ఇండోర్‌.. నో బోర్‌..

30 Mar, 2020 08:10 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో :కరోనా కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ప్రతి ఒక్కరూఇంటికే పరిమితమయ్యారు. హాయ్‌.. మీరేం చేస్తున్నారని ‘సాక్షి’ పలకరించినప్పడు పలు ఆసక్తికరమైన అంశాలు వివరించారు. హోమ్‌ మేడ్‌.. ఫుడ్‌ హౌస్‌ఫుల్‌ టైమ్‌ అన్నట్టుగా ఉంది. సాధారణంగా చాలా ఇళ్లకు తాళాలు దర్శనమిస్తాయి. అలాంటిది ఇప్పుడు ఇళ్లన్నీ 24 గంటల పాటు సందడిగా తయారయ్యాయి. వంటలు, హౌస్‌ కీపింగ్‌ చేసే మగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లలతో కలిసి ఆటలాడుతున్న పెద్దవాళ్లు.. ఇలాంటి అరుదైన అపురూప దృశ్యాలూ ఆవిష్కృతం అవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు పిల్లలు తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. ఇంటికి పరిమితం కావడానికి కారణమైన కరోనాపై బొమ్మలు గీసే పనిలో పడ్డారు. మరి కొందరు ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్, ఇండోర్‌ గేమ్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఇంకొందరు భగవద్గీత పారాయణం చేస్తూ.. పలువురికి స్ఫూర్తిని నింపుతున్నారు.   

సేవ్‌ ఎర్త్‌ ఫ్రమ్‌ కరోనా వైరస్‌..
ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ నుంచి భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తే నాకు అలా అనిపించింది. అందుకే అదే విషయాన్ని బొమ్మ ద్వారా చెప్పాలనిపించింది. కాలుష్యం కారణంగానే అంటు వ్యాధులు ప్రబలుతున్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకే సేవ్‌ ఎర్త్‌ ఫ్రమ్‌ కరోనా వైరస్‌ అని బొమ్మ వేశా.  – డి.శ్రేయశ్రీ, 4వ తరగతి, కె.వి. స్కూల్, ఉప్పల్‌.

ఇలా కరోనా వెకేషన్‌..
మా ఇంట్లో కరోనా వెకేషన్‌ స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుంది. ఇంట్లో ఖాళీ ఉండే బదులు పది మందికి ఉపయోగపడే వాటిని తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. దాంతో ఓల్డ్‌ ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను తీసుకుని.. వాటిని ఫ్లవర్‌వాజ్‌లుగా తయారు చేసే పని పెట్టుకున్నాం. ఫ్లవర్స్‌ను రంగు రంగుల్లో అమర్చుతున్నాం. లాక్‌ డౌన్‌తో ఇంటికి పరిమితమై కుటుంబసభ్యులంతా కలిసి ఇలా ఫ్లవర్లను తయారు చేసే పనిలో పడ్డాం. – ఎ. రామాంజనేయులు, కాచిగూడ.

భగవద్గీత పారాయణంలో..
లాక్‌డౌన్‌ పిరియడ్‌లో పిల్లలు కేవలం ఆటపాటలకే పరిమితం కాకుండా ఇలా పారాయణం చేస్తే.. మన సంస్కృతి సంప్రదాయల విలువలు తెలుసుకుంటారు. సహజంగా స్కూళ్లకు హాలీడేస్‌ వచ్చాయంటే చాలు ఇండోర్, అవుట్‌ గేమ్స్‌తో పాటుగా ఆన్‌లైన్‌ గేమ్స్‌తో కాలక్షేపం చేస్తారు. ఆ పరిస్థితుల నుంచి పిల్లలకు భారతీయ సంప్రదాయాలు అలవడే విధంగా ఈ ఖాళీ రోజుల్లో భగవద్గీత పారాయణం చేయిస్తున్నాం. ఈ విషయంలో చిన్నారులు కూడా ఆసక్తిని చూపుతున్నారు.      – రామకృష్ణ, బజరంగ్‌దళ్‌ కార్యకర్త, మణికొండ

పదేళ్ల తర్వాత విశ్రాంతి

దాదాపు పదేళ్ల తర్వాత కాస్తా విశ్రాంతి లభించినట్టయ్యింది. అందులోనూ పిల్లలతో సరదాగా గడిపేందుకు సమయం దొరికింది. దాంతో మా పిల్లలతో కలిసి క్యారమ్స్‌ ఆడుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నాం. కరోనా వైరస్‌  ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అందరూ ఇంట్లో ఉండి ప్రాణాంతకమైన ఈ వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని నా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తా. అందరూ సంతోషంగా ఉండాలి.– వంశీధర్, పోలీస్‌ డిపార్టుమెంట్,ఎల్‌బీనగర్‌.

క్వారంటైన్‌.. క్వాలిటీ టైమ్‌..
వీకెండ్‌ అంటేనే రెండ్రోజులు సెలవని ఎక్కడా లేని బద్ధకం వచ్చేస్తుంది. అలాంటిదిలాక్‌డౌన్‌.. అంటే పూర్తిగాఇంట్లోనే కూర్చోవాలి అంటే.. అయితే పనిరోజుల్లో మాత్రమే కాదు లాక్‌డౌన్‌ టైమ్‌లో కూడా టైమ్‌ టేబుల్‌ వేసుకుని మరీ గడిపే వారున్నారు. బద్ధకం రావడం ఈజీయే కానీ మళ్లీ కదలడం అంత సులభం కాదు.. ఈ నేపథ్యంలో నగరవాసి లగ్గాని శ్రీనివాస్‌లాక్‌డౌన్‌ టైమ్‌ని ప్రణాళికాబద్ధంగా గడుపుతున్నవిశేషాలు

చెబుతున్నారిలా..
ఉదయం 6.30గంటలకు నిద్రలేవడం, ఫ్రెష్‌ అవడం, ఇంపార్టెంట్‌ మెసేజెస్‌ చెక్‌ చేసుకోవడం, యోగా, ట్రెడ్‌ మిల్‌ వగైరా వ్యాయామాలతో 8గంటల వరకు గడిపి స్నానం చేయడం, 8.30 గంటలకు బ్రేక్‌ఫాస్ట్, 9గంటలకు ఆ రోజు చేయాల్సిన పనుల రివ్యూ, 9.30 గంటల నుంచి 12 గంటల దాకా వర్చువల్‌ ఆఫీస్‌ వర్క్, ఆ తర్వాత కాసేపు బ్రేక్‌ ఇచ్చి టీ, ఫ్రూట్స్‌ తీసుకోవడం, వార్తలు చదవడం..
మధ్యాహ్నం 12.30గంటలకు బిజినెస్‌ కాల్స్‌ అటెండ్, 1.30 గంటలకు లంచ్‌ 2.30 గంటలకు పిల్లలు, టీమ్‌ మెంబర్స్‌కి గైడ్‌ చేయడం, 3గంటలకు బిజినెస్‌ కాల్స్, 5.30గంటలకు తాజా గాలిని పీల్చుకోవడానికి బాల్కనీలోకి రావడం.. రాత్రి 6గంటలకు ఫ్యామిలీతో కాసేపు స్పెండ్‌ చేయడం, స్నాక్స్‌ తినడం, పిల్లల చదువు, ఫ్రెండ్స్‌తో ఫోన్‌ ముచ్చట్లు, 8గంటలకు స్నానం, 8.30 గంటలకు డిన్నర్, 9గంటలకు తాజా వార్తలను తెలుసుకోవడం, 10గంటలకు పుస్తకం చదవడం, 10.30గంటలకు నిద్రకు ఉపక్రమించడం.

మరిన్ని వార్తలు