రెడ్‌ సిగ్నలే!

10 Jul, 2020 09:51 IST|Sakshi

ఈ నెలలోనూ మెట్రో పరుగులు అనుమానమే!!

రూ.200 కోట్లకు చేరుకోనున్న నష్టాలు

రైళ్లు, స్టేషన్ల నిర్వహణ వ్యయం తడిసి మోపెడు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతికి ఎదురుచూపులు

పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ప్రజారవాణా వ్యవస్థపై అలుముకున్న నీలినీడలు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు జూలై నెలలోనూ పట్టాలెక్కుతాయా..? లేదా..? అనే  అంశం సంశయంగా మారింది. కోవిడ్‌ విసిరిన పంజాకు ఈ ఏడాది మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో మెట్రోకు నష్టాలు తప్పడంలేదు. రైళ్లు, స్టేషన్ల నిర్వహణ వ్యయం తడిసిమోపెడవుతుండడంతో ప్రతి నెలా రూ.50 కోట్ల మేర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. మొత్తంగా ఈ నెలాఖరుకు నష్టాలు రూ.200 కోట్లకు చేరుకుంటాయని అంచనా.  మహానగరంలో నాగోల్‌– రాయదుర్గం, జేబీఎస్‌– ఎంజీబీఎస్, జేబీఎస్‌– ఎంజీబీఎస్‌ మూడు మార్గాల్లో 69 కి.మీ మార్గంలో మెట్రో అందుబాటులో ఉన్న విషయం విదితమే. రోజురోజుకూ కోవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాతే మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలను తిరిగి ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అదుపు లేకుండా పెరుగుతున్న  కోవిడ్‌ కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో ఈ నెలలో ప్రభుత్వం అనుమతులిచ్చే ప్రసక్తి ఉండదని మెట్రో వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు ఆర్టీసీ బస్సులు, మరోవైపు మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో గ్రేటర్‌లో ప్రజారవాణా వ్యవస్థ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.(మెట్రో ఇప్పట్లో లేనట్టే!)

నష్టాల బాటలో..
లాక్‌డౌన్‌కు ముందు మూడు మెట్రో మార్గాల్లో నిత్యం 4 లక్షల నుంచి 4.5 లక్షల మంది జర్నీ చేసేవారు. అప్పట్లో లాభం, నష్టంలేని స్థితికి చేరుకుంటున్న తరుణంలోనే కోవిడ్‌ పంజా విసరడంతో మెట్రోకు బ్రేకులు పడ్డాయి. మార్చి 22 నుంచి మెట్రో రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు నిర్మాణ సంస్థకు భారంగా పరిణమించాయి. జరిగిన నష్టాన్ని చెల్లించాల్సిందిగా ఈ సంస్థ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. సాధారణంగా మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం 45 శాతం మాత్రమే. మరో 50 శాతం వాణిజ్య స్థలాలు, రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా నిర్మాణ సంస్థ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మరో 5 శాతాన్ని వ్యాపార, వాణిజ్య ప్రకటనల ద్వారా సమకూర్చుకోవాలని నిర్మాణ ఒప్పందంలో పేర్కొన్నారు. గత మూడున్నర నెలలుగా వాణిజ్య స్థలాల అద్దెలు, వాణిజ్య ప్రకటనల ఆదాయం సైతం అరకొరగా లభిస్తుండడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.

గ్రీన్‌సిగ్నల్‌ కోసం ఎదురుచూపులు..
మెట్రో స్టేషన్లు, ప్రయాణికులు వినియోగించే కామన్‌ ప్రాంతాలు, రైలు బోగీలను కోవిడ్‌– 19 నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేసి వినియోగంలోకి తీసుకొస్తామని, ప్రయాణికుల మధ్య విధిగా భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని మెట్రో వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాయి. స్టేషన్‌లోనికి ప్రవేశించే సమయంలో ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ సైతం నిర్వహిస్తామన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తాయా అని మెట్రో వర్గాలు ఎదురుచూస్తున్నాయి. 

మరిన్ని వార్తలు