కాలు ఆగట్లే!

1 Apr, 2020 08:01 IST|Sakshi
రామ్‌నగర్‌–విద్యానగర్‌ రోడ్డులో కారణం లేకుండా బయటకు వచ్చిన యువకుడికి పోలీసుల శిక్ష ఇలా..

లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోని సిటీజనులు

విచ్చలవిడిగా రోడ్లపైకి జనం

గత నాలుగు రోజులుగా మరీ ఎక్కువగా బయటకు..

నిత్యావసరాలు,మాంసం కోసమంటూ పోలీసులకు సమాధానాలు

మరికొందరు కారణం లేకుండానే రోడ్లపై ఇష్టారీతిన చక్కర్లు

పోలీసులు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటేనే మార్పు  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వ విభాగాలు అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ నిబంధనల్ని జనం తుంగలో తొక్కుతున్నారు. గత నాలుగు రోజులుగా (శని, ఆది, సోమ, మంగళవారాల్లో) ప్రజలు విచ్చలవిడిగా బైక్‌లు, కార్లు, ఆటోలు పట్టుకొని రోడ్ల మీదికెక్కుతున్నారు. శనివారం నిత్యావసరాల కోసమని, ఆదివారం మాంసం కోసమని నగర పోలీసులకు సమాధానమిచ్చిన ప్రజలు సోమ, మంగళవారం మాత్రం సరైన కారణాలు కూడా చెప్పకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ఇంట్లోనే ఉండండి...అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకండని అన్ని ప్రభుత్వ విభాగాలు నెత్తినోరు బాదుకున్నా అవేమీ పట్టనట్టుగా సిటీవాసులు వ్యవహరిస్తున్నారు. మరోవైపు తాజాగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జమాత్‌ ప్రార్ధనల్లో నగరం నుంచి వెళ్లొచ్చిన వారు 600 మందికిపైగా ఉన్నారన్న విషయం వెల్లడి కావడంతో ఆ వైరస్‌ వ్యాప్తి ప్రభావం ఏ రేంజ్‌లో ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు మాత్రం మాకేం బాధ్యత లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.

చెక్‌పోస్టుల వద్ద ఆపి...ప్లకార్డులు పట్టించినా...
గత సోమవారం నుంచి శుక్రవారం వరకు విధిగా లాక్‌డౌన్‌ను పాటిస్తూ వారివారి కాలనీల్లోనే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసిన నగరవాసులు...గత నాలుగు రోజులుగా మాత్రం అవేమీ పాటించడం లేదు. సుదూర ప్రాంతాలకు బైక్‌లు, కార్లపై వెళ్లి వస్తూ లాక్‌డౌన్‌ను బ్రేక్‌ చేస్తున్నారు. ఆయా వాహనదారులను  చెక్‌పోస్టుల వద్ద పోలీసులు ఆపి ఆయా వారిచేత ‘ఐ సపోర్ట్‌ లాక్‌డౌన్‌’ ‘చేతులు కడుక్కొండి, శుభ్రత పాటించండి’...తదితర నినాదాలున్న ప్లకార్డులు పట్టిస్తున్నారు. గంటల తరబడి నిలుచోబెడుతున్నారు. అయినా వాహనదారుల్లో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం రహదారి సమీపంలో పోలీసులు చెక్‌పోస్టు వద్ద వాహనాలు ఆపడంతో దాదాపు ప్యారడైజ్‌ వరకువందల వాహనాలు నిలిచిపోవడం చూస్తుంటే సాధారణ రోజుల్లాగానే తలపించింది. అలాగే నిత్యావసర సరుకులు కొనుగులు చేసే దుకాణాలు, కూరగాయల మార్కెట్ల వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు ఆకతాయిలు చేసే ఈ పనుల వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశముందనే ఆందోళన ప్రజల్లో కనబడుతోంది. ఢిల్లీకి వెళ్లొచ్చిన నగరవాసులు ఏయే ప్రాంతాల్లో తిరిగారో, ఎవరెవరినీ కలిశారో, ఎంత మందికి కరోనా వ్యాపించిందో అన్న టెన్షన్‌ వాతావరణమున్నా..సిటీజనులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని కొంతమంది నగరవాసులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు