ఫ్లెక్సీ బ్రేక్‌

3 Jun, 2019 11:02 IST|Sakshi
ఆదివారం బేగంపేట్‌ – ప్యారడైజ్‌ మార్గంలో మెట్రో ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ తీగలపై పడిన ఫ్లెక్సీ

మెట్రో రైళ్లకు ఫ్లెక్సీల గండం  

తరచూ రాకపోకలకు అంతరాయం  

తాజాగా ప్యారడైజ్‌–బేగంపేట్‌ మార్గంలో..  

20 నిమిషాలు నిలిచిన రైళ్లు  

మెట్రో మార్గాల్లోని హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ తొలగించాలని హెచ్‌ఎంఆర్‌ విన్నపం  

నిర్లక్ష్యధోరణిలో జీహెచ్‌ఎంసీ  

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైళ్లకు ఫ్లెక్సీలు గండంగా మారాయి. తరచూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ఈదురుగాలులు వీచినప్పుడు ఫ్లెక్సీలు ఎగిరిపోయి మెట్రో ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ తీగలపై పడుతుండడంతో రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. ఇందుకు కారణమవుతున్న భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ ఎల్బీనగర్‌–మియాపూర్, నాగోల్‌–హైటెక్‌ సీటీ రూట్లలో ఏకంగా 95 ఉన్నాయి. వీటిని తొలగించాలని హైదరాబాద్‌ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్‌) అధికారులు ఇప్పటికే పలుమార్లు జీహెచ్‌ఎంసీకి విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను తరలించే విషయంలో బల్దియా నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తోంది. తాజాగా ఆదివారం ఈదురు గాలులకు ఓ భారీ ఫ్లెక్సీ ఎగిరొచ్చి ప్యారడైజ్‌ – బేగంపేట్‌ మార్గంలోని మెట్రో ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ తీగలపై పడింది. దీంతో మెట్రో రైళ్లు 20 నిమిషాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ తీగలపై పడుతున్న ఫ్లెక్సీలను తొలగించడం మెట్రో రైలు అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఇవి హైటెన్షన్‌ (25 కేవీ) తీగలు కావడంతో దాదాపు 5 కి.మీ మార్గంలో విద్యుత్‌ సరఫరా నిలిపేయాల్సి వస్తోంది. 20–30 నిమిషాలు శ్రమించి ఫ్లెక్సీలను తొలగించాల్సి వస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తరచూ జరుగుతుండడంతో అటు ప్రయాణికులు, ఇటు అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు.

గతంలోనూ...  
గతంలో తార్నాక, మెట్టుగూడ, అమీర్‌పేట్, బేగంపేట్‌ తదితర ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లకు ఉన్న ఫ్లెక్సీలు చిరిగిపోయి మెట్రో రైలు ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ తీగలపై పడ్డాయి. దీంతో ఆయా మార్గాలపై అధ్యయనం చేసిన మెట్రో రైలు అధికారులు సుమారు 95 భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను గుర్తించారు. వీటిని వేరొ చోటుకు తరలించాలని బల్దియా అధికారులకు విన్నవిస్తూ లేఖలు రాశారు. కానీ జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాటికి స్పందించలేదు. దీంతో తరచూ మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణికుల విలువైన సమయం వృథా అవుతోంది. తక్షణం ఆయా రూట్లలో భారీ హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ను తొలగించాలని ప్రయాణికులు, హెచ్‌ఎంఆర్‌ అధికారులు కోరుతున్నారు. గతంలో మున్సిపల్‌ మంత్రిగా పని చేసిన కేటీఆర్‌ సైతంవీటిని తొలగించాలని బల్దియా యంత్రాంగానికి సూచించినప్పటికీ ఫలితం లేకపోవడంగమనార్హం.

>
మరిన్ని వార్తలు