీబ్యూరో: ఉల్లిగడ్డ ప్రజల్ని మరోసారి కంగుతినిపిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో రూ.100 దాటడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఉల్లిపైనే చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈసారి ఉల్లిగడ్డ ధరలు ఇంతగా ఎందుకు పెరిగాయనే దానిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేకించి కొందరు వ్యాపారులు ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ జిల్లాల నుంచి ఉల్లి దిగుమతులు ఆగిపోవడం, మహారాష్ట్ర నుంచి అనుకున్న దానికి కంటే సగం దిగుమతి తగ్గడంతో ఇక్కడి వ్యాపారులు ఉల్లి గేమ్‌ ఆడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత నెల సాఫీగా సాగిన ఉల్లిగడ్డ సరఫరాకు కొందరు వ్యాపారులు అడ్డంకులు సృíష్టించారని తెలుస్తోంది. మహారాష్ట్ర వ్యాపారులతో కుమ్మక్కైన ఇక్కడి వ్యాపారులు సరఫరాను తగ్గించేస్తున్నారు. తద్వారా ఉల్లిగడ్డకు కొరత సృష్టించడంతోనే ధరలు భారీ స్థాయిలో పెరిగాయని తెలుస్తోంది.

గతేడాదితో పోలిస్తే నాలుగు రెట్లు
గత నెల రోజుల క్రితం మార్కెట్‌కు 70–80 లారీల ఉల్లి దిగుమతి అయింది. ఈ నెల ప్రారంభం నుంచి 40–30 లారీలు మాత్రమే దిగుమతి అవుతోంది. గత ఏడాది డిసెంబర్‌ మొదటి వారంలో 60–70 లారీల ఉల్లి దిగుమతి అయిందని మలక్‌పేట్‌ మార్కెట్‌ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ నెలలో ఉల్లి కిలో రూ.20 నుంచి 30 వరకు విక్రయించారు. ఈ ఏడాది గత ఏడాది కంటే 50 శాతం తక్కువగా ఉల్లి దిగుమతి అవుంతుంది. ధరలు ఐదు రెట్లు పెంచి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి ఉల్లి ధరలు విపరీతంగా పెంచారు. ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారుల నుంచి సరుకు ముందే కొనుగోలు చేసి వాటిని నగరానికి తరలించకుండా..వారి గోదాముల్లో నిల్వచేసుకుంటున్నారని తెలిసింది. మార్కెట్‌కు కాకుండా గోదాములకు సరఫరా చేసినందుకు మహారాష్ట్ర వ్యాపారులకు కొంత మొత్తం ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. కృత్రిమ కొరత కారణంగా ధరలు పెరుగుతుండడంతో...ఆ సమయంలోనే గోదాముల్లోని సరుకును బయటకు తీస్తున్నారని తెలిసింది. తద్వారా వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. గత నెలలో నగరానికి రోజుకు 80 లారీల ఉల్లి మహారాష్ట్ర నుంచి దిగుమతి అయుంది. ప్రస్తుతం 30 నుంచి 40 లారీలు కూడా రావడం లేదని కొందరు వ్యాపారులు తెలిపారు. దీంతో వారం పది రోజుల్లోనే  క్వింటాల్‌ రూ.2 వేల వరకు ఉన్న ధరలు రూ.10 వేలకు పెంచారు.  జంట నగరాల మార్కెట్‌లలో ఉల్లిగడ్డ నిల్వచేయడానికి తగిన గోదాముల వసతి లేక పోవడంవల్లే ఇలాంటి అక్రమాలకు తెర తీస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొరతను సృష్టించే అక్రమ వ్యాపారులపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.  

మరిన్ని వార్తలు