మెట్రో రైళ్లలో చేయకూడని పనులివీ..

13 Aug, 2019 11:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ (సిటీబ్యూరో): గ్రేటర్‌వాసుల కలల మెట్రో జర్నీకి సిటీజన్ల నుంచి ఆదరణ పెరుగుతోన్న విషయం విదితమే. ప్రస్తుతం ఎల్బీనగర్‌–మియాపూర్‌(29కి.మీ.), నాగోల్‌–హైటెక్‌సిటీ(28 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రెండు రూట్లలో నిత్యం సుమారు మూడు లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే వీరిలో కొందరు కొత్తవారు కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో జర్నీలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెట్రో అధికారులు ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. ఆ వివరాలివీ.

స్టేషన్లు, రైలులో చేయాల్సిన పనులివీ..

  • మీ చేతిలో లేదా బ్యాగులోని చెత్త, చెదారాన్ని విధిగా చెత్తకుండీలోనే వేయాలి. స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిదీ.
  • మెట్రోస్టేషన్‌ పరిసరాలకు చేరుకున్న తరవాత మీ ప్రయాణానికి సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో వినిపించే అనౌన్స్‌మెంట్లను జాగ్రత్తగా వినాలి.
  • మీకేదైనా సహాయం కావాలంటే కస్టమర్‌ సర్వీస్‌ బృందం, స్టేషన్‌ సిబ్బందిని సంప్రదించాలి.
  • మెట్రో స్టేషన్‌ లేదా భోగీలో నిషిద్ధ వస్తువులు, పేలుడు పదార్థాలున్నట్లు అనుమా నిస్తే సిబ్బందికి వెంటనే తెలియజేయాలి.
  • స్టేషన్‌లోపలికి వెళ్లే సమయంలో వ్యక్తిగత, బ్యాగేజీ తనిఖీ విషయంలో భద్రతా సిబ్బందికి సహకరించాలి.
  • తోటి ప్రయాణీకులు,మెట్రో సిబ్బంది, స్టేషన్‌ స్టాఫ్‌తో మర్యాదగా ప్రవర్తించండి.
  • మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లపై వెళుతున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
  • మీరు దిగాల్సిన స్టేషన్‌ రాగానే రైలు దిగి వెళ్లిపోవాలి.
  • ఎస్కలేటర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఎడమవైపున మాత్రమే ఉండాలి.
  • భోగీలో హ్యాండ్‌రైల్‌ను పట్టుకొని నిలబడాలి.
  • చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు కూర్చునేందుకు మీ వంతుగా సహకరించాలి.
  • చిన్నారులను తీసుకొచ్చే బేబీ బగ్గీస్, వీల్‌చైర్లలో వచ్చేవారు విధిగా ఎలివేటర్లలో ప్లాట్‌ఫాం మీదకు వెళ్లాలి.
  • ఎస్కలేటర్‌ దిగిన వెంటనే దానికి దూరంగా జరగాలి.
  • టిక్కెట్‌ కౌంటర్, టిక్కెట్‌ విక్రయ యంత్రాలు, ఆటోమేటిక్‌ ఫెయిర్‌ కలెక్షన్‌ గేట్ల వద్ద మీ వంతు వచ్చే వరకు క్యూలైన్‌లో నిలబడాలి.
  • ప్రయాణిస్తున్నప్పడు సిబ్బంది టోకెన్లు, స్మార్ట్‌ కార్డులు చూపమని తనిఖీ చేసినపుడు వారికి సహకరించాలి. టిక్కెట్‌ లేని ప్రయాణీకులపై కఠిన చర్యలు తప్పవు.
  • అత్యవసర అనౌన్స్‌మెంట్‌ వినిపించినపుడు హడావుడిగా రైలు దిగాలి.
  • రైలు ప్లాట్‌ఫాంపై నిలిచిన తరవాతనే భోగీలోనికి ప్రవేశించాలి. రైలు కోసం పరుగెత్తరాదు.
  • రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఉండే సందులో ఎలాంటి వస్తువులు, కాళ్లను పెట్టరాదు.

చేయకూడని పనులివీ..

  • స్టేషన్‌లు, భోగీలు, పరిసరాల్లో ఉమ్మివేయడం, చూయింగ్‌గమ్‌ ఊయడం, సిగరెట్లు తాగడం, పాన్‌ నమలరాదు.
  • రైలులోనికి ప్రవేశించిన తరవాత ఫొటోలు తీయడం నిషిద్ధం.
  • నిషిద్ధ ప్రాంతాల్లో కూర్చోరాదు.
  • రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు తినుబండారాలు, ఆహారం తీసుకోరాదు.
  • మీ పెంపుడు జంతువులను మెట్రో రైళ్లలో తీసుకెళ్లడం నిషేధం..
  • ప్రమాదకర వస్తువులు, అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉన్న వస్తువులను స్టేషన్‌ పరిసరాలు, భోగీల్లోకి తీసుకురావద్దు.
  • ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాటిపై వాలడం, ఎస్కలేటర్ల పనితీరును అడ్డుకోరాదు.
  • ప్లాట్‌ఫాంపై వేచిఉండే సమయంలో పసుపురంగు లైన్‌ను దాటి ముందుకు రావద్దు.
  • మీ చిన్నారులను నిర్లక్ష్యంగా ప్లాట్‌ఫాం, స్టేషన్‌ పరిసరాల్లో విడిచిపెట్టరాదు. 
మరిన్ని వార్తలు