మహాత్మా మన్నించు!

2 Oct, 2019 10:59 IST|Sakshi

నగరవాసుల్లో లోపించిన పర్యావరణ స్పృహ ‘స్వచ్ఛత’కు సహకారలేమి  

ఏరులై పారుతోన్న మద్యం   పెరిగిపోతున్న నేర ప్రవృత్తి  

మహిళలపై లైంగిక వేధింపులు అందని ద్రాక్షగా విద్య  

సమాధిలో సమానత్వం మంటల్లో మానవత్వం   

సాక్షి, సిటీబ్యూరో: సత్యం, అహింస, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, మద్యపాన నిషేధం, కుల, మత, జాతి అంతరాలు లేని, నేరాలు ఘోరాలు లేని సమాజం, అందరికీ అన్నీ సమానంగా అందే సమసమాజ స్థాపన కోసం జాతిపిత మహాత్మాగాంధీ జీవితాంతం కృషి చేశారు. ఆయా అంశాలపై ఆయన చేసిన ప్రయోగాల సారమే బాపూ జీవితం. నేడు ఆ రుషి, మహార్షి 150వ జయంతి. మరి ఆయన ఆశయాలను మనం ఎంత వరకు అందిపుచ్చుకుంటున్నాం? మహాత్ముడు చెప్పిన మాటలను ఎంత మేరకు ఆచరిస్తున్నాం? బాపూ బాటలో ఏ మేరకు నడుస్తున్నాం? ఇప్పుడివన్నీ చర్చనీయాంశాలే. చీకటి భారతంలో వెలుగులు నింపిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన అడుగుజాడల్లో గ్రేటర్‌ ఏ మేరకు పయనించిందో ఓసారి అవలోకనం చేసుకుందాం.  

వనం.. మాయం  
నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారింది. చెట్లు మాయమై బహుళ అంతస్తుల భవంతులు వెలిశాయి. ఫలితంగా కాలుష్యం పెరిగిపోయింది. వాయు, జల, నేల కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. నగరంలో 50 లక్షల వాహనాలకు గాను 15 లక్షలు కాలం చెల్లినవి ఉన్నాయి. ఓవైపు వీటి నుంచి వెలువడే ప్రమాదకర వాయువులు, మరోవైపు పరిశ్రమల రసాయనాలతో సిటీజనులకు స్వచ్ఛమైన వాయువు కరువైంది. సిటీలో సుమారు 185 వరకున్న చెరువులు, కుంటలు ఆర్గానిక్‌ కాలుష్యంతో ఆగమవుతున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు ఆయా జలాశయాల్లో చేరడంతో నీరంతా కలుషితమవుతోంది. ఇక బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియట్‌ కంపెనీల నుంచి వెలువడే ఘన, ద్రవ కాలుష్య ఉద్గారాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండడంతో వాటిలోని భార లోహాలు, మూలకాలు భూమిలోకి ఇంకుతున్నాయి. ఫలితంగా నేల కాలుష్యం ఏర్పడుతోంది. ప్రధానంగా మెర్క్యురీ, లెడ్, క్రోమియం, ఆర్సినిక్, నికెల్, మాంగనీస్, కాపర్, కోబాల్ట్‌ తదితర మూలకాలుండడం ఆందోళన కలిగిస్తోంది. 

మద్యం మత్తు ‘ఫుల్లు’  
గ్రేటర్‌ పరిధిలో మద్యపాన నిషేధం కాగితాలకే పరిమితమైంది. రోజురోజుకు మద్యం అమ్మకాలు ‘ఫుల్లు’గా సాగుతున్నాయి. సుమారు 300 మద్యం దుకాణాలు.. మరో 400 వరకు బార్లున్నాయి. వీటిల్లో నిత్యం సుమారు రూ.25 కోట్ల అమ్మకాలు సాగుతుంటాయి. పండగలు, సెలవుదినాల్లో అమ్మకాలు చుక్కలను తాకుతాయి. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, వేతనజీవులు, కార్మికులు మద్యానికి బానిసై తమ సంపాదనలో సింహభాగం ఖర్చు చేస్తుండడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మరోవైపు మందుబాబులు అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చేరి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. మద్యపానం నిషేధం విషయంలో ప్రభుత్వం ప్రేక్షకపాత్రకే పరిమితమైందన్నది సుస్పష్టం. 

అంతటా అ‘స్వచ్ఛ’త  
మిగతా నగరాలతో పోలిస్తే స్వచ్ఛ భారత్‌ ర్యాంకింగ్స్‌లో సిటీ వెనకబడుతోంది. నగరం పరిధిలో నిత్యం 5వేల టన్నుల మేర ఘన వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని డంపింగ్‌యార్డుకు తరలించే క్రమంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతున్నాయి. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో హడావుడి తప్ప ఫలితం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసేందుకు ఇచ్చిన రెండు డబ్బాల విధానం సత్ఫలితాన్నివ్వలేదు. ప్రధాన రహదారులు, వీధుల్లో తరచూ చెత్తాచెదారం దర్శనమిస్తోంది. బహిరంగ మల, మూత్ర విసర్జన కొన్ని ప్రాంతాల్లో యథావిధిగా కొనసాగుతోంది. స్వచ్ఛత విషయంలో ఇటు బల్దియా.. అటు పౌర సమాజం ఉద్యమస్ఫూర్తితో పనిచేసినప్పుడే మహాత్ముడు ఆశించిన లక్ష్యం సాకారమవుతుంది. 

విద్యాబారం.. ఫీ‘జులుం’  
అన్ని వర్గాల వారికీ ఉచితంగా గుణాత్మక విద్య అందించాలన్న మహాత్ముడి లక్ష్యం నెరవేరడం లేదు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు వేలల్లోనే. ఇక ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదువుకునే వారి సంఖ్య లక్షలకు చేరింది. దీంతో గ్రేటర్‌లో విద్యా వ్యాపారం రూ.కోట్లకు పడగలెత్తింది. అల్పాదాయ, మధ్యతరగతి వర్గం పిల్లల ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు కొనుగోలు చేసేందుకు అప్పులపాలు కావాల్సిన దుస్థితి తలెత్తింది. అక్షరాస్యతలో అగ్రభాగాన ఉన్నప్పటికీ ప్రైవేటు ఫీ‘జులు’ంతో అన్ని వర్గాలకు నాణ్యమైన గుణాత్మక విద్య అందని ద్రాక్షగా మారింది. 

తీవ్రమైన నేరం  
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు కొంతమేర తగ్గుముఖం పడుతున్నా... నేర తీవ్రత మాత్రం భయాకరంగా ఉంటోంది. నడిరోడ్డుపై హత్యలు, సమీప బంధువులే నరుక్కోవడం, చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు మూడేళ్లలో బాగా పెరిగాయి. సొత్తు సంబంధిత హత్యలు తగ్గుముఖం పట్టినా.. నేరం మనుషుల ప్రాణాలు పోయే తీవ్రతలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇప్పటికీ మూఢనమ్మకాలతో హత్యలు చేస్తుండడం, మానవత్వం మరిచి ప్రవర్తిస్తుండడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. పోలీసులు నివారణ చర్యలు తీసుకుంటున్నా ఘటనలు జరుగుతుండడం కలవరపెడుతోంది.   

మహిళా వేదన  
మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే మూడు కమిషనరేట్లలో బాలికలు, అమ్మాయిలు, మహిళలపై వేధింపులు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఏకంగా 5,432 కేసులు నమోదు కాగా... 4,830 మేజర్లపైనే ఉండడం వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం చేస్తోంది. కళాశాల కుర్రాళ్లు, ఉద్యోగులు, వివిధ పనులు చేస్తున్న మరికొందరు వేధింపులకు పాల్పడుతున్నారని షీ బృందాల గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీరిలో 602 మంది మైనర్లు కూడా ఉండడం అందరినీ కలవరపెడుతోంది. మరోవైపు మహిళలకు సంబంధించి వరకట్న హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, అత్యాచారాలు కొంతమేర తగ్గుముఖం పట్టినా... ఉమెన్‌ ట్రాఫికింగ్‌ పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.   

మరిన్ని వార్తలు