డెంగీ కౌంటర్లు

24 Aug, 2019 11:14 IST|Sakshi

జ్వర బాధితుల పరీక్షల కోసం 21 ప్రత్యేక కౌంటర్లు

ఫీవర్‌ ఆస్పత్రిలో 10, ఉస్మానియాలో 5, గాంధీలో 6

ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం

సెప్టెంబర్‌ 1 నుంచి 15 వరకు 695 ఉచిత వైద్యశిబిరాలు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సాధారణ జ్వరం సోకి ఆస్పత్రులకు వెళ్లినా డెంగీ పేరిట రోగులను పీల్చిపిప్పి చేస్తున్నారు. ఈ పరిస్థితి నివారణతోపాటు ఈ వర్షాకాల సీజన్‌లో అంటువ్యాధుల నివారణ కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా  జీహెచ్‌ఎంసీ మెడికల్‌ ఆఫీసర్లతోపాటు గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల వైద్యాధికారులు, ఎంటమాలజీ అధికారులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌  ఎం.దానకిశోర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జ్వరం సోకిన వారికి ఏ వ్యాధి అయినది సరిగ్గా నిర్ధారించేందుకు ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో జ్వర నిర్ధారణకు ప్రత్యేకంగా 21 కౌంటర్లను అదనంగా తెరవాలని సమావేశంలో నిర్ణయించారు. జ్వరాలతో వచ్చే రోగులకు ప్రత్యేకంగావైద్యపరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారించేందుకు ఏర్పాటు చేయనున్న ఈ కౌంటర్లు ఉస్మానియాలో 5, గాంధీలో 6, ఫీవర్‌ ఆస్పత్రిలో 10 ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక కౌంటర్లలో జనరల్‌ ఫిజీషియన్‌ అందుబాటులో ఉంటారని, సాయంత్రం 4 గంటల వరకు ఇవి తెరచి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. పలు ప్రైవేట్‌  ఆస్పత్రుల్లో ఎలీసా టెస్ట్‌ నిర్వహించకుండానే డెంగ్యూగా ప్రకటిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి నిర్ధారణ అయిన డెంగీ వివరాల జాబితా ఇప్పటి వరకు కూడా వైద్య, ఆరోగ్యశాఖకు అందలేదని స్పష్టం చేశారు.

జీహెచ్‌ఎంసీ ఇప్పటి వరకు రెండు  విడతల్లో దాదాపు 1100 మెడికల్‌ క్యాంపులు నిర్వహించగా, వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీవరకు మరో 695 మెడికల్‌క్యాంపులు నిర్వహించనున్నట్లు కమిషనర్‌ దానకిశోర్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌  జిల్లాలో 250, రంగారెడ్డి జిల్లాలో 165, మేడ్చల్‌ జిల్లాలో 165 మెడికల్‌ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, మలేరియా అధికారులు,జీహెచ్‌ఎంసీ మెడికల్‌ ఆఫీసర్లు,  ఎంటమాలజీ విభాగం అధికారులు సంయుక్తంగా అంటువ్యాధులు ప్రబలే  వల్నరబుల్‌ ప్రాంతాల్లో  ఈ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దోమలవ్యాప్తి నిరోధానికి వివిధ విభాగాలతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ సందీప్‌జా, జోనల్‌ కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు