బయట నుంచి రాగానే తేనె తినకండి

24 Feb, 2019 05:38 IST|Sakshi

ఎండలతో తస్మాత్‌ జాగ్రత్త..

వాతావరణ శాఖ సూచన

సాక్షి, హైదరాబాద్‌: మార్చి నెల రాకముందే ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి నమోదవుతుండటంతో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం కొన్ని సూచనలతో కూడిన ప్రకటనను జారీ చేసింది. తల తిరగడం, తీవ్ర జ్వరం, మత్తు నిద్ర, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి వంటి వడదెబ్బ లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలని పేర్కొంది. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించాలని సూచించింది.

ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు..
- తెలుపు రంగు పలుచటి కాటన్‌ వస్త్రాలను ధరించాలి.
తలకు టోపి పెట్టుకోవాలి లేదా రుమాలు కట్టుకోవాలి.
ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు కలిపిన నీటిని, ఓరల్‌ రీ హైడ్రేషన్‌ కలిపిన నీటిని తాగాలి.
వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడ ఉన్న ప్రాంతానికి చేర్చాలి.
వడదెబ్బకు గురైన వారిని తడిగుడ్డతో శరీరం అంతా రుద్దుతూ ఉండాలి. ఐస్‌ నీటిలో బట్టను ముంచి శరీరం అంతా తుడవాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే లోపునకు వచ్చే వరకు బట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ఫ్యాను కింద ఉంచాలి. 
వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానట్లయితే వారిని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించాలి.
మంచినీరు ఎక్కువగా తాగాలి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నిమ్మరసం గానీ కొబ్బరినీరు లేదా చల్లని నీరు తాగాలి.

ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి..
నలుపురంగు, మందపాటి దుస్తులు ధరించరాదు.
మధ్యాహ్నం (ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు) ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయవద్దు.
ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకోకూడదు.
శీతల పానీయాలు, మంచుముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యం ఏర్పడుతుంది.  

రాష్ట్రంలో దంచికొట్టిన ఎండలు
భద్రాచలం, మహబూబ్‌నగర్‌ల్లో 38 డిగ్రీలు నమోదు 
రాష్ట్రంలో ఎండలు దంచికొట్టాయి. శనివారం భద్రాచలం, మహబూబ్‌నగర్‌ల్లో ఏకంగా 38 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. ఇక ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండంల్లో 37 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడే ఈ స్థాయిలో ఎండలున్నాయంటే మున్ముందు పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆదివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. 

మరిన్ని వార్తలు