నయాసాల్‌ జోష్‌

1 Jan, 2020 09:12 IST|Sakshi
బంజార్‌హిల్స్‌ రాక్‌ క్యాజిల్‌లో...

నగరంలో హోరెత్తిన న్యూ ఇయర్‌ వేడుకలు

పబ్‌లు,ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో మ్యూజికల్‌ నైట్‌

నెక్లెస్‌రోడ్డులో కేక్‌కట్‌ చేసి కేరింతలు కొట్టిన కుర్రకారు

నగరంలో సుమారు 200కు పైగా ప్రత్యేక కార్యక్రమాలు

సాక్షి, సిటీబ్యూరో/నెట్‌వర్క్‌: న్యూ ఇయర్‌ జోష్‌తో సిటీ హోరెత్తింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు నగరమంతటా కొత్త సంవత్సరం సందడి కన్పించింది. యువతీ యువకులు ట్యాంకుబండ్, నెక్లెస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో కేక్‌ కట్‌ చేసి కేరింతలు కొట్టారు. సరిగ్గా సమయం అర్ధరాత్రి 12 గంటలు కాగానే ఒక్కసారిగా హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నగరంలో అనేక చోట్ల మ్యూజికల్‌ నైట్స్‌ నిర్వహించారు. డ్యాన్స్‌లు, డీజేలతో సిటీ హోరెత్తింది. జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సంగీతదర్శకుడు తమన్‌ తన సంగీతంతో కొత్త సంవత్సర వేడుకలకు  జోష్‌నిచ్చాడు. బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజారా, రోడ్‌నెంబర్‌ 14లోని రివోట్‌ పబ్, జూబ్లీహిల్స్‌లోని 800 పబ్‌లతో పాటు  అన్ని స్టార్‌హోటళ్లలోనూ కొత్త సంవత్సర వేడుకల సందడి నెలకొంది. గచ్చిబౌలి, హైటెక్‌సిటీలలో సంబరాలు అంబరాన్నంటాయి. ఐటీ కారిడార్‌లలో న్యూఇయర్‌ జోష్‌ యూత్‌ను ఓలలాడించింది. కొన్నిచోట్ల సినీతారలు కూడా వేడుకల్లో పాలుపంచుకుని అభిమానులను అలరించారు. మరోవైపు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్ని ప్రధానఆలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వీట్‌షాపులు, బేకరీలు కొనుగోళ్లతో కళకళలాడాయి. బిర్యానీ, మద్యం అమ్మకాలు సైతం భారీగా జరిగాయి.

ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు...
నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం భక్తులు సందర్శించుకొనేందుకు అనుగుణంగా పలు ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బిర్లా టెంపుల్, దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయం, సికింద్రాబాద్‌ మహాంకాళి ఆలయం, గణేష్‌ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్, పద్మారావునగర్‌ స్కందగిరి టెంపుల్, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి, తదితర ఆలయాలను అందంగా అలంకరించారు. కాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం జూబ్లీహిల్స్‌ శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు తెరిచివుంటుందని ఆలయవర్గాలు తెలిపాయి. దిల్‌సుఖ్‌నగర్‌ శ్రీషిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. సీతాఫల్‌మండి నామాలగుండు కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం 11 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత వెంకన్నస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్‌ నోముల ప్రకాశరావు తెలిపారు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఉదయం 5 గంటలకు ప్రత్యేక అభిషేకాలు చేయనున్నారు. 6గంటల నుంచి 6.30గంటలకు విశేష అలంకారం ఉంటుంది.  6.30 గంటలకు సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిఇస్తారు. సికింద్రాబాద్‌ గణపతి దేవాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ఉదయం 5.30 గంటలకు స్వామివారికి అభిషేకాలు నిర్వహించనున్నారు. అనంతరం అర్చనలు, 8.30 గంటలకు గణపతి హోమం నిర్వహిస్తారు. 

మరిన్ని వార్తలు