మెట్రో పయనం.. సులభతరం

6 Mar, 2020 08:02 IST|Sakshi
డిజిటల్‌ మెట్రో పేటీఎం క్యూఆర్‌– కోడ్‌ టికెట్‌ విధానాన్ని ఆవిష్కరిస్తున్న ఎన్వీఎస్‌ రెడ్డి, పేటీఎం ప్రతినిధులు

నగదు రహిత ప్రయాణానికి ప్రాధాన్యం

మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి  

పేటీఎం క్యూఆర్‌– కోడ్‌ టికెట్‌ ఆవిష్కరణ

బొల్లారం: నగరానికే తలమానికంగా నిలిచిన హైదరాబాద్‌ మెట్రో రైలులో ప్రయాణం మరింత  సులభతరం కానుంది. మెట్రో ఎక్కాలంటే ఇప్పటి వరకు టికెట్‌ కొనేందుకు కౌంటర్ల వద్ద క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చేది. కానీ మెట్రో ప్రారంభ దశలో ఈ కౌంటర్లలో టికెట్‌ కొనడం సులువుగానే ఉండేది. కొద్ది రోజులుగా ప్రయాణికులు పెరగడంతో.. టికెట్‌ కౌంటర్ల వద్ద ఒక్కొసారి క్యూలైన్లలో బారులుతీరే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మెట్రో అధికారులు ప్రయాణికులు టికెట్‌ కొనేందుకు సులువైన పద్ధతిని ఆవిష్కరించారు. దీంతో పేటీఎంతో ఇక క్యూఆర్‌– కోడ్‌ టికెట్‌ పద్ధతిని అమలు చేయనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం రసూల్‌పురాలోని మెట్రో భవన్‌లో పేటీఎం సంస్థ ప్రతినిధులతో కలిసి డిజిటల్‌ మెట్రో పేటీఎం క్యూఆర్‌– కోడ్‌ టికెట్‌ పద్ధతిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

సమయం వృథా కాకుండా పేటీఎంతో క్యూఆర్‌ కోడ్‌ పద్ధతి ద్వారా ప్రయాణించవచ్చని చెప్పారు. నగదు రహిత ప్రయాణానికి సులువైన మార్గంగా ఉండే పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ పద్ధతిని అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో అందరి చేతిలో మొబైల్స్‌ ఉండడం వల్ల ప్రయాణాన్ని  ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగించవచ్చన్నారు. పేటీఎంకు సంబంధించిన యాప్‌లోకి వెళ్లి ఎక్కాల్సిన స్టేషన్, ప్రయాణంలో దిగాల్సిన స్టేషన్‌ పేర్లను నమోదు చేస్తే టికెట్‌ చార్జి కనిపిస్తుంది. పేమెంట్‌ పూర్తి కాగానే టికెట్‌ యాప్‌లో కనబడటంతోపాటు మొబైల్‌కు మెసేజ్‌ ద్వారా కన్ఫర్మేషన్‌ సమాచారం వస్తుంది. దీంతోపాటు స్టేషన్‌ ఎంట్రీలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి మెట్రో ఎక్కిన తర్వాత గమ్యస్థానానికి సంబంధించిన ఎగ్జిట్‌ గేట్‌ ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌ (ఏఎఫ్‌సీ) దగ్గర క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే పేటీఎం వ్యాలెట్‌ నుంచి టికెట్‌ చార్జి కట్‌ అవుతుంది. వీటిని ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్ల వద్ద ఉన్న స్కాన్‌ చేసి సులభంగా మెట్రోలో రాకపోకలు సాగించవచ్చు.  పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌తో మెట్రోలో ప్రయాణించే వీలుగా దీనిని నూతన విధానంతంఓ రూపొందించినట్లు పేటీఎం వైస్‌ ప్రెసిడెంట్‌ అభయ్‌ శర్మ అన్నారు. మెట్రో ప్రయాణికులు సౌకర్యవంతమైన పద్ధతిలో గమ్యస్థానాలకు చేరుకునే విధంగా పేటీఎం ముందు అడుగులు వేసిందన్నారు. అనంతరం మెట్రో ప్రయాణంలో పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ పద్ధతి ఎలా పనిచేస్తుందో అనే దానిపై రసూల్‌పురా మెట్రో రైల్‌ స్టేషన్‌లో ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్‌ల వద్ద  స్కానింగ్‌ చేసి పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఎల్‌ అండ్‌ టీ ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రో అధికారులతో పాటు పేటీఎం సంస్థ ప్రతినిధులు అంకిత్‌ చౌదరి, అనిల్‌తో సహా పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

ఉపయోగించుకోవడం ఎలా..?
పేటీఎం యాప్‌లో ‘మెట్రో’ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి
మీ నగరాన్ని ఎంచుకోవాలి. రూట్‌ సెర్చ్‌పై క్లిక్‌ చేయాలి  
గమ్య స్థానాన్ని ఎంచుకోవాలి. రూట్స్‌ చూడడానికి సెర్చ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
రూట్‌ను సూచిస్తుంది. ఎంపిక చేసుకున్న స్టేషన్స్‌ మధ్య ప్రయాణ సమయాన్ని కూడా చూపిస్తుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా