జర్నీకి ఝలక్‌ !

27 Jun, 2020 10:38 IST|Sakshi

వెంటాడుతున్న కరోనా వైరస్‌ భయం

50 శాతం మించని ప్రయాణికుల సంఖ్య  

బస్సులు, రైళ్లలో రద్దీ అంతంత మాత్రమే  

రోజుకు 18 రైళ్లు, 1000 ఆర్టీసీ సర్వీసులు  

ఒక్కో బస్సులో సగం సీట్లూ నిండని వైనం

రైళ్లలోనూ గణనీయంగా తగ్గిన ప్రయాణికులు   

తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రయాణానికి సిద్ధం

సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా హైదరాబాద్‌ నుంచి  ప్రతి రోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.పండగలు, వరుస సెలవులు తదితర ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి బయలుదేరే రైళ్లు, బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తారు. రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు వందల్లో దర్శనమిస్తుంది. ఇక పండగ రోజుల్లోనైతే రైలు ప్రయాణం అసాధ్యం. ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు ప్రతి రోజు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి. ప్రస్తుతం కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. సాధారణ రోజుల్లో లక్షలాది మంది ప్రయాణికుల రాకపోకలు  సాగిస్తుండగా ప్రస్తుతం 50 శాతం కంటేమించి ప్రయాణాలు చేయడం లేదని ఆర్టీసీ, రైల్వే వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

కరోనా కట్టడి కోసంహైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిçన విషయం తెలిసిందే. గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా  తెలంగాణలోనిఅన్ని  ప్రాంతాలకునగరం నుంచి ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిని వినియోగించుకునేవారి సంఖ్య మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లు  అందుబాటులోకి వచ్చి నెల రోజులు దాటినా ప్రయాణికుల సంఖ్య మాత్రం  తక్కువగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి వివిధ  ప్రాంతాలకు 18  ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా ఆగస్ట్‌ 12 వరకు సాధారణ రైళ్ల రాకపోకలను నిలిపివేయనున్నట్లు రైల్వేశాఖ తాజాగా ప్రకటించడం గమనార్హం. కరోనా ఉద్ధృతి దృష్ట్యానే రైళ్ల రాకపోకలపై నియంత్రణ కొనసాగుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. (భారత్‌లో 5లక్షలు దాటిన కరోనా కేసులు)

అప్పుడు అలా..
సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి నిత్యం సుమారు 80 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు మరో వందకు పైగా  ప్యాసింజర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఒక్క సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచే 1.85 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. మరో లక్ష మంది ప్రయాణికులు కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరుతారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో ప్రతి రోజు 1.5 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్‌ సర్వీసులతో పాటు అన్ని రైళ్లు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు, ముఖ్యంగా వివిధ అవసరాల దృష్ట్యా నగరానికి వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాలకు సైతం రాకపొకలు స్తంభించాయి. దీంతో ఉద్యోగ, వ్యాపార వర్గాలు.. ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్‌ నిపుణులు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. వేసవి సెలవుల దృష్ట్యా బంధువుల ఇళ్లకు చుట్టపు చూపుగా వచ్చిన వారు సైతం ఇక్కడే ఉండిపోయారు. 

ఇప్పుడు ఇలా..
లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం ద.మ రైల్వే 18 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. మొదట్లో బెంగళూరు– న్యూఢిల్లీ, సికింద్రాబాద్‌–న్యూఢిల్లీ మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత బెంగళూరు– సికింద్రాబాద్, ముంబై– సికింద్రాబాద్, హైదరాబాద్‌– న్యూఢిల్లీ,  తిరుపతి– ఆదిలాబాద్, సికింద్రాబాద్‌–  గుంటూరు, సికింద్రాబాద్‌– విశాఖ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 18 ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ప్రతిరోజు 1.85 లక్షల మంది ప్రయాణికులు ఒక్క సికింద్రాబాద్‌ నుంచే రాకపోకలు సాగించగా ప్రస్తుతం కేవలం 25 వేల మంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. ‘ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి రైళ్లు అందుబాటులో లేకపోవడం ఒక్కటే కారణంగా భావించలేం. కోవిడ్‌ కారణంగా చాలా మంది రాకపోకలు సాగించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం బెర్తుల సామర్థ్యం మేరకు మాత్రం  ప్రయాణికులు బయలుదేరుతున్నారు. సాధారణ రద్దీలో ఇది 50 శాతం మాత్రమే. ప్రయాణికుల రాకపోకలు సాధారణ స్థితికి రావడానికి మరి కొంత సమయం పట్టవచ్చు’ అని ద.మ రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

బస్సుల్లోనూ అంతే..
ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికులు ఆచితూచి రాకపోకలు సాగిస్తున్నారు. తప్పనిసరైతేనే ఇళ్లల్లోంచి బయటకు వస్తున్నారు. సాధారణంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచే ప్రతిరోజు 3,500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు అంతర్రాష్ట బస్సు సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో సుమారు 1000 బస్సులు మాత్రం తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకపోకలు సాగిస్తున్నాయి. బస్సుల్లోనూ ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ‘ఒక్కో బస్సులో సగం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. కరోనా కారణంగా  ప్రజలు తమ ప్రయాణాలను చాలా వరకు వాయిదా వేసుకున్నారు. బహుశా ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య పెరగవచ్చు’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు