ఆదివారమూ శాకాహారమే!

16 Mar, 2020 08:16 IST|Sakshi

గ్రేటర్‌లో భారీగా పడిపోయిన చికెన్‌ విక్రయాలు

మటన్, చేపలుఅమ్మకాలపైనా ప్రభావం

కరోనా భయంతో నాన్‌వెజ్‌కు దూరంగా సిటీజనం   

సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా ఆదివారం వచ్చిందంటే చాలు నగరంలో చికెన్‌ విక్రయాలు జోరుగా సాగుతాయి. మాంసాహారులకు భలే పసందు. కానీ.. ప్రస్తుతం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వైరస్‌ భయంతో సిటీజనులు చికెన్‌కు దూరంగా ఉన్నారు. వెజిటేరియన్‌ వంటలకే ప్రాధాన్యమిస్తున్నారు. శుభకార్యాలు, విందులు, వినోదాల్లోనూ కూరగాయల భోజనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో చికెన్‌ విక్రయాలు 70 శాతం, మటన్‌ విక్రయాలు 30 శాతానికి దిగజారాయి. చేపల అమ్మకాలపైనా ప్రభావం పడిందని వ్యాపారులు చెబుతున్నారు. మిగతా రోజుల కన్నా ఆదివారాల్లో చికెన్, మటన్‌ విక్రయాలు భారీగా సాగుతాయి. కానీ ఈ ఆదివారం ఆ పరిస్థితి కనిపించలేదు. కరోనా ప్రభావంతో సాధారణ రోజుల్లో వలెనే చికెన్, మటన్‌ విక్రయాలు జరిగాయని ఆయా దుకాణాల నిర్వాహకులు స్పష్టంచేస్తున్నారు. చికెన్, మటన్‌ షాపులు వద్దఆదివారం సందడే లేకుండాపోయిందంటున్నారు. కొనుగోలుదారులు లేక వెలవెలబోయాయి.  

చికెన్‌ ధరలు నేలచూపులు..
సాధారణంగా మార్చి నెలలో చికెన్‌ ధరలు ఎక్కువగానే ఉంటాయి. కరోనా ప్రభావంతో  భారీస్థాయిలో ధరలు తగ్గడంతో రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉండవచ్చని మార్కెట్‌ విశ్లేషకుల అంచనా. మటన్, ఫిష్‌ రేట్లతో పోలిస్తే చికెన్‌ ధరలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటాయి. దీంతో వారు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. సీజన్‌ ఏదైనా చికెన్‌ వైపే నగరవాసులు మొగ్గుచూపుతారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో చికెన్‌తో పాటు ఇటు మటన్‌ అటు ఫిష్‌ అమ్మకాలు కూడా విపరీతంగా పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా ఆషాఢం, శ్రావణ మాసం చికెన్‌ వినియోగం తగ్గుతుంది. దీంతో ధరలు కూడా తగ్గుతాయి. కానీ ఆషాఢం, శ్రావణ మాసాల కంటే «కరోనా ప్రభావంతో చికెన్‌ ధరలు దారుణంగా పడిపొయాయి.

మూడింతలు తగ్గిన విక్రయాలు
గ్రేటర్‌ పరిధిలో సాధారణ దినాల్లో రోజుకు 20 లక్షల కిలోల చికెన్‌ అమ్ముడవుతుంది.  ఆదివారం మాత్రం 50 నుంచి 60 లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. మటన్‌ మామూలు రోజుల్లో రోజుకు లక్ష కిలోలు విక్రయాలు జరిగితే ఆదివారం మాత్రం 4 నుంచి 5 లక్షల కిలోలు విక్రయాలు జరుగుతాయి. కానీ.. ఈ ఆదివారం మాత్రం మూడింతలు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.  

నష్టాలు చవిచూస్తున్నాం..  
కరోనా భయం నేపథ్యంలో చికెన్‌ విక్రయాలు భారీగా పడిపోయాయి. ప్రతి ఆదివారం సుమారు 500 నుంచి 700 కిలోల చికెన్‌ అమ్ముతాం. కానీ ఈ ఆదివారం 150 కిలోలు మాత్రమే విక్రయించాం. నష్టాలతో వ్యాపారం కొనసాగిస్తున్నాం.  – మహ్మద్‌ గౌస్, మహమూద్‌ చికెన్‌ సెంటర్‌ జహరానగర్‌

గిరాకీ బాగా తగ్గింది..
వ్యాపారం చాలా వరకు తగ్గింది. గతంలో కొనుగోలుదారులతో షాపు ఎప్పుడూ సందడిగా ఉండేది. ఆదివారం ఎక్కువ మంది పనివాళ్లను పెట్టేవాళ్లం. 1000 నుంచి 1500 కిలోల మటన్‌ విక్రయాలు జరిగేవి. కరోనా భయంతో మటన్‌ విక్రయాలు తగ్గాయి.  – మహ్మద్‌ మక్బూల్, షరీఫ్‌ మీట్‌ షాప్, మొగల్‌పురా 

మరిన్ని వార్తలు