సొంత బండే సో బెటరు

6 Jun, 2020 08:55 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సగటు జీవికి లాక్‌డౌన్‌ అనేక పాఠాలను నేర్పించింది. ఇల్లుకదలకుండా చేయడమే కాదు..నిబంధనలను సడలించిన తర్వాత కూడా బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా చేసింది. లాక్‌డౌన్‌ సడలింపులతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయి. వర్తక వాణిజ్యాలు ఊపందుకున్నాయి. కానీ స్తంభించినప్రజారవాణా కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. సిటీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్‌ సర్వీసులు ఇప్పట్లో తిరిగి పట్టాలెక్కేఅవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు బస్సుల్లో, రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో సిటీజనులు సొంత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, మధ్యతరగతికి చెందిన వర్గాలు లాక్‌డౌన్‌ సడలింపులతో ఆటోమొబైల్‌ షోరూమ్‌ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా వాహనాల అమ్మకాలు పెరిగాయి.ప్రత్యేకించి ద్విచక్రవాహనాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనూ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి.

గ్రేటర్‌లో సుమారు 10 వేల  కొత్త వాహనాలు..
వాహనాల అమ్మకాలు బాగా తగ్గిపోయి ఆటోమొబైల్‌ రంగంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో  లాక్‌డౌన్‌ పిడుగుపాటుగా మారింది. దీంతో మార్చి 22 నుంచి మే రెండో వారం వరకు అన్ని రకాల వాహనాల అమ్మకాలు నిలిచిపోయాయి. షోరూమ్‌లు మూసివేశారు. ప్రభుత్వం దశలవారీగా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించింది. మొదట రవాణాశాఖ కార్యకలాపాలకు అనుమతినిచ్చారు. ఆ తరువాత  ఆటోమొబైల్‌ షోరూమ్‌లు తెరిచేందుకు అవకాశం ఇవ్వడంతో మే నెల 16వ తేదీ తర్వాత తిరిగి అమ్మకాలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న సగటు వేతన జీవులు సొంత వాహనాల వైపే మొగ్గుచూపారు. ‘లాక్‌డౌన్‌కు ముందు సొంత వాహనం కంటే సిటీ బస్సుల్లోనో, మెట్రో రైళ్లలోనో  ప్రయాణం చేసి ఖర్చు తగ్గించుకోవాలనుకున్న వారు ఇప్పుడు అప్పు చేసైనా సరే సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణం భారంగా మారడం కూడా ఇందుకు కారణం.’

అని తెలంగాణ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాంకోటేశ్వర్‌రావు  అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించిన అనంతరం వాహనాల అమ్మకాలు 25 నుంచి 30 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఇందులో టూవీలర్స్‌ అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. రవాణాశాఖ లెక్క ల ప్రకారం గత నెల 16 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో  11,570 వాహనాలు తాత్కాలికంగా నమోదు కాగా, వాటిలో సుమారు 10 వేల వరకు ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు చాలామంది బైక్‌లు కొనుగోలుకు ముందుకు రావడం గమనార్హం. లాక్‌డౌన్‌ సడలింపులతో బ్యాంకుల నుంచి తేలిగ్గా రుణాలు లభించడం, ప్రజారవాణా పట్టాలు ఎక్కకపోవడమే  ఇందుకు ప్రధాన కారణమని రవాణా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రజారవాణా వాహనాలను వినియోగించడం వల్ల కరోనా వ్యాప్తి చెందవచ్చనే ఆందోళన కూడా కారణమే. దీంతో చాలామంది ఆటోలు, క్యాబ్‌లను వినియోగించేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారు.

ఆర్టీఏ  కేంద్రాల్లో పెరిగిన స్లాట్లు..
కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వాహనాల రిజిస్ట్రేషన్లు, లెర్నింగ్‌ లైసెన్సులు, డ్రైవింగ్‌ లైసెన్సులు వంటి వివిధ రకాల పౌరసేవల కోసం పరిమితంగా స్లాట్లు అందుబాటులోకి తెచ్చిన రవాణాశాఖ కొద్ది రోజులుగా వీటి సంఖ్యను పెంచింది. గతంలో ఒక్కో కార్యాలయంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం 30 నుంచి 50 స్లాట్‌లు మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌ మేరకు 80 నుంచి 100 స్లాట్‌ల వరకు పెంచారు. వాహన వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు స్లాట్‌లను అంచనా వేస్తూ పెంచుతున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో రోజుకు 1000 వాహనాల వరకు నమోదు చేసే అవకాశం ఏర్పడింది. మరోవైపు ఆన్‌లైన్‌లోనే అన్ని రకాల అనుమతులను పొందే సదుపాయాన్ని కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు రవాణాశాఖ చర్యలు చేపట్టింది. 

మరిన్ని వార్తలు