నీడ..ఏడ?

30 May, 2019 09:07 IST|Sakshi
ఉప్పల్‌ రింగురోడ్డు వద్ద ఎండలో ప్రయాణికుల పాట్లు

మండుటెండల్లో మాడుతున్న ప్రయాణికులు

గ్రేటర్‌లో 2,200 బస్టాపులు వెయ్యి చోట్ల మాత్రమే షెల్టర్లు

మూడు ఏసీ షెల్టర్లకే పరిమితమైన జీహెచ్‌ఎంసీ

తాత్కాలిక నీడ సైతం కరువైన వైనం

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌.. అతిపెద్ద ప్రయాణికుల కూడలి. రైళ్లలో రాకపోకలు సాగించే సుమారు లక్షా 80 వేల మంది ప్రయాణికులతో పాటు, నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సుల్లో తిరిగే మరో 10 లక్షల మంది ఈ కూడలి కేంద్రంగానే రాకపోకలు సాగిస్తారు. రేతిఫైల్, రైల్వేస్టేషన్‌ ప్రాంగణం, చిలకలగూడ చౌరస్తా, అల్ఫా హోటల్, గురుద్వారా, తదితర ప్రాంతాల్లో ఆరు బస్టాపులు ఉన్నాయి. వందలకొద్దీ బస్సులు ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. ఒక్క రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌ మినహా మిగతా అన్ని చోట్ల అరకొర షెల్టర్లే ఉన్నాయి. అల్వాల్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, బాలానగర్, జీడిమెట్ల, తదితర రూట్లలో వెళ్లే ప్రయాణికులు నిప్పులు చెరిగే ఎండల్లో బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా షెల్టర్లు లేని బస్టాపులు కొన్నయితే, అసలు షెల్టర్లే లేనివి చాలానే ఉన్నాయి. సికింద్రాబాద్‌ మాత్రమే కాదు.. నగరంలోని అనేక చోట్ల  బస్‌షెల్టర్లు లేకపోవడంతో కొద్ది రోజులుగా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రయాణికులు మండుటెండల్లో విలవిల్లాడుతున్నారు. మెహదీపట్నం, ఎల్‌బీనగర్, ఉప్పల్, లిబర్టీ, కుత్బుల్లాపూర్‌ వంటి చోట్ల ప్రయాణికులకు కనీస నీడ కూడా లేదు. 

మోడల్‌ షెల్టర్లకే పరిమితం...
ఖైరతాబాద్, శిల్పారామం, కూకట్‌పల్లిలో ఆధునిక బస్‌షెల్టర్లు కట్టించిన అధికారులు ఆపై ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. గ్రేటర్‌లో సుమారు 2,200 బస్టాపులు ఉండగా 1000 చోట్ల మాత్రమే అరకొర షెల్టర్లు ఉన్నాయి. మరో 1200 చోట్ల కనీస నీడ జాడ కూడా కానరాదు. ప్రయాణికులు నిప్పుల కొలిమిలో  నిలుచుని బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 10 గంటలకే భగ్గుమంటున్న ఎండలు.. సాయంత్రం 4 గంటలు దాటినా తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో వివిధ ప్రాంతాల మధ్య సిటీ బస్సుల్లో ప్రయాణించే వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నగర శివార్లలోని వందలాది బస్టాపుల్లో ఎలాంటి షెల్టర్లు లేవు. మరోవైపు  ఉప్పల్‌ నుంచి కూకట్‌పల్లి మార్గంలో, కోఠి నుంచి జాంబాగ్‌ వైపు, కూకట్‌పల్లి నుంచి ఖైరతాబాద్‌ వైపు మెట్రో రూట్లలో అప్పట్లో నిర్మాణ పనుల దృష్ట్యా చాలా చోట్ల షెల్టర్లు తొలగించారు. వాటి స్థానంలో కనీసం 600 షెల్టర్లు అత్యవసరంగా కట్టించాలని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు సగం కూడా పూర్తి చేయలేదు. గ్రేటర్‌లో ప్రతి రోజు 3,850 బస్సుల్లో సుమారు 33 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. నగరంలో ప్రస్తుతం అతి పెద్ద ప్రజారవాణా సంస్థ ఇదే. కానీ  ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సదుపాయాలు కల్పిచకపోవడం గమనార్హం.

ఏళ్లు గడిచినా మారని పరిస్థితి 
సనత్‌నగర్‌ బస్‌స్టేషన్‌ ప్రధాన కేంద్రంగా ప్రతిరోజు 180 బస్సుల్లో వేలమంది ప్రయాణిస్తుంటారు. కానీ అమీర్‌పేట్‌ మైత్రీవనం, సారథి స్టూడియో, ఎర్రగడ్డ చౌరస్తా, సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్, జెక్‌కాలనీ, బల్కంపేట్‌లో బస్సు షెల్టర్లు లేనేలేవు.
ఈఎస్‌ఐ (కూకట్‌పల్లి వైపు వెళ్లే బస్టాపు), ఎర్రగడ్డ ప్రాంతాల్లోని బస్‌షెల్టర్లు
వ్యాపారుల ఆక్రమణల్లో ఉన్నాయి.  
శేరిలింగంపల్లి రాయదుర్గం దాబా కూడలిలో మూడు చోట్ల బస్‌ షెల్టర్లు అవసరమైతే ఒక్కచోటే నిర్మించారు.  
ఖాజాగూడలో ఎన్టీఆర్‌ విగ్రహం వైపు, నానక్‌రాంగూడ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లితాండ, గోపన్‌పల్లి వంటి ప్రాంతాల్లో బస్‌ షెల్టర్లు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.  
కుత్బుల్లాపూర్‌లోని బస్‌షెల్టర్లు లారీల అడ్డాలు, మెకానిక్‌ షెడ్లుగా మారిపోయాయి. మొత్తం 14 బస్టాప్‌ల్లో 10 షెల్టర్లు శిథిలావస్థకు
చేరుకున్నాయి.  
పాతబస్తీలో పుట్‌పాత్‌లు, దుకాణాల అరుగులే
షెల్టర్లయ్యాయి.  
లాల్‌దర్వాజ మోడ్‌ నుంచి నయాపూల్‌ చౌరస్తా వరకు 9 బస్టాప్‌లున్నా.. ఖిల్వత్, మూసాబౌలి, నయాపూల్‌ చౌరస్తాల్లో మాత్రం మూడు మాత్రమే ఉన్నాయి.  
లాల్‌దర్వాజ మోడ్, శాలిబండ, శాలిబండ చౌరస్తా, పేట్లబురుజు బస్టాప్‌లలో బస్‌ షెల్టర్లు లేవు.  
దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, అక్బర్‌బాగ్, సైదాబాద్, చాదర్‌ఘాట్, మాదన్నపేట, సైదాబాద్, ఆర్‌కేపురం, సరూర్‌నగర్‌
డివిజన్‌లో చాలా చోట్ల బస్‌షెల్టర్లు లేవు.  
రామంతాపూర్‌ ప్రధాన రహదారిలో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ వద్ద స్కై సిటీ అపార్ట్‌మెంట్‌ పక్కన, ప్రభుత్వ హోమియో ఆస్పత్రి ఎదురుగా ఉన్న బస్టాప్‌లో ఎన్నో ఏళ్లుగా షెల్టర్లు నిర్మించనే లేదు. దీంతో ప్రయాణికులు నీడ కోసం సమీపంలోని దుకాణాలను ఆశ్రయిస్తున్నారు.  
ఉప్పల్‌ గాంధీ విగ్రహం వద్ద ఉన్న
బస్టాప్‌ను కొద్దిగా వెనక్కి జరిపారుగాని ఎలాంటి షెల్టర్‌ నిర్మించలేదు.  
మౌలాలి యునాని ఆస్పత్రి, వినాయకనగర్, సంతోషిమాతానగర్, ఓల్డ్‌ సఫిల్‌గూడ, లక్ష్మీనగర్, ఆర్టీసీ కాలనీ, భరత్‌నగర్, గణేష్‌నగర్‌ బస్తీలలో బస్‌స్టాపుల వద్ద షెల్టర్లు లేక ప్రయాణికులు ఎండలో
ఉండాల్సిన పరిస్థితి.  
గౌతమ్‌నగర్‌లోని సాయినగర్, ఉత్తంనగర్, దయానంద్‌నగర్, మల్లికార్జుననగర్, జ్యోతినగర్, మిర్జాల్‌గూడ, సాయిరాం
థియేటర్‌ తదితర ప్రాంతాల్లో షెల్టర్లు లేవు.
నేరెడ్‌మెట్‌ వెళ్లే మార్గంలో ఆనంద్‌బాగ్, వినాయకనగర్‌ చౌరస్తాల్లో బస్‌షెల్టర్లు లేవు.  
సికింద్రాబాద్‌ వైపు వెళ్లే మార్గంలో వినాయకనగర్, ఆర్‌కేనగర్, కేశవనగర్‌ చౌరస్తా, కపా కాంప్లెక్స్, గీతానగర్, వెంకటేశ్వరనగర్‌ ప్రాంతాల్లో బస్సు షెల్టర్లు లేవు.
నేరేడ్‌మెట్‌ చౌరస్తా, వాయుపురి బస్టాప్, కేశవనగర్‌ బస్‌స్టాప్‌లలో షెల్టర్‌ లేకప్రయాణికులు ఎండకు, వానకు ఇబ్బంది పడుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు