ఈ నగరం ‘వృద్ధాప్య’ నరకం!

9 Oct, 2017 02:41 IST|Sakshi

మలిసంధ్యలో పుట్టెడు కష్టాలు పడుతున్న వృద్ధులు

కన్నవారి ఆదరణకు దూరమై దుర్భర జీవితం

ఆప్యాయత, అనురాగాలకు నోచుకోలేక మానసిక వ్యథ

స్తోమత ఉన్న కొందరు వృద్ధాశ్రమాల్లో.. రోడ్లపై అనాథలుగా మరెందరో..

సంపాదన, కెరీర్‌ వెంట పడి తల్లిదండ్రులను దూరం పెడుతున్న పిల్లలు

ఢిల్లీలో మాదిరి ‘సీనియర్‌ సిటిజన్స్‌ సెల్‌’ ఏర్పాటు చేయాలని విన్నపాలు

2011 జనాభా లెక్కల ప్రకారం నగరంలో 60 ఏళ్లపైబడినవారి సంఖ్య    6.5 లక్షలు

2026 నాటికల్లా నగరంలో వృద్ధుల సంఖ్య 12 లక్షలు

సాక్షి, హైదరాబాద్‌
భాగ్యనగరంలోని నాగోల్‌ ప్రాంతం.. ఓ భారీ అపార్ట్‌మెంట్‌.. అందులోని ఓ ఫ్లాట్‌లో వృద్ధుడు.. పేరు మూర్తి... వయసు 70 ఏళ్లు.. భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు.. అమెరికాలో! మూర్తి ఓ రోజు స్నానానికి వెళ్తూ ప్రమాదవ శాత్తూ హాల్లో కిందపడిపోయాడు.. తలకు బలమైన గాయమైంది.. ‘నా’అన్నవాళ్లెవరూ చెంతలే రు.. రక్తపుమడుగులోనే గిలగిల్లాడుతూ ప్రాణాలు వదిలాడు!! పక్క ఫ్లాట్‌వారికి, ఇరుగుపొరుగువారికి ఈ విషయం తెలియదు.. రోజు గడిచింది.. రెండ్రోజులైంది.. పక్షమైంది.. నెల రోజులయ్యాయి.. ఎంతకీ ఫోన్‌ ఎత్తక పోవడంతో అనుమానం వచ్చి భార్య, ఇద్దరు కూతుళ్లు అమెరికా నుంచి వచ్చి బలవంతంగా తలుపు తెరిచి చూసి ఒక్కసారిగా బోరుమన్నారు.

రాష్ట్ర రాజధానిలో ఇటీవల వెలుగుచూసిన ఈ హృదయ విదారక ఉదంతం నగరంలో వృద్ధుల దైన్యస్థితికి పరాకాష్టగా నిలిచింది! ఇదొక్కటే కాదు.. నగరంలో అడపాదడపా ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో  కొందరు.. కన్నవారికి ‘భారమై’ఇంకొందరు.. చీత్కరింపులకు దూరంగా బతుకుదామని మరికొందరు.. ‘చిన్న’కుటుంబంలో చోటుదక్కక ఎందరో.. కారణాలేవైతేనేం.. రెక్కలు తెగిన పక్షుల్లా ఒంటరిగా  మిగిలిపోయి బతుకులీడుస్తున్న ఈ పండుటాకుల కన్నీటి గాథను, మానసిక వ్యథను, అంతకుమించి వారి యోగక్షేమాలు, భద్రతను పట్టించుకునేనాథుడే కరువయ్యాడు!

2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో 80 లక్షల జనాభా ఉంటే.. అందులో సుమారు 6.5 లక్షల మంది 60 ఏళ్లపైబడినవారేనని తేలింది. ఇక 2026 నాటికల్లా నగర జనాభా రెట్టింపై వయోవృద్ధుల  సంఖ్య కూడా 12 లక్షలకు చేరుకోనున్నట్టు ఓ అంచనా. ఇదే స్థాయిలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ వారి సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఈ నేపథ్యంలో లక్షలాది వృద్ధుల జీవితాల్లో అలుముకున్న చీకట్లను పారదోలే విషయంలో కుట ుంబ సభ్యులతోపాటు అటు ప్రభుత్వం, పౌరసమాజం ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

జగమంత కుటుంబం.. ఏకాకి జీవితం
భాగ్యనగరంలో వృద్ధుల బతుకులు ‘జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది’అన్న చందంగా ఉన్నాయి. మలిసంధ్యలో ఆదరించేవారు లేక అనాథలుగా మారుతున్నారు. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు బతుకుదె రువు కోసం విదేశాలు, సుదూర ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో వృద్ధాశ్రమాలకు చేరుతున్నారు. ఇలాంటి ఆశ్రమాలు నగరంలో వందలాదిగా ఉన్నాయి. ఏటా వాటి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జీవనభృతికి అయ్యే  ఖర్చులు చెల్లించే స్తోమత ఉన్నవారు వృద్ధాశ్రమాల్లో తలదాచుకుంటుండగా.. వేలాది మంది ఆలనాపాలనా లేక రోడ్లపై బతుకులీడుస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలుగా మారుతుండడం, కన  ్నవారు విద్య, ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలు, దూర ప్రాంతాలకు వెళ్తుండటం, మారుతున్న సామాజిక పరిస్థితులు.. ఇవన్నీ పిల్లలు–తల్లిదండ్రుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు.. ఉద్యోగాలు, సంపా దన పేరుతో నిత్యం కాలం వెంట పరుగులు తీయడంతో వృద్ధులు ప్రేమ, ఆప్యాయత, పలకరింపులకు నోచుకోలేక మానసికంగా> కుంగిపోతున్నారు.

పెద్దవారిపై ‘చిన్న’చూపు..
ఇంటా, బయట తమను చిన్నచూపు చూస్తున్నారని దేశవ్యాప్తంగా వయోజనులు ఆవేదన వ్యక్తం చేశారు. హెల్ప్‌ ఏజ్‌ ఇండియా అనే సంస్థ హైదరాబాద్‌ సహా దేశంలోని 19 నగరాలు, పట్టణాల్లో ఇటీవల నిర్వహించిన ఈ విషయం తేలింది. ఇలా వృద్ధులను చిన్న చూపు చూసే నగరాల్లో హైదరాబాద్‌ తొలి స్థానంలో నిలిచింది. చీత్కారాలు ఎదుర్కొంటున్నామని, తమను చిన్నచూపు చూస్తున్నారని నగరంలో దాదాపు 90 శాతం మంది వృద్ధులు తెలిపారు. ఆ తర్వాత స్థానాల్లో కోల్‌కతా(78%), షిల్లాంగ్‌(61%), బెంగళూర ు(60%) ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లిన సమయంలో అక్కడి సిబ్బంది కసురుకుంటున్నారని, రోడ్లపై వెళ్తుంటే వాహనదారులు అవమానపరిచేలా ప్రవర్తిస్తున్నారని వృద్ధులు సర్వేలో తెలిపారు.

రక్షణ ఏది?
హైదరాబాద్‌లో ఒంటరిగా ఉంటున్న వృద్ధులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఎవరూ లేరన్న ఉద్దేశంతో దుండగులు వారి ఇళ్లపై దాడులు చేసి అందినకాడికి దోచుకుపోతున్నారు. ప్రతిఘటిస్తే ప్రాణాలు తీసేందుకు వెనకాడడం లేదు.  పంజగుట్ట ఠాణా పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటున్న కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు పెద్దమ్మ సుశీలాదేవి ఇలాగే గతంలో దారుణ హత్యకు గురయ్యారు. వనస్థలిపురం, ఫీర్జాదిగూడ, ఈస్ట్‌మారేడ్‌పల్లి, కూకట్‌పల్లి, వ ¬షీరాబాద్, బేగంపేట ఇలా.. అనేక ప్రాంతాల్లో వృద్ధులపై దాడులు చేసి దుండగులు దోపిడీలకు పాల్పడ్డారు.

ఢిల్లీ విధానం భేష్‌..
హైదరాబాద్‌లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల భద్రత, వారి యోగక్షేమాలు చూసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏవీ లేవు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు ముందున్నారు. అక్కడ వృద్ధులకు భరోసా ఇచ్చేందుకు సీనియర్‌ సిటిజన్స్‌ సెల్‌  ఏర్పాటు చేశారు. ఇలాంటి సెల్‌ను హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయాలని గతంలో భావించినా అడుగు ముందుకు పడలేదు. ఢిలీలో ఏర్పాటు చేసిన సీనియర్‌ సిటిజన్స్‌ సెల్‌ మంచి ఫలితాలు సాధిస్తోంది. ఒంటరి వృద్ధులు, వారి వివరాలు, చిరునామాను ఈ  సెల్‌లో నమోదు చేశారు. ఒకవేళ కుటుంబీకులు ఉద్యోగాలకు వెళ్తే పగటిపూట ఒంటరిగా ఉండేవారి వివరాలు కూడా రిజిస్టర్‌ చేశారు.

రెండేళ్లల్లో 19,716 మంది వృద్ధుల వివరాలు నమోదు చేసి వారిలో 12,812 మందికి ప్రత్యేక  గుర్తింపు కార్డులిచ్చారు. ఆ కార్డుల్లో వారి చిరునామా, బ్లడ్‌ గ్రూపు, వారి అనారోగ్య వివరాలు, డాక్టర్‌ పేరు, సంప్రదించాల్సిన నంబరు, అత్యవసర సమయాల్లో ఎవరికి సమాచారం ఇవ్వాలనే వివరాలను పొందుపరిచారు. పోలీసులు  సెక్యూరిటీ ఆడిట్‌ పేరుతో నిత్యం వారి ఇళ్లకు వెళ్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. దీంతో వృద్ధులకు భరోసా లభించడంతో పాటు వారిపై నేరాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. హైదరాబాద్‌లో కూడా ఇలాంటి విధానం అనుసరిం చాలని పలువురు కోరుతున్నారు.

ఆదరణ లేక ఆశ్రమంలో చేరా..: గౌరమ్మ
పనిచేస్తున్న సమయంలో కన్నవాళ్లకు ఉన్నదంతా ఊడ్చిపెట్టా. వయసు మీద పడ్డది. అయిన వారు కాదన్నారు. ఆదరణ కరువైంది. ఆశ్రమంలో చేరా. కృష్ణా, రామ అంటూ దేవుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నా.


వారి బతుకు వారు బతుకుతున్నారు: వెంకట నర్సమ్మ
నా భర్త లేడు. ఇద్దరు కొడుకులను చదివించేందుకు ఆస్తి అంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయి. వారి బతుకు వారు బతుకుతున్నారు. ముసలితనం మీద పడ్డది. ఏ పనీ చేసుకోలేను. గత్యం తరం లేక ఆశ్రమంలో చేరా.  

ఇళ్లు ఇరుకుగా ఉందని ఆశ్రమంలో చేర్పించాడు: రాజారెడ్డి
నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఇళ్లు ఇరుకుగా ఉందని హయత్‌నగర్‌లోని ఓ వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఇక్కడ ప్రశాంతంగా ఉంది.

 


పిల్లల మనస్సు ఎక్కడ గాయపడుతుందోనని...
మాది అనంతపురం. నా భర్త రైల్వేలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆయన పోయాక ఇక్కడి వృద్ధాశ్రమంలో ఉంటున్నాను. మాకు ఒక కొడుకు. ఒక బిడ్డ. ఉద్యోగాలు చేస్తున్నారు. మా తరానికి, ఈ తరానికి మధ్య భావాల్లో కొంత వ్యత్యాసం  ఉందనిపించింది. పిల్లల మనసు గాయపర్చడం ఇష్టం లేక స్వతంత్రంగా ఉందామనిపించింది. నేను ఎక్కడ ఉన్నా పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను.
– రాధ, అనంతపురం.
హైదరాబాద్‌లో వృద్ధుల జనాభా: 6.5 లక్షలు
గ్రేటర్‌ పరిధిలోని వృద్ధాశ్రమాలు: 300
తెలంగాణ, ఏపీలో వృద్ధాశ్రమాలు: 600

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా