ఎంజాయ్‌ ఏమాయె!

24 Jul, 2019 12:29 IST|Sakshi
ఫిజికల్‌ లిటరసీ డే సందర్భంగా చిన్నారుల సైక్లింగ్‌ (ఫైల్‌)

సండే సరదాలకు కాలం చెల్లినట్లేనా?  

రాహ్‌గిరి, ఫిజికల్‌ లిటరసీ డే కనుమరుగేనా?

వీకెండ్‌ సందడి అవసరమంటున్న సిటీజనులు  

శాశ్వత వేదిక, నిధుల కేటాయింపు తప్పనిసరి  

రాయదుర్గం: ఆదివారం వచ్చిందంటే చాలు.. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ఆడుతూ, పాడుతూ ఎంజాయ్‌ చేసే రోజులు నగర శివారులో పూర్తిగా కరువయ్యాయి. ఆదివారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రోడ్డంతా ఆటాపాటలతో సందడి చేసేవారు. వారమంతా పడ్డ కష్టాన్ని మరిచి  ఎంజాయ్‌ చేసేవారు. ఆదివారం వచ్చిందంటే కొన్నాళ్లు రాహ్‌గిరి కార్యక్రమం, ఆ తర్వాత ఫిజికల్‌ లిటరసీ కార్యక్రమంతో నడిరోడ్డంతా నాలుగు గంటలపాటు సందడిగా ఉండేది. మొదట్లో వంద మంది వస్తే గగనమే అనుకుంటే ఆ తర్వాత వేల సంఖ్యకు చేరుకోవడంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ప్రస్తుతం వీటి సందడి లేకుండా ఆదివారం రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒకప్పటి రాహ్‌గిరి, ఫిజికల్‌ లిటరసీ డే వంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇక కలగా మారుతాయా? అని పలువురు చర్చించుకుంటున్నారు. తీరిక లేకుండా నిత్యం బిజీబిజీగా గడిపే వారికి వీకెండ్‌లో మళ్లీ నడిరోడ్డుపై ఆటాపాటలతో కూడిన సందడి అవసరమని అభిప్రాయపడుతున్నారు.

అనంతరం ‘ఫిజికల్‌ లిటరసీ డే’..
రాహ్‌గిరిని అంతా మరిచిపోతున్న వేళ ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ చొరవతో కొంతమంది ఔత్సాహికుల తోడ్పాటుతో ఫిజికల్‌ లిటరసీ డేను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఐటీ కారిడార్‌కు వెళ్లే రోడ్డులోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీ రోడ్డులో షురూ చేశారు. 19 వారాలపాటు ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమం రోడ్డు విస్తరణ కోసం నిలిపివేయాల్సి వచ్చింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని జీఎంసీ బాలయోగి స్టేడియం ఎదుటకు మార్చారు. ఇక్కడ కొన్ని వారాల పాటు సాగినా వర్షాలు కురుస్తుండడంతో నిలిపివేశారు. ఆ తర్వాత ఇక ఇలాంటి కార్యక్రమాల కొనసాగింపు సందేహాస్పదంగా మారాయి. ఇప్పటికైనా నిర్వాహకులు పునరాలోచన చేసి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం వేళల్లో నిర్వహించేలా చూడాలని సిటీజనులు కోరుతున్నారు.

ప్రభుత్వం ఏం చేయాలి
ఆదివారం ఆటాపాటలతో అంతా సంతోషంగా గడిపేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి
శాశ్వత వేదికను ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలి
ఆటాపాటల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి  
నిర్వహణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి
శాశ్వత వేదికలో పాఠశాల విద్యార్థులకు శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి
నిర్వహణ కోసం ప్రత్యేక నియామకాలు చేపట్టాలి  
స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారినిప్రోత్సహించాలి

మొదట్లో ‘రాహ్‌గిరి’ షురూ..
సైబరాబాద్‌ పోలీసులు, పలు ఐటీ సంస్థల ప్రతినిధులు, ఇతర ఔత్సాహికుల కలయికతో రాహ్‌గిరి కార్యక్రమం నగరంలో మొదటిసారిగా మొదలైంది. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు నుంచి మైండ్‌స్పేస్‌ వరకున్న ఎడమవైపు రోడ్డుపై ఆదివారం రోజు ఉదయం పూట పూర్తిగా ఆటాపాటలతో ఎంజాయ్‌ చేసేవారు. ఆటలతో పాటు పలు పోటీలలో పాల్గొనేవారు. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా, మెడిటేషన్, కబడ్డీ, గల్లీ క్రికెట్, బ్యాడ్మింటన్, పెయింటింగ్‌లు వేస్తూ సరదాగా గడిపేవారు. 68 వారాల పాటు సాగిన రాహ్‌గిరి.. రోడ్డు విస్తరణ చేపట్టాల్సి రావడంతో నిలిపివేశారు.

సర్కారే సమకూర్చాలి..
సండే సందడి మళ్లీ మొదలు కావాలంటే ఒక శాశ్వత వేదిక, నిర్వహణకు అవసరమైన నిధులు ప్రభుత్వమే సమకూర్చాలి. వ్యక్తుల సమూహం ఇలాంటి లాంగ్‌టర్మ్‌ కార్యక్రమాలు నిర్వహించా లంటే సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వం చొరవ చూపి స్థలం కేటాయించి నిధులు మంజూరు చేసి ఔత్సాహికులతో కమిటీ వేసి నిర్వహణ బాధ్యత అప్పగిస్తే విజయవంతం కావడం ఖాయం. – విశాలరెడ్డి, రాహ్‌గిరి వ్యవస్థాపకురాలు, ఐడెంట్‌ సిటీ  

మానవ సంబంధాలు మెరుగు..
ప్రస్తుత యాంత్రిక జీవనంలో అందరూ బిజీబిజీగా గడిపేస్తున్న తరుణంలో రాహగిరి, ఫిజికల్‌ లిటరసీ డే కార్యక్రమాల నిర్వహణతో మానవ సంబంధాలు, పరిచయాలు పెరుగుతాయి. ప్రతి వ్యక్తిలో ఉల్లాసం, ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఇలాంటి వాటి నిర్వహణ చాలా అవసరం.  ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే శాశ్వత ప్రాతిపదికన నిర్వహణ సాధ్యం. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి.– టి.రామస్వామియాదవ్, కన్వీనర్, ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ 

మరిన్ని వార్తలు